తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఆ వైరస్​లకు పేర్లెలా పెట్టారో తెలుసా? - హంటా వైరస్‌

ప్రపంచదేశాలను వణికిస్తూ ఎవరికీ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది మహమ్మారి కొవిడ్. కరోనా అంటే లాటిన్​ భాషలో కిరీటం అని అర్థం. ఈ వైరస్​కు అలాంటి ఆకృతి ఉండటం వల్ల 'కరోనా' అని పేరు పెట్టారు. మరి ఈ తరహాలోనే గతంలో మానవాళిపై విరుచుకుపడిన డెంగ్యూ, ఎబోలా, హంటా వంటి వైరస్​లకు ఆ పేర్లను ఎందుకు పెట్టారో తెలుసా? రండి తెలుసుకుందాం.

there is a special incidents for the cause of names to the different spreading viruses
ఆ వైరస్​లు చూపించే ప్రభావమే కాదు.. పేర్లు కూడా స్పెషలే

By

Published : Apr 16, 2020, 7:39 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

చైనాలో మొదలై 212 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకు లక్ష మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2 మిలియన్ల మంది బాధితులుగా మారారు. ఈ ఒక్క ఘటనతో కరోనా అన్న పదమే ప్రపంచ దేశాలను, సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తోంది. కరోనా అంటే లాటిన్‌ భాషలో కిరీటమని, ఈ వైరస్‌ కొమ్ములకు అలాంటి ఆకృతి ఉండటం వల్ల 'కరోనా' అని పేరు పెట్టారని ఇది వరకే తెలుసుకున్నాం. ఇదే కాదు.. ఇటీవల కాలంలో డెంగ్యూ, ఎబోలా, హంటా, జికా వంటి పలు రకాల వైరస్‌లు మానవాళిపై విరుచుకుపడ్డాయి. మరి ఆ వైరస్‌లకు పేరెలా వచ్చింది? ఎందుకు పెట్టారు? వాటి లక్షణాలేంటనే విషయాలను చూద్దాం.

రేబిస్‌ వైరస్‌

రేబిస్​ వైరస్​

రేబిస్‌ వైరస్‌ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నుంచి ఉనికిలో ఉంది. రేబిస్‌ వైరస్‌ సోకిన శునకాలు కరిచినప్పుడు ఈ వైరస్‌ మనుషులకు సోకుతుంది. అమెరికాలో ఎక్కువగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. దీని వల్ల మనిషికి పాక్షిక పక్షవాతం, చంచలత్వం, చిరాకు, భయం, ఏదో జరిగినట్టు భ్రమపడటం వంటివి వస్తాయి. నీళ్లంటే భయం ఏర్పడుతుంది. దాదాపు మానసిక రోగిగా మారిపోతారు. రేబిస్‌ అంటే లాటిన్‌ భాషలో పిచ్చి అని అర్థం. ఈ వైరస్‌ సోకిన వాళ్లు పిచ్చిగా ప్రవర్తిస్తారు కాబట్టే.. దీనికి రేబిస్‌ వైరస్‌ అనే పేరొచ్చింది. ఈ వ్యాధి కేవలం శునకాలతోనే కాదు.. ఎలుకలు, పందులు తదితర జంతువులు, పక్షుల ద్వారా కూడా సోకుతుంది.

డెంగ్యూ వైరస్‌

దోమల కారణంగా ప్రజలు విష జ్వరాల బారిన పడుతుంటారు. అలాంటి విష జ్వరమే డెంగ్యూ. ఈ వైరస్‌కు వాహకంగా పనిచేసే ఆడిస్‌ జాతి దోమలు కుట్టినప్పుడు ఇది మనుషులకు సోకుతుంది. దీని వల్ల జ్వరం, వాంతులు, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులతో పాటు రక్తంలో ప్లేట్లెట్స్‌ సంఖ్య తగ్గిపోతుంది. దీంతో మరణం కూడా సంభవించొచ్చు. అయితే ఈ డెంగ్యూ అనేది స్పానిష్‌ పదం కానీ.. ఇది తూర్పు ఆఫ్రికా దేశాల్లోని స్థానిక భాష స్వాహిలిలోని 'కా-డింగా పెపొ' అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. కా-డింగా పెపొ అంటే.. ప్రేతాత్మ అని అర్థమట. ప్రేతాత్మల వల్లే ఈ వ్యాధి సోకుతుందని అక్కడి వాళ్ల నమ్మకం అలా దీనికి ఆ పేరొచ్చింది.

ఇన్‌ఫ్లూఎంజా (ఫ్లూ)

ఇన్‌ఫ్లూఎంజా (ఫ్లూ)

