చూపు బాగుంటేనే ఇంటాబయటా పనులన్నీ చక్కబెట్టుకోగలం. అందుగ్గానూ మొట్టమొదట చేయాల్సింది సంపూర్ణ పోషకాహారం తినడం. పాలు, పెరుగు, వెన్న, గుడ్డు, క్యారెట్, టమాట, బీన్స్, చిలగడదుంప, మామిడి, కమలా, ద్రాక్ష, బ్రొకొలి, అక్రోట్లు, జీడిపప్పు, చీజ్ మొదలైన ఎ-విటమిన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
- కాటుక, ఐలైనర్లు నాణ్యమైనవే వాడాలి. లేదంటే కళ్ల సమస్యలు రావచ్చు.
- కంప్యూటర్‌పై పని చేసేవాళ్లు తరచూ రెప్పలార్పుతూ ఉండాలి. ప్రతి 20 నిమిషాలకూ చూపును మళ్లించి 20 అడుగుల దూరానున్న వస్తువును 20 క్షణాలపాటు చూడాలి. కంప్యూటర్ స్క్రీన్ కంటికి కనీసం 20 అంగుళాల దూరంలో ఉండాలి. స్క్రీన్ పైభాగం కళ్లకి కాస్త దిగువన ఉండేలా అమర్చుకోవాలి. గ్లేర్ పడకుండా చూసుకోవాలి.
- మరీ ఎక్కువ కాంతి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. పరిసరాలలో తగినంతగా కాంతి ఉండేలా చూసుకోవాలి. లేకపోతే కళ్లు అధిక ఒత్తిడికి లోనై కంటి చూపు మందగించే ప్రమాదం ఉంది.
- మీరు పొగ తాగే అలవాటు లేకపోవచ్చు. కానీ ధూమపానం చేసేవారి పక్కన నిలబడ్డా... సిగరెట్ పొగకు అతిసమీపంలో ఉన్నా అది కంటి చూపుపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. సిగరెట్ పొగబారిన పడ్డవారిలో కళ్లు ఎర్రబడటమో, నీరు కారడమో లేక కళ్లు ఉబ్బడమో జరుగుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు తల ఎత్తులో ఉండేందుకు తలకింద రెండు దిండ్లు పెట్టుకుని పడుకుంటే కళ్ల కింద నీరు చేరదు. వాపు కూడా ఏర్పడదు. రాత్రికి రాత్రే ద్రవాలు ఆరిపోతాయి.
- కాంటాక్ట్ లెన్స్ వాడేవారు ముందు చేతులను శుభ్ర పరచుకోవాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
- టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు మందులు క్రమం తప్పక వాడాలి. లేదంటే కంటిచూపు తగ్గే ప్రమాదముంది.
- చూపులో ఇబ్బంది కలిగినా, ఇతరత్రా కంటి సమస్యలు వచ్చినా జాప్యం చేయకుండా కళ్ల డాక్టరును సంప్రదించాలి.
- ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత నిద్ర అవసరం. నిద్రలేమితోనూ చూపు సమస్యలు వస్తాయి.
- కళ్లకు వ్యాయామం అవసరం. తల కదపకుండా అన్నివైపులకూ చూపు సారించే కంటి వ్యాయామం చేయాలి.
- ఎప్పుడైనా కళ్లు దురదగా అనిపిస్తే చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.
- ఎండలో వెళ్లేటప్పుడు చలువ కళ్లద్దాలు ధరించడం మంచిది.
- రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల కూడా కళ్లు తేటగా ఉంటాయి.
- వాహన చోదకులు ప్రయాణాలలో తప్పకుండా కళ్ళద్దాలు ధరించాలి. లేకపోతే ఎదురుగాలి వలన కంట్లో తేమ ఆవిరవుతుంది. కళ్లపై ఒత్తిడి పెరిగి కంటి చూపు మందగించే అవకాశం ఉంది.
- ఉదయం లేదా సాయంత్రం చివరలో సూర్యరశ్మిలో ఉండటం వల్ల బిగుతైన నాడి కండరాలు పట్టుకోల్పోవడం ద్వారా కళ్లు మరియు కంటిపాపలు మెరుగుపడతాయి.