తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ అలవాట్లే పొట్ట చుట్టూ కొవ్వును కరిగిస్తాయట! - కొవ్వు తాజా వార్తలు

సాధారణంగా చాలా మందికి పొట్ట రావటం చూస్తాం. అందుకు కారణం పొట్ట చుట్టూ కొవ్వు (బెల్లీ ఫ్యాట్‌) పేరుకుపోవడామే... నిజానికి మనలో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు కానీ.. ఇది మన శరీరంలో ఇన్సులిన్‌ను నిరోధించి మధుమేహం ముప్పును పెంచుతుంది. అందుకే ఈ సమస్య తలెత్తకుండా చూసుకోవడం లేదంటే ఆ కొవ్వును త్వరగా కరిగించుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

fat
కొవ్వు

By

Published : Mar 28, 2021, 4:07 PM IST

మనకు నచ్చిన ఆహారం తీసుకోవడం, మొబైల్‌ మాయలో పడిపోయి ఏ అర్ధరాత్రికో పడుకోవడం, వ్యాయామం చేయడానికి బద్ధకించడం.. మన జీవనశైలిలో వచ్చే ఈ మార్పులే పొట్ట చుట్టూ కొవ్వు (బెల్లీ ఫ్యాట్‌) పేరుకుపోవడానికి కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. నిజానికి మనలో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు కానీ.. ఇది మన శరీరంలో ఇన్సులిన్‌ను నిరోధించి మధుమేహం ముప్పును పెంచుతుంది. అంతేకాదు.. గుండె సంబంధిత సమస్యలకూ దారితీస్తుందట! అందుకే ఈ సమస్య తలెత్తకుండా చూసుకోవడం లేదంటే ఆ కొవ్వును త్వరగా కరిగించుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇందుకు పెద్దగా కష్టపడక్కర్లేదని, మన రోజువారీ అలవాట్లతోనే బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం రండి..

శీతల పానీయాలు

* వేసవిలో చల్లచల్లటి శీతల పానీయాలు తాగాలని మనసు ఆరాటపడుతుంది. అలాగని వీటిని తాగితే ఈ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెరలు శరీరంలోకి చేరి ఇన్సులిన్‌ స్థాయుల్ని ఒక్కసారిగా పెంచేస్తాయి. అలాగే శరీరంలో కొవ్వు నిల్వలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే.. వీటికి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు. మరీ తాగాలనిపిస్తే అకేషన్‌లా అదీ కొద్ది మొత్తంలోనే తీసుకొని సంతృప్తి చెందమంటున్నారు.

* ఆకలిగా అనిపించినప్పుడు ఏ స్నాక్సో, బిస్కట్లో తీసుకోవడం కాకుండా.. పీచు ఎక్కువగా ఉండే నట్స్‌, గింజలు, బార్లీ, పండ్లు (బెర్రీస్‌, కమలాఫలం, పుచ్చకాయ.. వంటివి), కాయగూరలు (బ్రొకోలీ, క్యారట్‌, స్వీట్‌కార్న్‌.. మొదలైనవి), దుంపలు.. వంటివి తీసుకోవడం మంచిది. తద్వారా ప్రాసెస్డ్‌ ఫుడ్‌పై మనసు మళ్లకుండా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే వీటిలో ఉండే అధిక పీచు జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది.

* వంటల్లో ఇతర నూనెలకు బదులుగా కొబ్బరి నూనె వాడడం మంచిదట! ఎందుకంటే అది మన శరీరంలో చేరిన కొలెస్ట్రాల్‌ని కొవ్వుగా రూపాంతరం చెందించకుండా.. శక్తిగా మార్చుతుంది. తద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.

కొబ్బరి నూనె

* ఉదయాన్నే సాధారణ టీకి బదులుగా ఒక కప్పు గ్రీన్‌ టీ తాగడం వల్ల అందులోని కేట్చిన్స్‌ శరీరంలో జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తాయి. తద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వులు సులభంగా కరుగుతాయి.

* పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుల్ని కరిగించుకొని నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే వాల్‌నట్స్‌ చక్కటి ఆహారమని చెబుతున్నారు నిపుణులు. వీటిలో ఉండే అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు శరీరంలో జిడ్డులాగా పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించడంలో సహాయపడతాయి. కాబట్టి రోజుకో గుప్పెడు వాల్‌నట్స్‌ని స్నాక్స్‌ సమయంలో తీసుకోవడం మంచిదట!

* మనలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల మన శరీరంలో కార్టిసాల్‌ (ఒత్తిడి హార్మోన్‌) హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తవుతుంది. ఇది జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అందుకే ఇలాంటి మానసిక సమస్యలకు దూరంగా ఉండాలంటే వ్యాయామం, యోగా, ధ్యానం.. వంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలి.

* నిద్రలేమి బరువు పెరగడానికి, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే రాత్రుళ్లు ఏడెనిమిది గంటలు సుఖంగా నిద్ర పోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

వ్యాయామం

* రోజూ ఏరోబిక్స్‌ సాధన చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వుల్ని సులభంగా కరిగించచ్చని కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. అంతేకాదు.. మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించిన మహిళల్లో బెల్లీ ఫ్యాట్‌ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఈ కొవ్వును కరిగించుకోవాలంటే వారానికి ఐదు గంటలు ఏరోబిక్స్‌ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

* పండ్ల రసాలు మంచివని తెగ తాగేస్తుంటాం.. కానీ వాటిని మరీ మితిమీరి తాగడం వల్ల కూడా వాటిలో ఉండే చక్కెరలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయట! అందుకే మితంగా తాగమంటున్నారు నిపుణులు.

* యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో ఉండే అసిటిక్‌ ఆమ్లం బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో చక్కగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రోజూ మనం తీసుకునే ఆహారంలో ఒక టేబుల్‌ స్పూన్‌ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను కలిపి తీసుకోమంటున్నారు.

ఇదీ చదవండి: మరో రెండురోజుల్లో ఎగువ మానేరుకు కాళేశ్వరం జలాలు

ABOUT THE AUTHOR

...view details