తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పెళ్లి... ఎందుకు పెటాకులవుతోంది..? - తెలంగాణ వార్తలు

Relationship Problems: పెళ్లంటే... పందిళ్లు, సందళ్లు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూమూడే ముళ్లు ఏడే అడుగులు... మొత్తం కలిపి నూరేళ్లు... అని కొద్ది మాటల్లో క్లుప్తంగా చెప్పిన మన తరతరాల సంప్రదాయానికి ఆధునిక సమాజం పెద్ద సవరణలే చేస్తోంది. పలురకాల ఈవెంట్లూ ఫొటోషూట్లతో శుభకార్యాన్ని చిరస్మరణీయంగా మలచుకోవడంలో కొత్త పోకడలు పోయినట్లే, వివాహానంతర జీవన విధానంలోనూ ఎన్నో మార్పుల్ని తెచ్చింది. అరమరికల్లేకుండా ఆలూమగలూ ఒక్కమాటపై నిలిచినంత కాలమే ఆ బంధం కొనసాగుతుందనీ ఎక్కడ తేడా వచ్చినా ఎవరి దారి వాళ్లదేనన్న ఎరుక కలిగి ఉండాలనీ.. హెచ్చరిస్తోంది. అవును, గత రెండు దశాబ్దాలుగా విడాకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది మరి.

Relationship Problems
Relationship Problems

By

Published : Jan 29, 2023, 1:48 PM IST

Relationship Problems: పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు. భార్యాభర్తలిద్దరూ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు ముందుకు వచ్చారు. కౌన్సెలర్‌ ఇద్దరినీ కూర్చోబెట్టి విషయం ఏమిటని అడిగాడు. ‘విడాకులు తీసుకుంటాం’ అని ముక్తకంఠంతో చెప్పారు. ‘అదే ఎందుకూ...’ అడిగాడాయన. ‘ఆమె నా తల పగలగొట్టింది...’ నుదుటి మీద దెబ్బని తడుముకుంటూ కోపంగా చెప్పాడు అబ్బాయి.

ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూశాడు కౌన్సెలర్‌. ‘నేనేం కొట్టాలని కొట్టలేదు. తనే ముందు నన్ను కొట్టాడు’ విసురుగా చెప్పింది అమ్మాయి. డబ్బు ఖర్చుచేసే విషయంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగిందట. కోపంలో అతను ఆమె చెంప పగలగొట్టాడు. ఆమె చేతిలోని ఫోన్‌ను అతడికేసి విసిరింది. అది అతడి తలకు తగిలింది. విషయం తెలిసి ఇద్దరి అమ్మానాన్నలూ వచ్చేశారు.

తాము అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డపై చేయిచేసుకున్న అల్లుడిని క్షమించేది లేదన్నారు అమ్మాయి తల్లిదండ్రులు. మొగుడి మీద చెయ్యెత్తిన అమ్మాయిని తమ కోడలిగా భరించలేమన్నారు అబ్బాయి తల్లిదండ్రులు. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.

మరో జంట...పెళ్లై ఆర్నెల్లు. మంచి ఉద్యోగాలు. ఇద్దరూ మొన్నమొన్నటివరకూ బాగానే ఉన్నారు. అకస్మాత్తుగా అమ్మాయి విడాకులకు దరఖాస్తు చేసింది. ఎందుకనీ అంటే- భార్యాభర్తల మధ్య పని విషయంలో తరచూ గొడవలు అవుతున్నాయట. ఇంటిపనుల్ని ఇద్దరూ పంచుకుని ఏ పని అయినా రోజుకొకరు చొప్పున చేయాలని ముందుగానే ఒక ఒప్పందానికి వచ్చారట.

ఇప్పుడా అబ్బాయి దాన్ని మర్చిపోయి- నేను చేయను పొమ్మన్నాట్ట... అమ్మాయి వేరే రూమ్‌ చూసుకుని వెళ్లిపోయింది. విడాకులకు నోటీసు పంపింది. యువ రక్తం కదా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ విడాకులు తీసుకోవాలన్న నిర్ణయానికి వయసు అడ్డు కాదనిపిస్తోంది. ఆ మధ్య లోక్‌ అదాలత్‌ ముందుకు ఒక కేసు వచ్చింది. ఆయనకి 74, ఆమెకు 65. ముంబయిలో ఉండేవారు.

