పండ్లు, కూరగాయలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యానికి ఎంతో దోహదం చేసే.. వాటిని తీసుకోవాలని డాక్టర్లు, పోషకాహార నిపుణులు సైతం సిఫార్సు చేస్తుంటారు. ఆకుకూరల నుంచి జ్యుసి సిట్రస్ పండ్ల వరకు ప్రతి ఒక్కటి చాలా పోషకాలతో పాటు వాటి సొంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ఉపయోగాల గురించి తెలిసిన వాళ్ల కంటే తెలియని వారే అధికంగా ఉంటారు. ఈ క్రమంలో తాజా పండ్లు, కూలగాయలు తీసుకోవడం వల్ల కలిగి లాభాల గురించి మరింత అవగాహన కల్పించాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు 2021 ఏడాదిని అంతర్జాతీయ పండ్లు, కూరగాయల సంవత్సరం(ఐవైఎఫ్‌వీ)గా ప్రకటించింది.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తన ప్రచారాన్ని ప్రారంభిస్తూ.. పండ్లు, కూరగాయలు ఆరోగ్యకరమైన, వైవిధ్యమైన ఆహారానికి మూలస్తంభాలని పేర్కొన్నారు. ఇవి మానవ శరీరానికి పోషకాలను సమృద్ధిగా అందించటంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయన్నారు. పండ్లు, కూరగాయల్లో అధిక పోషకాలు ఉన్నప్పటికీ వాటిని తగినంతగా వినియోగించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐవైఎఫ్‌వీ ఐవైఎఫ్‌వీ లక్ష్యం:
ఐక్యరాజ్యసమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రకారం.. ఐవైఎఫ్‌వీ-21 లక్ష్యాలు ఇలా ఉన్నాయి:
- పండ్లు, కూరగాయల వినియోగం ద్వారా పోషణ, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెంచడం
- పండ్లు, కూరగాయల వినియోగం ద్వారా వైవిధ్యభరితమైన, సమతుల్య, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడం
- ఆహార వ్యవస్థల్లో పండ్లు కూరగాయల నష్టాలు, వ్యర్థాలను తగ్గించడం
- వ్యర్థాలను తగ్గించడం కోసం ఉత్తమ పద్ధతులను ఎంచుకోవడం
- పండ్లు, కూరగాయల ఉత్పత్తిని స్థిరంగా ఉంచుతూ.. వాటి వినియోగం ద్వారా మెరుగైన ఆహార వ్యవస్థను ప్రోత్సహించడం
- నిల్వ, రవాణా, వాణిజ్యం, ప్రాసెసింగ్, రిటైల్, వ్యర్థాల తొలగింపు, రీసైక్లింగ్, ప్రక్రియల ద్వారా వాటి ఉత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడం
- పండ్లు, కూరగాయలను పండించే చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహిస్తూ.. వారి ఉత్పత్తులను ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ విపణులకు అనుసంధానుంచేటట్లుగా చర్యలు తీసుకోవడం, తద్వారా వారి ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచడం.
- అభివృద్ధి చెందుతున్న దేశాలు అవలంబిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పండ్లు, కూరగాయల సాగులో కలిగే నష్టాలను ఎదుర్కోవడం. అవలంబించాల్సిన నూతన పద్దతులను బలోపేతం చేయడం.