తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చల్లచల్లని ‘ఇగ్లూ కేఫ్‌’లో వేడి వేడి పదార్థాలు రుచి చూడాలా..? - igloo cafe in asia news

పిల్లలూ.. మంచుతో నిర్మించే ఇళ్లను ఇగ్లూలు అని, వాటిలో నివసించే వారిని ఎస్కిమోలు అంటారని చదువుకొనే ఉంటారు. అయితే, ఇటువంటి కట్టడాలు యూరప్‌ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మన దగ్గర తొలి ‘ఇగ్లూ కేఫ్‌’ను ప్రారంభించారు. అది పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. ఇంతకీ ఆ కేఫ్‌ ఎక్కడో, దాని విశేషాలేంటో తెలుసుకుందామా..!!

igloo cafe in kashmir
igloo cafe in kashmir

By

Published : Apr 24, 2021, 5:30 PM IST

కశ్మీర్‌లోని ప్రఖ్యాత హిల్‌ స్టేషన్లలో గుల్మర్గ్‌ ఒకటి. చలికాలంలో హిమపాతంతో తెల్లగా మెరిసిపోయే ఈ ప్రాంతాన్ని భూతల స్వర్గం అని అంటుంటారు. ఇటీవల దేశంలోనే తొలి ‘ఇగ్లూ కేఫ్‌’ను గుల్మర్గ్‌లో ప్రారంభించారు. అంతేకాదు.. ఇది ఆసియాలోనే అతి పెద్ద ఇగ్లూ కేఫ్‌ అంట.

మంచుతోనే కుర్చీలు, టేబుళ్లు
మంచు విపరీతంగా కురిసే యూరప్‌ దేశాల్లో మాత్రమే ‘ఇగ్లూ కేఫ్‌’లు కనిపించేవి. కశ్మీర్‌లోని గుల్మర్గ్‌లో హోటళ్లు నిర్వహించే ఓ వ్యక్తి 2017లో పనిమీద స్విట్జర్లాండ్‌ వెళ్లాడట. అక్కడ పెద్ద విస్తీర్ణంలో నిర్మించిన ఇగ్లూ కేఫ్‌ను చూశాడు. గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించిన ఆ కేఫ్‌ను చూసి.. మన దగ్గర కూడా అలాంటిది ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ప్రస్తుతం పర్యాటకులు వచ్చే సీజన్‌ కావడంతో జనవరి 25న తొలి ఇగ్లూ కేఫ్‌ను గుల్మర్గ్‌లో ప్రారంభించాడు.
ఫిబ్రవరి నెలాఖరు వరకే..
మంచుతో 22 అడుగుల పొడవు, 13 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ కేఫ్‌లో ఒకేసారి 16 మంది కూర్చోవచ్చట. ఇంకో విశేషం ఏంటంటే.. ఇందులోని టేబుళ్లు, కుర్చీలు కూడా మంచుతో చేసినవే. 20 మంది కూలీలు రెండు షిఫ్టుల్లో 15 రోజులు కష్టపడి కట్టిన ఈ కేఫ్‌లో వెజ్‌, నాన్‌వెజ్‌ డిషెస్‌ను అందుబాటులో ఉంచారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు మాత్రమే ఉండే ఈ కేఫ్‌కు పర్యాటకులు అధికంగా వస్తుండటంతో ముందస్తు బుకింగ్‌ సిస్టం తీసుకొచ్చారట. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో ‘ఇగ్లూ హోటళ్లు’ ఇప్పటికే పర్యాటకులకు బస చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. చల్లచల్లని ‘ఇగ్లూ కేఫ్‌’లో కూర్చొని.. వేడి వేడి పదార్థాలు రుచి చూస్తుంటే భలే ఉంటుంది కదూ..!!

ఇదీ చూడండి: వేసవిలో చల్లచల్లని టీలు.. మీకోసమే!

ABOUT THE AUTHOR

...view details