పిల్లల పెళ్లిళ్లు కాగానే భర్తనుంచి విడిపోయి ఒంటరిగా ఉంటూ ఫ్యామిలీ కోర్టులో విడాకులూ జీవనభృతీ కోరుతూ కేసు పెట్టింది భార్య. ఆరోపణలూ ప్రత్యారోపణలూ చేసుకుంటూ నాలుగు కేసులు పెట్టుకున్నారు. వాటి విచారణకు తిరిగి తిరిగీ విసిగిపోయి చివరికి లోక్‌ అదాలత్‌ ముందుకు వెళ్లారు ఇద్దరూ. అక్కడి న్యాయాధికారులు నచ్చజెప్పినా లాభం లేకపోవడంతో అప్పటికప్పుడు విడాకులు మంజూరు చేశారు.

ఏ నగరంలో కుటుంబన్యాయస్థానం ముందు చూసినా ఇలాంటి కేసులు వందలూ వేలల్లో కన్పిస్తున్నాయి. మన దగ్గర ప్రతి జిల్లాలోనూ కుటుంబ న్యాయస్థానాలు ఉన్నాయి. ఒక్కటి సరిపోవడం లేదని కొన్ని జిల్లాల్లో అదనపు న్యాయస్థానాలనూ పెట్టారు. ఉదాహరణకు హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించిన రెండు కుటుంబ న్యాయస్థానాలనూ చూస్తే 2022లో ఈ కోర్టుల్లో విడాకులు, వివాహహక్కుల పునరుద్ధరణ, మెయింటెనెన్స్‌, పిల్లల కస్టడీకి సంబంధించి 2125 కేసులు నమోదయ్యాయి.

వీటిల్లో అన్నిటికన్నా ఎక్కువ ఉండేది విడాకుల కేసులేనంటున్నారు న్యాయనిపుణులు. మొత్తం కుటుంబ వివాదాలకు సంబంధించి రోజుకు 80నుంచి వంద కేసులు ఈ కోర్టు ముందుకు వస్తున్నాయట. హైదరాబాద్‌ పెద్ద నగరం కాబట్టి ఎక్కువ కేసులు వస్తున్నాయనుకుంటే పొరపాటే. సంగారెడ్డి కోర్టులో కూడా ఏటా వెయ్యినుంచి 1500 కేసులు నమోదవుతున్నాయట.

అంకెలే చెబుతున్నాయి:ప్రపంచ సగటుతో చూస్తే- వెనక మన దేశంలో విడాకులు చాలా తక్కువ. 1.1 శాతం మాత్రమే ఉండేవి. దాంతో విడాకులు తక్కువ ఉన్న దేశంగా పేరుండేది. అలాగే ప్రపంచమంతటా అధికశాతం విడాకుల కేసుల్ని మహిళలు పెడుతోంటే, మన దేశంలో పురుషులు మాత్రమే పెట్టేవారు. ఇప్పుడీ రెండు విషయాల్లోనూ మార్పు వచ్చింది. మన దేశంలోనూ గత రెండు దశాబ్దాలుగా విడాకుల కేసులు బాగా పెరుగుతున్నాయి.

దాదాపు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. అసలు 1941 తర్వాతే మన జనాభా లెక్కల్లో విడాకుల కేసుల గురించి విడిగా నమోదు చేయడం మొదలెట్టారు. 1961 నుంచి న్యాయస్థానంలో విడాకులు తీసుకున్నవారితో పాటు, పెద్దల ఎదుట పరస్పర అంగీకారంతో విడిపోయినవారినీ నమోదుచేస్తున్నారు. 2011 జనాభా లెక్కల్లో మొదటిసారి న్యాయస్థానంలో చట్టపరంగా విడాకులు తీసుకున్నవారి సంఖ్యనూ, అనధికారికంగా విడిపోయిన వారి సంఖ్యనూ విడివిడిగా నమోదుచేశారు.

అప్పుడు ఆ లెక్కల్ని విశ్లేషిస్తే 2001 నుంచి 2011 మధ్య విడిపోయిన వారి సంఖ్య 48 శాతం పెరిగిందని తేలింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం- దాదాపుగా అన్ని వర్గాల్లోనూ విడిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే విడాకులు తీసుకున్న పురుషుల్లో అధికశాతం తిరిగి వివాహం చేసుకుంటున్నారు. మహిళల్లో మాత్రం చాలా తక్కువ మంది పునర్వివాహం చేసుకుంటున్నారు. రకరకాల కారణాల వల్ల చాలామంది ఒంటరిగా మిగులుతున్నారు. దాంతో విడాకులు పొందిన పురుషులు తక్కువా, మహిళలు ఎక్కువా ఉంటున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణాల గురించి నిపుణులేమంటున్నారంటే...