ఈ మధ్య కాలంలో ప్రజలను, జంతువులను అత్యధికంగా వేధిస్తున్న వ్యాధుల్లో ఇన్‌ఫ్లూఎంజా (ఫ్లూ) ఒకటి. ఇన్‌ఫ్లూఎంజా వైరస్‌ సోకితే తీవ్ర జ్వరం వస్తుంది. ఈ వైరస్‌లో నాలుగు రకాలు (టైప్‌ ఏ, టైప్‌ బీ, టైప్‌ సీ, టైప్‌ డీ) ఉన్నాయి. వీటిలో టైప్‌ డీ మినహా మిగతావి మనుషులకు సోకుతాయి. వీటి వల్ల గొంతునొప్పి, కీళ్ల నొప్పులు, తల నొప్పి, దగ్గు వస్తుంది. వ్యాధి సోకిన వాళ్లు త్వరగా నీరసించిపోతారు. చిన్న పిల్లల్లో అధికంగా వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. కోళ్లు తదితర పక్షులకు ఇన్‌ఫ్లూఎంజా వైరస్‌ సోకితే బర్డ్‌ ఫ్లూ వస్తుంది. దీని వల్ల కోళ్లు బరువు తగ్గుతాయి. గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. ఈ వైరస్‌ పందులకు సోకితే స్వైన్‌ ఫ్లూ వస్తుంది. వీటి ద్వారా వైరస్‌ మనుషులకూ సోకుతుందన్న వాదన ఉంది. ఈ ఇన్‌ఫ్లూఎంజా అనేది ఇటాలియన్‌ భాషలోని 'ఇన్‌ఫ్లూయెన్స్‌' అనే పదం నుంచి వచ్చింది. మనుషుల ఆరోగ్యంపై ఈ వైరస్‌ ప్రభావం చూపి అనారోగ్యానికి గురి చేస్తుంది. అందుకే దీన్ని 'ఇన్‌ఫ్లూఎంజా వైరస్‌'అని పిలుస్తున్నారు.

ఎబోలా వైరస్‌

ఎబోలా వైరస్​

ఎబోలా... ఇదొక ప్రాణాంతక వ్యాధి. తొలిసారి 1976లో ఆఫ్రికా ఖండంలో పుట్టిన ఈ వైరస్‌ ఇప్పటికీ ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా డిసెంబర్‌ 2013-16 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో తీవ్రంగా వ్యాపించింది. 28,646 కేసులు నమోదు కాగా.. 11,323 మంది మరణించారు. మరుసటి ఏడాది కాంగోలో ఎబోలా విజృంభించింది. ఇప్పటికీ ఎబోలా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ వ్యాధికి కారణం ఎబోలా వైరస్‌. దీని వల్ల మనిషికి జ్వరం, కండరాల నొప్పి, విరేచనాలు, వాంతులు అవుతాయి. కాలేయం, మూత్రపిండాల పనితనం మందగిస్తుంది. కొందరిలో శరీరం లోపల, బయట రక్తస్రావం జరుగుతుంది. ఈ వ్యాధి వల్ల 90 శాతం మరణించే అవకాశం ఉంటుంది. ఇంతటి భయానక వైరస్‌కు ఈ పేరెలా వచ్చిందంటే.. ఎబోలా వైరస్‌ తొలిసారి కాంగోలోని 'ఎబోలా' నది సమీపంలోని యంబుకు అనే గ్రామంలో బయటపడింది. అందుకే దీనికా పేరు పెట్టారు.

హంటా వైరస్‌

హంటా వైరస్​

ఇటీవల చైనాలో కరోనా విజృంభిస్తున్న క్రమంలో మరో వైరస్‌ దడ పుట్టించింది. అదే హంటా వైరస్‌. దీని వల్ల ఒక వ్యక్తి మృతి చెందగా.. అతడు ప్రయాణించిన బస్సులో ఉన్నవారిని అధికారులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ వైరస్‌ మొదట దక్షిణ కొరియాలోని హంటాన్‌ నదీ సమీపంలో 1950-53 మధ్యకాలంలో పుట్టింది. అందుకే దీనిని మొదట్లో హంటాన్‌ వైరస్‌ అని, ఆ తర్వాత హంటా వైరస్‌గా పిలుస్తున్నారు. ఎలుకల మలమూత్రాల ద్వారా సోకే ఈ వైరస్‌ మనిషిలో రెండు రకాల వ్యాధులను ఏర్పరుస్తుంది. ఒకటి హంటావైరస్‌ హిమోరాజిక్‌ ఫీవర్‌ విత్‌ రెనల్‌ సిండ్రోమ్‌. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి తలనొప్పి, వీపు, ఉదరభాగంలో నొప్పులు, జ్వరం, చూపు మందగించడం, బీపీ తక్కువ కావడం, కిడ్నీలు దెబ్బతినడం తదితర తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇక రెండోది హంటా వైరస్‌ పల్మనరీ సిండ్రోమ్‌.. ఈ వ్యాధి సోకిన వ్యక్తి జ్వరం, దగ్గు, తలనొప్పి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధి వల్ల 36 శాతం మరణించే అవకాశాలుంటాయట.

జికా వైరస్‌

జికా వైరస్​

1947లో ఉగాండలోని జికా అడవుల్లో ఓ కోతిలో తొలిసారి ఈ వైరస్‌ను కనుగొన్నారు. ఆ తర్వాతి ఏడాదిలోనూ అదే అడవుల్లో ఉండే ఆడిస్‌ జాతికి చెందిన ఓ దోమలో ఈ వైరస్‌ ఉన్నట్లు వైద్యులు కనిపెట్టారు. అందుకే ఈ వైరస్‌కు జికా అని పేరు పెట్టారు. 1950 నుంచి ఆఫ్రికాలో మొదలై ఆసియా వరకు ఈ వైరస్‌ విస్తరిస్తూ వచ్చింది. 2007-16 మధ్యకాలంలో అమెరికాకూ చేరింది. ఈ వైరస్‌ వల్ల ప్రాణాపాయం ఉండదు కానీ.. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. అయితే గర్భిణులకు ఈ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తే పుట్టబోయే శిశువు మెదడు సరిగా అభివృద్ధి చెందదు.

Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details