తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రక్త పోటు సమస్యా? కొవిడ్​తో జర భద్రం! - గుండెజబ్బులు

కొవిడ్​తో మన పోరాటం ఒక సంవత్సరం దాటింది. గత కొన్ని వారాలుగా కొవిడ్ రెండవ ఉప్పెనలో మరింత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దఫా యువత కూడా బలవుతోంది. మధుమేహం, రక్త పోటు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు కొవిడ్ ఇన్ఫెక్షన్​తో మరింత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

The impact of Covid-19 on high blood pressure
రక్త పోటు రోగులపై కోవిడ్ తాండవం

By

Published : May 4, 2021, 4:20 PM IST

"మీకు అధిక రక్తపోటు ఉంటే ఈ మహమ్మారి సమయంలో మరింత శ్రద్ధ తీసుకుని, అతి జాగ్రత్తగా ఉంటే తప్ప బతికి బట్ట కట్టడం కష్టం" అని అంటున్నారు మహారాష్ట్ర పుణె నగరంలో అపోలో స్పెక్ట్రా అసుపత్రి వైద్యులు డా. సంజయ్ నగార్కర్.

అధిక రక్తపోటు ఉన్నవారికి కరోనా సోకితే కోలుకోవటం కష్టంగా మారుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, ఊబకాయం ఉన్న వారిలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అది ప్రాణాంతకమవుతుందని పలు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. రక్తపోటును నియంత్రించే జీవకణాలనే కరోనా వైరస్ ముట్టడించటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది.

60 ఏళ్ల వయసు దాటిన చాలా మందిలో రక్తపోటు అధికంగా ఉండవచ్చు. వారిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గి ఉండవచ్చు. వారు తీసుకునే కొన్ని ఔషధాలు కూడా రక్తపోటును పెంచేవిగా ఉండవచ్చు. రక్తపోటు పెరిగినపుడు గుండె పనితీరు దెబ్బతిని గుండెలోని ధమనులు ఎక్కువగా వ్యాకోచించలేక గుండెకు రక్త సరఫరాలో అంతరాయం కలగవచ్చు. అందువల్ల గుండె కండరానికి సరిపడా రక్తం సరఫరా చేయడం కోసం గుండె మరింత ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీనికి అదనంగా, కరోనా వైరస్ గుండెపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

అధిక రక్తపోటు ఉన్న రోగులు వైద్యలు సూచించిన ఔషధాలనే వాడాలి. కొన్ని సార్లు ఔషధాలను వాడకపోవటం, సొంత వైద్యం చేసుకోవటం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. వైద్యుల సూచన లేకుండా చిట్కాలు పాటించరాదు. కొవిడ్ నుంచి రక్షణ పొందటానికి ఇంటి గడప దాటకండి. వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల నుంచి సాధ్యమైనంత దూరంగా ఉండండి. గాలి, వెలుతురు సరిగా ప్రసరించని గదుల్లో ఉండకండి.

కుటుంబ సభ్యుల నుంచి కూడా దూరం పాటించండి. ఇంటికి ఇతరులను అనుమతించకపోవటమే మంచిది. తాళం చెవులు, టీవీ రిమోట్, తలుపుల గడియలు, నీటి పంపులు మొదలైన వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలి. ఇతరుల కన్నా రక్తపోటు ఉన్నవారు తగినంత వ్యాయామం చేస్తూ, ఔషధాలు వాడుతూ కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details