కారణాలు ఎన్నో..:ఒకప్పుడు జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెనకా ముందూ ఆలోచించేవారు. ఇప్పుడు అన్నిట్లోనూ వేగం వచ్చినట్లే ఇందులోనూ వచ్చింది. చటుక్కున నిర్ణయాలు
తీసుకుంటున్నారు.

  • పెళ్లంటేనే రెండు భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చినవారు కలిసి కాపురం చేయడం. అటువంటప్పుడు ఇద్దరూ ఎంతోకొంత సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఎవరికి వారు- ‘నాకేం తక్కువ, నేనెందుకు సర్దుకుపోవాలి’ అనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో సర్దుబాటు ధోరణి లేకపోవడమే విడాకులకు కారణమవుతోంది.
  • వైవాహిక బంధానికి పునాది నమ్మకం. అది బీటలు వారుతోంది. ఆకర్షణలు ఎక్కువవుతున్నాయి. వివాహేతర బంధాలవైపు మళ్లుతున్నారు.
  • మానసిక సాన్నిహిత్యం కొరవడుతోంది. ఒకరితో ఒకరు క్వాలిటీ టైమ్‌ గడపడం లేదు. ఉద్యోగాలకు తోడు ఎవరి వ్యాపకాలు వారికి ఉంటున్నాయి. బంధం బలపడడం లేదు కాబట్టే విడిపోవడానికి ఎక్కువగా ఆలోచించడం లేదు.
  • విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. పెద్ద ఫ్లాటూ కారూ అంటూ ఆదాయానికి మించి ఖర్చు చేసి చివరికి పరిస్థితి చేయి దాటిపోయాక ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ ప్రభావమంతా భాగస్వామి మీద పడుతుంది. గొడవలు మొదలవుతాయి. చివరికి- నీవల్లే అంటే కాదు నీవల్లే అని ఆరోపించుకుంటూ సమస్యను తెగేదాకా లాగుతున్నారు.
  • ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే ఇంటికి రాగానే అతడు టీవీ దగ్గర కూర్చుంటాడు. వచ్చీ రావడంతోనే మళ్లీ వంటింట్లోకి వెళ్లి పనిచేయడానికి ఆమె చికాకుపడుతుంది. మాటామాటా పెరుగుతుంది. మనసు విరిగిపోతుంది. బంధం పట్ల అసంతృప్తి పేరుకుపోతుంది.
  • చాలాసార్లు తల్లిదండ్రుల జోక్యమూ పెద్ద సమస్యగా మారుతోంది.
  • ఇద్దరికీ ఉద్యోగం ముఖ్యం. కెరీర్‌లో పైకెదగాలని ఆశపడుతూ ఆ క్రమంలో అనుబంధానికి ప్రాధాన్యమివ్వడం లేదు. చిన్న చిన్న అభిప్రాయభేదాలొచ్చినప్పుడు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి ఉండటం లేదు.
  • ఇప్పటి యువతరం అలవాట్లూ కొంతవరకు కుటుంబజీవనాన్ని ఇబ్బందిపెడుతున్నాయి. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం, పబ్బులూ క్లబ్బులూ, సిగరెట్టూ మద్యంలాంటివీ... గొడవలకు దారితీసి చినికి చినికి గాలివానని చేస్తున్నాయి.
  • సంబంధాలు చూసుకునేటప్పుడు చదువూ హోదా అందచందాలు లాంటివి చూస్తున్నారు కానీ కంపాటిబిలిటీ గురించి ఆలోచించడం లేదు. యువత కూడా భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఆశయాలకు ప్రాధాన్యమివ్వాలో అభిరుచులకు ప్రాధాన్యమివ్వాలో తెలుసుకోలేకపోతున్నారు.
  • లైంగిక సమస్యలూ ఈమధ్య విడాకులకు కారణమవుతున్నాయి. సమస్యని దాచి పెళ్లి చేసుకోవడంవల్ల తర్వాత అది విడాకులకు దారితీస్తోంది.
  • విడాకుల ప్రక్రియ ఆలస్యమవుతుందని చాలామంది పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోతున్నారు కానీ అసలు బాధితులుగా పిల్లలు మిగులుతున్నారు. విడాకుల కేసు అయిపోయిన తర్వాత మళ్లీ కస్టడీ కేసులు నమోదవుతున్నాయి. వాటిని పిల్లలమీద ప్రేమతో కాకుండా అవతలి వ్యక్తిని వేధించడానికి మార్గంగా చూస్తున్నారు.

