Tips for Asthma Prevention: ఆస్థమా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని పట్టి పీడిస్తున్న సమస్య. మనదేశంలో సుమారు 3 కోట్ల మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. సగటున పెద్దవారిలో 2-6% మంది.. పిల్లల్లో 6-20% మంది ఆస్థమాతో సతమతమవుతున్నవారే. ఏటా 2.70 లక్షల మంది పిల్లలు ఆస్థమా చికిత్స కోసం ఆసుపత్రులకు వస్తున్నారు. ఇందుకోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆస్థమాతో పిల్లలు కోటి బడి దినాలకు దూరమవుతున్నారు. ఇవన్నీ పరిస్థితి తీవ్రతకు నిదర్శనాలే. వాయు కాలుష్యం, బద్దకంతో కూడిన జీనవశైలి, ఊబకాయం, కరోనా అనంతర దుష్ప్రభావాల మూలంగా ఇటీవల ఇది మరింత ఎక్కువగానూ విజృంభిస్తోంది. ఊబకాయంతో ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటే బయట ఎండ తగలదు. శరీరానికి విటమిన్ డి దొరకదు. దీని లోపంతో ఆస్థమా ఉద్ధృతమయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఆస్థమా ఎక్కువ కావటానికి ఇలాంటివన్నీ దోహదం చేస్తున్నాయి.
ఆస్థమా అంటే?:ఇదో దీర్ఘకాల శ్వాసకోశ సమస్య. ప్రత్యేకించి ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలకు సంబంధించిన సమస్య. మనం ముక్కుతో పీల్చుకునే గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలికి చేరుకుంటుంది. ఈ శ్వాసనాళం పైనుంచి రెండుగా చీలుతూ వచ్చి.. మళ్లీ చిన్నచిన్న గొట్టాలుగా విడిపోతూ.. అతి సూక్ష్మమైన గాలిగదుల్లోకి గాలిని చేరవేస్తుంది. ఇదంతా ఎంతో సునాయాసంగా, ఎలాంటి కష్టం లేకుండా సాగిపోయే ప్రక్రియ. ఆస్థమా బాధితుల్లో సరిగ్గా ఇదే అస్తవ్యస్తమవుతుంది. సాధారణంగా దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు దగ్గు రావటం మామూలే. ఇది హాని కారకాలు లోపలికి ప్రవేశించకుండా, వాటిని బయటకు నెట్టివేయటానికి శరీరం చేసే ప్రయత్నమే. ఆస్థమా వచ్చే స్వభావం (అటోపీ) గలవారికి ఇలాంటి మామూలు విషయాలే పెద్ద సమస్యగా మారతాయి. దుమ్ము ధూళి వంటివి తగిలినప్పుడు లోపల అలర్జీ ప్రేరేపితమై గాలిగొట్టాలు విపరీతంగా స్పందిస్తుంటాయి. ఆస్థమాకు మూలం ఇదే. గాలిగొట్టాలకు అలర్జీ కారకాలు తగిలినప్పుడు రోగనిరోధక కణాలు అతిగా స్పందిస్తాయి. దీంతో వాపు ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్) మొదలవుతుంది. ఫలితంగా గాలిగొట్టాల గోడలు ఉబ్బిపోయి లోపలి మార్గం సన్నబడుతుంది. మరోవైపు గాలి గొట్టాల్లో జిగురుద్రవం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది లోపలే చిక్కుకు పోతుంది. దీంతో శ్వాస తీసుకోవటం, వదలటం కష్టమైపోతుంది. దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ లక్షణాలు కొందరిలో కొద్దిసేపే ఉండొచ్చు. ఒకట్రెండు లక్షణాలే ఉండొచ్చు. కొందరికి ప్రత్యేకించి కొన్ని సమయాల్లోనే తలెత్తొచ్చు. కొందరికి నిరంతరం వేధిస్తుండొచ్చు. కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానూ ఆస్థమా ఉండొచ్చు (సైలెంట్ చెస్ట్).
ముప్పు ఎవరికి?:అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర్నుంచి పండు ముదుసలి వరకు ఎవరికైనా, ఏ వయసులోనైనా ఆస్థమా రావొచ్చు. దీనికి ప్రధాన కారణం వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువులు. తల్లిదండ్రులిద్దరికీ ఆస్థమా ఉంటే పుట్టబోయే బిడ్డకు రావటానికి 70% వరకూ అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికే ఆస్థమా ఉంటే 30% వరకు ముప్పు పొంచి ఉంటుంది. అదేపనిగా అలర్జీ కారకాలకు గురవుతున్నప్పుడు జన్యువులు లేకపోయినా ఆస్థమా దాడి చేయొచ్చు. ఆస్థమా బాధితుల్లో సుమారు 6% మంది ఇలాంటివారే. మానసిక ఆందోళన, ఒత్తిడి, కొన్నిరకాల వృత్తులు, ఇన్ఫెక్షన్ల వంటివీ ఆస్థమాను ప్రేరేపించొచ్చు.
