కళ్లు పొడిబారటం
కళ్లు అదేపనిగా, అతిగా పొడిబారటం జాగ్రన్స్ సిండ్రోమ్ లక్షణం కావొచ్చు. కన్నీరు కళ్లను తేమగా ఉండేలా చేస్తుంది కదా. జాగ్రన్స్ సిండ్రోమ్ గలవారిలో రోగనిరోధక వ్యవస్థ దీన్నే దెబ్బతీస్తుంది. కన్నీరు ఎండిపోయేలా చేస్తుంది. ఫలితంగా కళ్లు పొడిబారటం, ఎర్రబడటం వంటివి వేధిస్తాయి. కళ్లలో ఇసుక పడ్డట్టుగానూ అనిపిస్తుంటుంది. చూపు, రెటీనా కూడా దెబ్బతినొచ్చు.
కుంగుబాటు
కుంగుబాటు (డిప్రెషన్) మానసిక జబ్బే అయినా రోగనిరోధక వ్యవస్థ కూడా దీనికి కారణం కావొచ్చు. గతి తప్పిన రోగనిరోధక వ్యవస్థ మూలంగా వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్) ప్రేరేపించే సైటోకైన్లు మెదడులోకి చేరుకోవచ్చు. ఇవి మూడ్‌ను, ఉత్సాహాన్ని ఉత్తేజితం చేసే సెరటోనిన్ వంటి రసాయనాల మోతాదులను తగ్గించొచ్చు. దీంతో నిరుత్సాహం ఆవహిస్తుంది. మంచి విషయం ఏంటంటే- వ్యాయామంతో వాపు ప్రక్రియ తగ్గటం, సెరటోనిన్ స్థాయులు పుంజుకోవటం. ఇవి కుంగుబాటు తగ్గటానికి తోడ్పడతాయి.
చర్మం మీద దద్దు
ఎండుగజ్జిలో (ఎగ్జిమా) చర్మం మీద తలెత్తే దద్దుకూ రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటమే కారణం. చర్మం మీద పొలుసులతో కూడిన సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థ్రయిటిస్ సైతం దీంతో ముడిపడినవే. గతి తప్పిన రోగనిరోధక వ్యవస్థతో ప్రేరేపితమయ్యే వాపు ప్రక్రియ చర్మ కణాల మీద దాడి చేయటమే వీటికి మూలం. ఇలాంటి సమస్యల్లో చర్మం ఎర్రబడటం, పొలుసులు లేవటం, నొప్పితో కూడిన ఎర్రటి దద్దు వంటివి కనిపిస్తాయి.
జీర్ణ సమస్యలు
కడుపుబ్బరం, కడుపునొప్పి, విరేచనాల వంటివి చాలావరకు మామూలు సమస్యలే కావొచ్చు. కొన్నిసార్లు పేగుపూత (క్రాన్స్), పెద్దపేగులో పుండ్లు (అల్సరేటివ్ కొలైటిస్), గోధుమల్లోని గ్లూటెన్ పడకపోవటం వల్ల తలెత్తే సీలియాక్ డిసీజ్ వంటి సమస్యల్లోనూ ఇలాంటివి వేధించొచ్చు. వీటికీ రోగనిరోధక వ్యవస్థ పనితీరే కారణం.
చేతులు, పాదాలు చల్లబడటం
చల్లటి వాతావరణంలో చేతులు, పాదాలు తెల్లగా లేదా నీలిరంగులోకి మారుతున్నాయా? ఇవి రేనాడ్స్ డిసీజ్ లక్షణాలు కావొచ్చు. ఇందులో చల్లటి వాతావరణంలో చేతులకు, పాదాలకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో చేతులు, పాదాల చల్లగా అనిపిస్తాయి. రంగూ మారుతుంది. రేనాడ్స్ డిసీజ్ కూడా రోగనిరోధక నిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడి చేయటం వల్ల తలెత్తేదే. రోగనిరోధక వ్యవస్థ మూలంగా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేయటంతోనూ చేతులు, పాదాలు చల్లగా అనిపించొచ్చు.