జీవితంలో ఏదో ఓ మార్పు రావాలి.. ఆరోగ్యంగా జీవించాలి అని అనుకుంటామే గానీ, పూర్తిగా ఆచరించం. అందుకే, ఈ చిన్న చిట్కాలు ఫాలో అయితే, మీరు అనుకున్న మార్పు వచ్చేస్తుందంటున్నారు వైద్యులు.
ఆచరణ సాధ్యమయ్యేలా..
ఒక కచ్చితమైన సమయంలోగా మారే విధంగా తీర్మానించుకోవడం మంచిది. అదీ ఆచరించడానికి వీలుగా ఉండాలి. ఉదాహరణకు 3 నెలల్లో 5 కిలోల బరువు తగ్గాలి, 30 రోజుల్లో సిగరెట్లు మానెయ్యాలని అనుకోవచ్చు. ఇలాంటి కచ్చితమైన తీర్మానాలు మున్ముందుకు నడిపిస్తాయి. మార్పు కనిపిస్తుంటే తోటివాళ్లూ ప్రోత్సహిస్తారు. ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
సాధించామని ఊహించుకుంటే...
బరువు తగ్గిన తర్వాత ఎలా ఉంటాను? దురలవాట్లు మానేశాక ఆరోగ్యం ఎలా ఉంటుంది? తీసుకున్న నిర్ణయాన్ని సాధించిన తర్వాత ఎలా ఉంటామనే దృశ్యాలను ఇలా మనసులో ఊహించుకోవటం ఎంతగానో ప్రోత్సహిస్తుంది.
మిత్రులతో పంచుకుంటే
తీసుకున్న నిర్ణయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవటం మేలు. ఏదైనా మార్పు కనిపిస్తే ఓ సందేశం పంపమనో, ఫోన్ చేయమనో చెబితే ఇంకా మంచిది. ఇది తీర్మానాలకు కట్టుబడేలా చేస్తుంది. రోజూ చూసేవారి కన్నా ఎప్పుడో అప్పుడు కలిసేవారైతే మార్పులను ఇట్టే పట్టేస్తారు.
మీరు కోరుకునే మార్పు.. రావాలంటే ఇలా చేయండి! లక్ష్య విభజన..
ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కదా. అందువల్ల ఏదైనా సాధించాలని తీర్మానించుకున్నాక దాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టుకోవటం ఉత్తమం. 3 నెలల్లో 5 కిలోల బరువు తగ్గాలని అనుకుంటే నెలకు ఎంత? వారానికి ఎంత? అనేది నిర్ణయించుకుంటే సాధించటం తేలికవుతుంది. అనుకున్న ఫలితం కనిపిస్తే మున్ముందుకు సాగటానికి మరింత హుషారు కలుగుతుంది. అతిగా ఊహించుకొని ప్రయత్నించటం, అతి త్వరగా సాధించాలని అనుకోవటం వల్లనే చాలా నిర్ణయాలు నీరుగారిపోతాయనే సంగతిని గుర్తుంచుకోవాలి. రోజుకు 30 నిమిషాల సేపు వ్యాయామం చేయాలని అనుకున్నవారు సమయం దొరక్కపోతే 10 నిమిషాల చొప్పున విభజించుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయొచ్చు.
మరచిపోవద్దు
పనుల్లో పడిపోయో, తీరిక లేకనో కొన్నిసార్లు తీర్మానాలను పక్కన పడేయొచ్చు. ఒకరోజు వ్యాయామం చేయకపోతే ఏమవుతుందిలే అనుకోవచ్చు. ఇది పెద్ద పొరపాటు. ఈ నిర్లక్ష్య ధోరణి ఒకరోజుతో ఆగేది కాదు. కాబట్టి తీసుకున్న నిర్ణయాన్ని ఒక కాగితం మీద రాసుకొని స్పష్టంగా కనిపించేలా గోడకు అతికించుకోవాలి. రోజూ ఎంతవరకు సాధించామన్నది రాసుకుంటే మనకు మనమే ప్రోత్సహించుకున్నట్టూ అవుతుంది.
ఆత్రుత వద్దు
పాత అలవాటును విడిచిపెట్టటానికి, కొత్త అలవాటుకు కట్టుబడి ఉండటానికి కనీసం 30-60 రోజులు పడుతుందని తెలుసుకోవాలి. అందువల్ల ఆత్రుత, తొందర వద్దు. అన్నిసార్లూ సరిగా చేయాలనేమీ లేదు. కొన్నిసార్లు పొరపాట్లు దొర్లినా నీరుగారిపోవద్దు. రోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తే అదే అలవాటవుతుంది. నెమ్మదిగానైనా మంచి ఫలితం కనిపిస్తుంది.
ఇదీ చదవండి: ముసలితనం వస్తేనేం.. ఇవి తెలుసుకుని మసలుకుంటే సరి!