మన ఒంట్లో ప్రతి కణానికీ శక్తి అవసరం. అప్పుడే అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. కొవిడ్-19 కారక సార్స్-కోవ్2 ఇక్కడే దెబ్బకొడుతోంది. గుండె, కిడ్నీలు, ప్లీహం వంటి అవయవాల్లోని కణాలు శక్తిని తయారుచేసుకునే ప్రక్రియను నిలువరిస్తోంది. దీంతో అవయవాలు చతికిలపడిపోతున్నాయి. తీవ్ర కొవిడ్-19లో అవయవాలు విఫలం కావటానికి ఇదే కారణమవుతోందని యూసీఎల్‌ఏ అధ్యయనం పేర్కొంటోంది.
దీన్ని గుర్తించటానికి శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యేలా ఎలుకలను మార్చేటం విశేషం. దీంతో మన కణాలను వైరస్ ఎలా దారి మళ్లిస్తోందనేది అర్థం చేసుకోవటం సాధ్యమైంది. కరోనా బాధితుల్లో అవయవాల వైఫల్యాన్ని నివారించటానికి కొత్త చికిత్సలను రూపకల్పనకిది ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు. ఎలుకల్లోని ఏస్2 గ్రాహకాన్ని కరోనా వైరస్ గుర్తించలేదు. దీంతో వైరస్ ప్రభావానికి గురిచేసినా వాటికి ఇన్‌ఫెక్షన్ రాదు. అందుకే ఎలుకల అవయవాల్లోని జన్యువులను కరోనా జబ్బు సోకేలా మార్చి, అధ్యయనం చేశారు. ఇవన్నీ ఏడు రోజుల్లోనే తిండి తినటం మానేశాయి. పూర్తిగా చతికిల పడిపోయాయి. సగటున 20% మేరకు బరువు తగ్గాయి. ఇవన్నీ కణాల్లో శక్తి ప్రక్రియ నిలిచిపోయిందనటానికి సూచికలే.