ఈ మధ్యకాలంలో చాలామందిలో థైరాయిడ్ సమస్యలు కనిపిస్తున్నాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాల వల్ల కలుగుతున్న సమస్యల (Thyroid Symptoms) కోసం ఆసుపత్రికి వెళ్తే.. అసలు విషయం బయటపడుతున్న సందర్భాలు అనేకం. మెడ భాగంలో ముందువైపు సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్ శరీరంలోని ప్రతి కణంపైనా తన ప్రభావాన్ని చూపి.. ఎన్నో పనులు సవ్యంగా జరిగేలా చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ,తక్కువ కాకుండా.. తగినంత ఉండాలి. అలా జరగనప్పుడు దాని పనితీరులో లోపాల వల్ల అనేక సమస్యలు (Thyroid Problems) చుట్టుముడతాయి. అవసరమైన దాని కంటే.. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు అలాంటి పరిస్థితిని హైపర్ థైరాయిడిజమని (Hyperthyroidism), సాధారణ స్థాయి కంటే తక్కువగా థైరాయిడ్ హార్మోన్ ఉన్నప్పుడు హైపో థైరాయిడిజమని (Hypothyroidism) అంటారు.
లక్షణాలు..
- హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism Symptoms) ఉన్న వారిలో గుండె కొట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది. చెమటలు ఎక్కువగా పడతాయి. అందరికీ చల్లగా ఉంటే వీరికి మాత్రం వేడిగా ఉంటుంది.
- హైపర్ థైరాయిడిజం ఉన్న వారు ఎక్కువసార్లు మోషన్‌కు వెళ్లి వస్తుంటారు.
- వీరిలో చాలామంది బరువు కోల్పోతారు. అంతేకాకుండా కళ్లు కూడా ఉబ్బెత్తుగా ఉంటాయి.
- థైరాయిడ్ గ్రంథి దగ్గర వాపులా ఉంటుంది.
- హైపో థైరాయిడిజం (Hypothyroidism Symptoms) ఉన్న వారిలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది.
- మహిళల్లో అయితే రుతుస్రావం తక్కువగా ఉంటుంది.
- నిద్ర మత్తు, అలసట, నీరసం, బరువు పెరగడం, మొహం ఉబ్బడం, ఏకాగ్రత లోపించడం, చర్మం పొడిబారి దురదలు రావడం లాంటి సమస్యలు ఉంటాయి.
- థైరాయిడ్ విషయంలో గర్భిణీలు మరింత జాగ్రత్త వహించాలి. వీరిలో హైపో థైరాయిడ్ ఉంటే ప్రసవం విషయంలో ఇబ్బందులు రావొచ్చు.
- హైపర్, హైపో థైరాయిడిజం.. ఎక్కువగా మహిళల్లో (Hypothyroidism Symptoms In Females) కనిపిస్తాయి. పురుషుల్లో కొంతమేర తక్కువే అని చెప్పవచ్చు.
- అయోడిన్ లేమితో హైపో థైరాయిడిజం అనేది ఎక్కువగా కనిపిస్తుంది.