టీకాల మిశ్రమ డోసుల(vaccine cocktail) అంశంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు ఈ వ్యవహారంపై పరిశోధనలు మొదలుపెట్టేశాయి. ఇప్పుడు భారత్ కూడా సిద్ధమైంది (vaccine mixing India). దేశంలో ఇటీవలే ఐసీఎంఆర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో సానుకూల ఫలితాలు వెలువడటం ఆశాజనకంగా మారింది.
వేర్వేరు టీకా డోసులతో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఐసీఎంఆర్ అధ్యయనం నిర్వహించింది. ఓ గ్రామంలోని 18 మంది.. ఈ ఏడాది మే నెలలో టీకా తొలి డోసుగా కొవిషీల్డ్ తీసుకున్నారు. అది జరిగిన ఆరు వారాలకు.. వైద్యుల నిర్లక్ష్యంతో రెండో డోసుగా కొవాగ్జిన్‌ను తీసుకున్నారు.
కొవిషీల్డ్ తీసుకున్న 40మంది, కొవాగ్జిన్ తీసుకున్న 40మందిలో టీకాల ప్రభావంపై వేరువేరుగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత వారిని ఈ 18 మందితో పోల్చారు. టీకాల మిశ్రమ డోసులు తీసుకున్నా సురక్షితమేనని నిర్ధరణకు వచ్చారు. అలాగే ఒకటే టీకా తీసుకోవడం కన్నా.. ఇలా రెండు వేర్వేరు టీకాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని గుర్తించారు.
ఇదీ చూడండి:-భయపెడుతున్న కరోనా వేరియంట్లు.. ఎలా జాగ్రత్తపడాలి?
అయితే ఈ అధ్యయనం కేవలం 18మందిపైనే జరిగిందన్న విషయాన్ని గ్రహించాలి. సంఖ్య పెరిగితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. అందువల్ల ఈ పరిశోధనలు ప్రాథమిక దశలోనే ఉన్నట్టు గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు.
సిద్ధాంతం..
కొవిడ్‌కు ముందే ఈ టీకాల మిశ్రమ డోసుల వ్యవహారం చర్చల్లో ఉంది. ఈ వ్యాక్సిన్ కాక్టైల్ వల్ల మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
సాధారణంగా.. టీకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రోగనిరోధక శక్తిని పెంచితే.. మరొకటి.. వైరస్‌పై పోరాటానికి టీ కణాలను సృష్టిస్తుంది. ముందుగా వెక్టర్ ఆధారిత టీకా తీసుకున్న తర్వాత ఇంకొక టీకాను ఉపయోగించడం ఈ మిశ్రమ డోసుల సిద్ధాంతం. దీని వల్ల ముందు రోగనిరోధక శక్తి పెరిగి, ఆ తర్వాత టీ కణాల ప్రతిస్పందనను సృష్టించవచ్చు.
ఏ దేశంలో ఎలా..?
ఈ వ్యవహారంపై పరిశోధనలు ఇటీవలి కాలంలో జోరందుకున్నాయి. చాలా వరకు సానుకూల ఫలితాలే లభిస్తున్నాయి.
- భారత్..
కొవిడ్-19 నివారణకు వాడే కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా డోసుల మిశ్రమంపై దేశంలో ప్రయోగాలు నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) పచ్చజెండా ఊపింది. వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ)లో ఈ అధ్యయనం, క్లినికల్ ప్రయోగాలు జరుగుతాయి. ఈ ప్రయోగాలు నిర్వహించడానికి అనుమతించాలని గత నెలలో ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)లోని నిపుణుల బృందం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
- రష్యా..