Brain Power Increase Effective Exercises :ప్రస్తుత రోజుల్లో దీర్ఘకాలికంగా ఉంటున్న ఒత్తిళ్లు, నిరంతరమైన ఆందోళనల కారణంగా మెదడుపై విపరీతమైన భారం పడి.. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండడానికి రోజూ ఏ విధంగానైతే వ్యాయామాలు(Exercises)చేస్తున్నారో.. మానసికంగా హెల్దీగా ఉండాలన్నా కొన్ని వ్యాయమాలు తప్పనిసరి అని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పుడే మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు వృద్ధాప్యంలో లేదా శరీరం బలహీనంగా ఉన్న టైమ్‌లో కూడా ఎవరిపై ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకొనే తెలివి ఉంటుందట. ముఖ్యంగా ఈ మానసిక వ్యాయామాలలో పాల్గొనడం ద్వారా మీ మెదడు పనితీరు మెరుగుపడడమే కాదు.. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, తెలివితేటలు, సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యాయామాలేంటో ఇప్పుడు చూద్దాం..
ధ్యానం :మీ బ్రెయిన్ పవర్ పెంచుకోవడంలో ధ్యానం చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డైలీ మెడిటేషన్ చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, నిరాశ అనేవి తగ్గుతాయి. అప్పుడు మీ నాడీ మార్గాలు చురుగ్గా పనిచేస్తాయి. ఫలితంగా మీ దృష్టి, పరిశీలనా నైపుణ్యాలు మెరుగుపడడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
నాన్ డామినెంట్ హ్యాండ్ ఉపయోగించడం : మీ మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి మరో బెస్ట్ ఎక్సర్సైజ్.. నాన్ డామినెంట్ హ్యాండ్ ఉపయోగించడం. అంటే మీరు రోజూ ఎక్కువగా ఉపయోగించే హ్యాండ్ కాకుండా మరో హ్యాండ్ యూజ్ చేయడం. ఇది మెదడుకు ఉత్తమమైన వ్యాయమాలలో ఒకటని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు మీరు ఎక్కువగా ఉపయోగించే హస్తం కుడి చేయి అయితే.. ఇప్పుడు మీ ఎడమ చేతితో బ్రష్ చేయడం, తినడం, రాయడం.. లాంటి రోజువారీ పనులను చేయడానికి ప్రయత్నించాలి. సాధారణంగా మీరు ఒకే హ్యాండ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు మెదడులోని ఒక అర్ధగోళం మాత్రమే చురుకుగా ఉంటుందని.. అదే మీరు నాన్ డామినెంట్ హ్యాండ్ను కూడా ఉపయోగిస్తున్నట్లయితే మెదడు రెండు అర్ధగోళాలు చురుకుగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా మీలో విభిన్నంగా ఆలోచించే ధోరణి, సృజనాత్మకత పెరుగుతుంది.
బోర్డ్ గేమ్స్ ఆడటం : ఈ బోర్డ్ గేమ్స్ ఆడటం అనేది మీ మెదడు చురుగ్గా పని చేయడానికి తోడ్పడే అత్యంత సృజనాత్మక, ఆహ్లాదకరమైన మార్గాలలో ఒకటి. ఇది మీ దృష్టి, అవగాహాన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి ఈ గేమ్స్ చాలా బాగా సహాయపడతాయి. ఉదాహరణకు చెస్, సుడోకు, పదివినోదం, క్రాస్ వర్డ్స్ పజిల్స్ వంటి బోర్ట్ గేమ్స్‌తో పాటు మరికొన్ని మెదడుకు పదునుపెట్టే గేమ్స్ ఆడటం వల్ల మెదడు పనితీరు మెరుగవ్వడంతో పాటు జ్ఞాపకశక్తి రెట్టింపవుతుంది.
పుస్తకాలు చదవడం : మీ మెదడుకు మరో గొప్ప వ్యాయామం పుస్తకాలు చదవడం. ఇది జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా, చదవడం వల్ల మీ మెదడు.. పరిస్థితిని, సన్నివేశంలోని పాత్రలను పుస్తకంలో రాసిన డైలాగ్‌లు వారి స్వరాలలో ఎలా వినిపిస్తాయో విజువలైజ్ చేయడానికి అనుమతిస్తుంది. క్రమం తప్పకుండా చదవడం వల్ల మీ పదజాలం మెరుగుపడుతుంది. నాణ్యమైన నిద్ర వస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది. అలాగే వయస్సుతో పాటు మానసిక క్షీణతను నిరోధించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. ఇక మీరు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్న వారైతే.. ఎప్పుడూ రొటీన్ పుస్తకాలు కాకుండా కొత్తవాటిని చదవడానికి ట్రై చేయండి. ఈ మార్పు ఇతర విషయాలకు కనెక్ట్ అయ్యేలా మీ మెదడు పని చేస్తుంది.