పరీక్షలతో నిర్ధరణ:ఆస్థమా నిర్ధరణకు స్పైరోమెట్రీ పరీక్షే ప్రామాణికం. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం బయటపడుతుంది. కొందరికి పీక్ఫ్లో మీటర్ పరీక్ష కూడా చేస్తారు. ఇది నిర్ధరణకే కాదు, జబ్బు అదుపులో ఉందో లేదో తెలుసుకోవటానికీ ఉపయోగపడుతుంది. తొలిదశలో కొన్నిసార్లు ఈ పరీక్షల్లో సమస్య తేలకపోవచ్చు. అప్పుడు అలర్జీ కారకాలను ఇచ్చి పరీక్షిస్తారు. అలర్జీ కారకాలను కచ్చితంగా గుర్తించటానికి కొందరికి స్కిన్ ప్రిక్ పరీక్ష చేయాల్సి రావొచ్చు. క్షయ, సీవోపీడీ వంటి ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నయేమో చూడటానికి ఎక్స్రే కూడా అవసరమవుతుంది. అలర్జిక్, నాన్ అలర్జిక్ ఆస్థమాను తెలుసుకోవటానికి రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.
భయాలు, సందేహాలు వద్దు:ఆస్థమా విషయంలో ఇప్పటికీ ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటిని తొలగించుకోవాలి.
- ఆస్థమా అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదు.
- సాధారణంగా ఆహారంతో ఆస్థమా రాదు. కాకపోతే కొందరికి కొన్నిరకాల పదార్థాలు పడకపోవచ్చు. ప్యాకెట్లలో అమ్మే పదార్థాలు నిల్వ ఉండటానికి కలిపే ప్రిజర్వేటివ్స్ కొందరికి ఆస్థమాను కలిగించొచ్చు.
- 'ఆ ఏముంది? ఆయాసం వస్తుంది, పోతుంది' అని కొందరు ఆస్థమాను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది తగదు. నియంత్రణలో ఉంచుకోకపోతే సమస్య తీవ్రమై ప్రాణాల మీదికీ తేవొచ్చు.
- చిన్నపిల్లల్లో ఆస్థమా పెద్దగా అవుతున్నకొద్దీ తగ్గిపోతుందన్నది పూర్తిగా అపోహ. చుట్టుపక్కల పరిసరాల్లో అలర్జీ కారకాలను బట్టి, వీటి ప్రభావానికి ఎంతవరకు గురవుతున్నామనే దాన్ని బట్టి ఆస్థమా దాడి చేస్తుంది. పిల్లల్లో కొందరిలో ఆస్థమా లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చు. అలాగని నయమైనట్టు కాదు. వయసుతో పాటు ఊపిరితిత్తులు పెరగటం వల్ల జబ్బు తీవ్రత తగ్గుతుండొచ్చు గానీ పూర్తిగా నయమైందని అనుకోవటానికి లేదు.
- ఆస్థమా గల మహిళలు గర్భం ధరించినా ఎప్పటి మాదిరిగానే మందులు వాడుకోవాలి. మరింత జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది కూడా. ఎందుకంటే ఆస్థమా నియంత్రణలో లేకపోతే గర్భస్రావం, నెలలు నిండకముందే కాన్పవ్వటం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టటం, బిడ్డలో ఊపిరితిత్తులు పరిపక్వం కాకపోవటం వంటి అనర్థాలు తలెత్తొచ్చు. ఇన్హేలర్ ద్వారా తీసుకునే మందులు బిడ్డపై ఎలాంటి విపరీత ప్రభావాలు చూపవు.
- ఆస్థమాతో బాధపడే పిల్లలను కొందరు ఆటలు ఆడనీయరు. వ్యాయామం చేయనీయరు. ఇది మంచి పద్ధతి కాదు. వ్యాయామం శరీరానికి అత్యవసరం. పిల్లలకు మరింత ముఖ్యం. ఆస్థమాతో బాధపడే క్రీడాకారులు ఎందరో ఒలింపిక్స్లో బంగారు పతకాలు సాధించారని గుర్తించాలి. వ్యాయామం చేస్తే ఆస్థమా ఉద్ధృతం కాదు. కాకపోతే కొందరికి వ్యాయామం చేస్తే ఆస్థమా వచ్చే స్వభావముంటుంది. ఇలాంటివారు సైతం ముందుగా మందులు వాడుకొని తర్వాత వ్యాయామం చేయొచ్చు. ఒకేసారి కాకుండా నెమ్మదిగా వేగం పెంచుకుంటూ రావాలి. అంతే తప్ప వ్యాయామం పూర్తిగా మానెయ్యటం తగదు.