మార్పు... ఒకవైపే..:సమాజం మారుతోంది. స్త్రీపురుష సమానత్వం దిశగా ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో తమ ముందుకువస్తున్న అవకాశాలను చకచకా అందిపుచ్చుకుంటూ అమ్మాయిలు ముందుకు సాగిపోతున్నారు. వారి దృక్పథంలో చెప్పుకోదగిన మార్పు వస్తోంది. ఆ మధ్య దిల్లీలో ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం- కుటుంబం, ఉద్యోగం- రెండిటిలో ఒకటే ఎంచుకోవాల్సి వస్తే ఉద్యోగాన్నే ఎంచుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది.

పెద్ద చదువులు, ఉన్నతోద్యోగాలు, ఆర్థిక స్వాతంత్య్రం... మహిళల్ని తరతరాల సంప్రదాయాల్నీ పురుషాధిక్యతనీ ప్రశ్నించేలా చేస్తున్నాయి. తమ స్వాతంత్య్రాన్ని కోల్పోయి అత్తింటి ఆధిపత్యాన్నీ, భర్త అధికారాన్నీ భరిస్తూ ఉండటానికి వారు ఇష్టపడడం లేదు. తమ విలువను గుర్తించని, తమ అభిప్రాయానికి విలువివ్వని చోట ఉండలేకపోతున్నారు. పిల్లల ముందు పోట్లాడుకుంటూ ఉండటం కన్నా విడిపోయి ఒంటరిగానైనా పిల్లల బాధ్యతను భరించడానికి సిద్ధమవుతున్నారు.

ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న అమ్మాయిలు విడాకులు తీసుకుంటామంటే తల్లిదండ్రులూ అభ్యంతరం చెప్పకపోగా సహకరిస్తున్నారు. మరోపక్క అధికశాతం అబ్బాయిలు పితృస్వామ్య, పురుషాధిక్య భావజాలం నుంచి బయటపడలేకపోతున్నారు. చాలామంది ఇంటిపనిలో సాయం చేయడాన్ని ఇప్పటికీ నామోషీగా భావిస్తున్నారు. అబ్బాయిల తల్లిదండ్రుల పాత్ర కూడా అందులో ఉంటోంది.

కొడుకుతో సమానంగా చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంటారు కానీ, ఆ అమ్మాయికి కొడుకు వంటగదిలో సాయం చేయడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరూ కలసిమెలసి పనిచేసుకోమని ప్రోత్సహించాల్సింది పోయి ఇలాంటి ఆడంగి పనులు మా ఇంటావంటా లేవంటారు. బయట ఉద్యోగం చేసి వచ్చినా ఇంటిపనీ పిల్లల బాధ్యతలూ స్త్రీవే అన్న అభిప్రాయాన్ని వదిలించుకోలేకపోతున్నారు. కెరియర్‌లోనూ అమ్మాయిలు చకచకా పైకి వెళ్లడం కూడా కొంతమంది అబ్బాయిలు సహించలేకపోతున్నారు. ఆమెకు ఇల్లు పట్టదనీ, అహంకారమనీ ఏవో సాకులు చెప్పి విడిపోతున్నారు.

అది హక్కు మాత్రమే:విడాకుల రేటు తక్కువగా ఉండడాన్ని గతంలో కుటుంబ వ్యవస్థ గట్టిగా ఉందనడానికి నిదర్శనంగా భావించేవారు. ఇతర దేశాల్లో పెరిగే విడాకుల సంఖ్యని మహిళల స్వేచ్ఛకీ సామాజిక ప్రగతికీ చిహ్నంగా భావిస్తారు. నిజానికి రెండు అభిప్రాయాలూ నూటికి నూరుశాతం నిజం కాదు. వరకట్నం, గృహహింస లాంటి వేధింపులతో ఇప్పటికీ మూడోవంతు మహిళలు సతమతమవుతున్న సమాజం మనది. పురుషాధిక్యతా పితృస్వామ్య భావజాలం ఎక్కువ కావడంతో స్త్రీలు ఆర్థిక స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాతంత్య్రాలు లేక బంధంలో బందీలుగా ఉండిపోక తప్పేది కాదు. విడాకులు తీసుకున్న మహిళల్ని సమాజం చిన్నచూపు చూడడమూ, ఇంటి నాలుగుగోడల మధ్య జరిగే అమానుషాల్ని న్యాయస్థానం ముందు రుజువు చేయలేకపోవడమూ, సుదీర్ఘ న్యాయప్రక్రియలో ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రావడమూ... లాంటివన్నీ కూడా వారిని విడాకులకు దూరంగా ఉంచేవి. ఇప్పటికీ ప్రపంచంలో మూడొందల కోట్ల మంది మహిళలు మారిటల్‌ రేప్‌ నేరం కాని దేశాల్లో నివసిస్తున్నారంటోంది ఐక్యరాజ్యసమితి. మనదేశంలోనూ ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పాతిక దాకా దేశాల్లో మహిళలు భర్త అదుపాజ్ఞల్లో బతికి తీరాలని చట్టాలే చెబుతున్నాయట. విడాకులను కుటుంబ, వివాహ వ్యవస్థలకు పొంచివున్న ప్రమాదంగా చూస్తున్నాయి పురుషాధిక్య సమాజాలు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం వచ్చి తమ హక్కుని తెలుసుకున్న మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా తగిన చట్టాలతో సహకరిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే అవకాశం ఉంది కదా అని నిర్ణయం తీసుకోవడంలో తొందరపడకూడదంటున్నారు నిపుణులు.

కౌన్సెలింగ్‌ అవసరం:భార్యాభర్తల బంధం మిగతా వాటిలా కాదు. తల్లిదండ్రుల్నీ తోడబుట్టినవారినీ నచ్చినా నచ్చకపోయినా జీవితకాలం ప్రేమిస్తాం. కానీ వివాహబంధంలోకి అడుగుపెట్టేది అప్పటివరకూ అంతగా పరిచయం లేని వ్యక్తితో. అటువంటప్పుడు వారిమధ్య బంధం బలపడటానికి సమయం పడుతుంది. అందుకు తగిన పరిస్థితులను కల్పించుకోవాలంటున్నారు నిపుణులు.

తల్లిదండ్రులు కూడా చిన్నప్పటినుంచే పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడ, మగ ఇద్దరినీ సమానంగా చూడాలి, సమానావకాశాలు ఇవ్వడం, బాధ్యతలు నేర్పడం అలవాటు చేసుకోవాలి. పెళ్లయ్యాక కూడా కొత్త దంపతుల మధ్య ఏదైనా సమస్య ఉన్నట్లు కన్పిస్తే దాన్ని గుర్తించి కూర్చోబెట్టి మాట్లాడాలి. తమవల్ల కాదనుకున్నప్పుడు కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లాలి.

వాళ్లు నిష్పక్షపాతంగా విషయాన్ని అన్ని కోణాల్లో చూసి చేయాల్సింది చెబుతారు. అసలు పెళ్లికి ముందే ప్రిమారిటల్‌ కౌన్సెలింగ్‌ ఇప్పటి అవసరం అంటున్నారు మానసికనిపుణులు. పెళ్లికి ముందు ప్రతి జంటా తప్పనిసరిగా కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. వివాహానంతర జీవితం ఎలా ఉంటుందో ఎటువంటి సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుందో తెలుసుకుని ఆ బంధంలోకి అడుగుపెట్టాలి.

అన్నిటికన్నా ముఖ్యంగా- ప్రతి జంటా పెళ్లి తర్వాత నేను, నాది, నావాళ్లు అన్నది మర్చిపోయి మనం, మనది, మనవాళ్లు అని మాట్లాడడం అలవర్చుకోవాలి. ప్రతి చిన్న లోపాన్నీ భూతద్దంలో చూసి వేలెత్తి చూపడం కాక, ఏ సమస్య ఎదురైనా చేయి చేయి కలిపి చిరునవ్వుతో సాగిపోవడం నేర్చుకోవాలి. వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా రెండే సూత్రాలు... అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం.

విడాకులకీ బీమా ఉంది:జీవిత బీమా, ఆరోగ్య బీమా లాంటివి విన్నాం కానీ, విడాకుల బీమా గురించి విన్నారా? అమెరికాకి చెందిన నార్త్‌ కరోలినా ఇన్సూరెన్స్‌ కంపెనీ పుష్కరకాలం క్రితమే ఈ సరికొత్త ఆలోచన చేసింది. ఆ సంస్థ తెచ్చిన ‘వెడ్‌లాక్‌‘ పాలసీ తీసుకున్నవాళ్లు ఏటా ప్రీమియం చెల్లించాలి. ఏ కారణంగానైనా విడాకులు తీసుకుంటే ఆ పత్రాలను రుజువుగా చూపితే చాలు బీమా మొత్తం చెల్లిస్తారు.

విడాకుల తర్వాత ఇద్దరూ విడివిడిగా ఒంటరి ప్రయాణం మొదలుపెట్టడానికి ఆ మొత్తం ఉపయోగపడుతుంది. అయితే బీమాని దుర్వినియోగం చేయకుండా ఉండటానికి ఒక షరతు పెట్టారు. కనీసం నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకున్నవారే ఈ బీమా మొత్తం పొందడానికి అర్హులు. ఇదిలా ఉంటే- విడాకుల రేటు నానాటికీ పెరుగుతున్న ఈజిప్టులో ప్రభుత్వమే విడాకుల బీమాపై చట్టం తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. డ్రాఫ్ట్‌ బిల్‌ కూడా తయారైంది. దాని ప్రకారం విడాకులు పొందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకుగాను ప్రభుత్వమే 25 వేల పౌండ్లు చెల్లిస్తుందట.

ఆ నాలుగూ ఉండాలి:న్యాయవాదిగా, ఫ్యామిలీ కౌన్సిలర్‌గా నిత్యం ఎన్నో కుటుంబ తగాదాలను చూస్తారు అడ్వకేట్‌ జి.వరలక్ష్మి. ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆమె ఏం చెబుతారంటే.. ‘కుటుంబవ్యవస్థ పటిష్ఠంగా ఉండాలంటే భార్యాభర్తలిద్దరిలో నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. పరస్పర అవగాహన, ప్రేమాప్యాయతలూ, సహకారమూ, గౌరవమూ.. ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ కుటుంబం బలహీనమైపోతుంది.

భాగస్వాములు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. బలాలూ బలహీనతలతో సహా వారిని ప్రేమించాలి. ఇంటిపనిలో, బాధ్యతల నిర్వహణలో సహకరించుకోవాలి. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువా మరొకరు తక్కువా కాదు... ఇద్దరూ సమానమే అని గుర్తించి గౌరవించుకోవాలి. చదువూ హోదా సంపాదనా ఇవేవీ బంధానికి అడ్డురాకూడదు. ఆఫీసు ఒత్తిళ్లను ఇంటికి తీసుకురాకూడదు. ఆ నాలుగు లక్షణాలూ ఉన్నప్పుడు ఏ జంటకీ న్యాయస్థానం గడప తొక్కాల్సిన అవసరం రాదు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకూడదు. ఆదిలోనే గుర్తించి సరిదిద్దడానికి ప్రయత్నించాలి’.

కారణం చెప్పక్కర్లేదు..: బ్రిటన్‌లో గతేడాది ‘నో ఫాల్ట్‌ డివోర్స్‌’ని చట్టబద్ధం చేశారు. విడాకుల కోసం ఏదో ఒక కారణం చూపించాల్సిన అవసరం, భాగస్వామి మీద నిందారోపణలు(బ్లేమ్‌ గేమ్‌) చేయాల్సిన అవసరం లేదిప్పుడు. భార్యాభర్తలిద్దరూ విడిపోవాలనుకుంటే తేలిగ్గా విడిపోవచ్చు. ఇద్దరూ కలిసి కానీ, విడివిడిగా కానీ తమ బంధం తిరిగి అతికించటానికి వీల్లేని విధంగా బీటలువారిందని ప్రకటించి విడాకులు తీసుకోవచ్చు. దీనివల్ల విడాకుల ప్రక్రియ ఎవరినీ నొప్పించకుండా చాలా సులువుగా అయిపోతుంది. కాకపోతే చిన్న షరతు- పెళ్లై కనీసం ఏడాది దాటితేనే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేశాక పునరాలోచనకీ 20 వారాల గడువు ఉంటుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details