తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

గర్భిణుల్లో దంత సమస్యలు.. జాగ్రత్తలు తీసుకోకుంటే బిడ్డమీదా ప్రభావం! - గర్భిణుల్లో దంత సమస్యల పరిష్కారాలు

గర్భం ధరించినట్టు తెలియగానే వారిని పనులు చేయొద్దని వారించేవారు కొందరైతే మంచం మీది నుంచి కాలు కింద పెట్టనీయనివారు మరికొందరు. ఇలా ఇంటిల్లిపాదీ గర్భిణి ఆరోగ్యం మీద ఎంతో ఆసక్తి చూపుతుంటారు. కానీ ఎందుకనో నోటి శుభ్రత మీద పెద్దగా శ్రద్ధ పెట్టరు. హార్మోన్ల మోతాదుల తేడాలో, ఆహార మార్పులో, వేవిళ్లో.. కారణమేదైతేనేం? గర్భిణి నోటికి పెద్ద చిక్కే తెచ్చిపెడతాయి. పళ్లు వదులవటం, చిగుళ్ల వాపు, చిగుళ్ల మీద బుడిపెలు, ఎనామిల్‌ క్షీణించటం, పిప్పి పళ్ల సమస్యలకు దారితీస్తాయి. ఇవి తల్లి ఆరోగ్యం మీదే కాదు.. బిడ్డ భవిష్యత్తు మీదా ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు...

Teeth Problems In Pregnants
Teeth Problems In Pregnants

By

Published : Sep 13, 2022, 9:50 AM IST

Teeth Problems In Pregnants : గర్భం ధరించినట్టు తెలియగానే తల్లి మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది. ఇల్లంతా సంతోషంతో ఓలలాడుతుంది. అవి తినాలి, ఇవి తినొద్దనే సలహాలు బోలెడు. పనులు చేయొద్దని వారించేవారు కొందరైతే మంచం మీది నుంచి కాలు కింద పెట్టనీయనివారు మరికొందరు. ఇలా ఇంటిల్లిపాదీ గర్భిణి ఆరోగ్యం మీద ఎంతో ఆసక్తి చూపుతుంటారు గానీ ఎందుకనో నోటి శుభ్రత మీద పెద్దగా శ్రద్ధ పెట్టరు. గర్భిణులకు దంత, చిగుళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువన్న విషయమే చాలామందికి తెలియదు. నిజానికి నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది! గర్భధారణ సమయంలో పోషకాహారం మరింత ఎక్కువ అవసరం.

తల్లి తినే ఆహారం మీదే ఆమె ఆరోగ్యం, బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి. పంటి నొప్పి వంటి సమస్యలు మొదలైతే తినటమే కష్టమైపోతుంది. ఇక పోషకాలు ఎక్కడ్నుంచి లభిస్తాయి? పైగా గర్భిణికి ఇన్‌ఫెక్షన్లు ఇంకాస్త ఎక్కువ సమస్యలు సృష్టిస్తాయి. నెలలు నిండక ముందే కాన్పు కావొచ్చు. బిడ్డ తక్కువ బరువుతో పుట్టొచ్చు. కొన్ని రకాల మందులు ఇవ్వటం కుదరకపోవటం వల్ల వీటి చికిత్స అంత తేలిక కాదు కూడా. కాబట్టి గర్భిణులు నోటి శుభ్రతకు తగు ప్రాధాన్యం ఇవ్వటం.. ముందు నుంచే చిగుళ్లు, దంత సమస్యల నివారణ మీద దృష్టి పెట్టటం ఎంతైనా అవసరం. దీంతో గర్భధారణ ప్రక్రియ సవ్యంగా సాగేలా, పండంటి బిడ్డను కనేలా చూసుకోవచ్చు.

రకరకాల సమస్యలు
గర్భం ధరించిన తర్వాత పొట్ట పెరగటం, పొట్ట మీద గీతలు పడటం, రొమ్ములు పెద్దగా అవటం, మానసిక స్థితి (మూడ్‌) మారటం వంటి వాటి గురించి బాగానే చర్చిస్తుంటారు. కానీ నోటి శుభ్రత కూడా కీలకమే. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ వంటి హార్మోన్ల మోతాదులు పెరగటం వల్ల చిగుళ్లు, దంతాల్లోనూ అసాధారణ మార్పులు సంభవిస్తుంటాయి. తరచూ ఏదో ఒకటి తినాలనే కోరికా కలుగుతుంటుంది. దీంతో ఆహారం ఎక్కువగా, తరచూ తింటుంటారు. కొందరికి వేవిళ్లు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఏది తిన్నా బయటకు వచ్చేస్తుంటుంది. ఇవన్నీ దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపేవే. రకరకాల సమస్యలు తెచ్చిపెట్టేవే.

పళ్లు కదలటం: చాలామంది గర్భిణులు ఎదుర్కొనే సమస్య. ఇది పళ్లు ఊడటానికి దారితీయకపోవచ్చు గానీ నములుతున్నప్పుడు ఏదో తేడాగా అనిపిస్తుంటుంది. దీనికి కారణం రిలాక్సిన్‌ అనే హార్మోన్‌ మోతాదులు పెరగటం. సాధారణంగా ఇది అండాశయాల్లోని కార్పస్‌ ల్యూటియం నుంచి విడుదలవుతుంది. గర్భం ధరించిన తర్వాత మాయ కూడా దీన్ని ఉత్పత్తి చేయటం ఆరంభిస్తుంది. గర్భసంచి కుచించుకుపోకుండా చూసే ఇది కటి భాగంలోని కీళ్లు, కండర బంధనాలనూ మృదువుగా చేస్తుంది. ఇలా గర్భధారణకు, పిండానికి అనువైన స్థితిని ఏర్పరుస్తుంది. ఈ క్రమంలో చిగుళ్లతో, దవడ ఎముకతో దంతాలను పట్టి ఉంచే కండర బంధనాలూ వదులవుతుంటాయి. దీంతో పళ్లు కొద్దిగా కదలటం మొదలెడతాయి. గట్టి పదార్థాలను కొరికినప్పుడు, పెదవులతో గానీ నాలుకతో గానీ నొక్కినప్పుడు కొన్నిసార్లు పళ్లు పక్కకు జరగొచ్చు కూడా. గర్భిణులు నిద్రలో ఎక్కువగా పళ్లు కొరుకుతుంటారు. ఇదీ పళ్లు పక్కకు జరిగేలా చేయొచ్చు.

  • అవసరాన్ని బట్టి బ్రేసెస్‌ ధరించొచ్చు. ఇవి పళ్లను బిగుతుగా పట్టుకొని, కదలకుండా చూస్తాయి.
    పళ్లు కదలటం

దంత క్షీణత:గర్భధారణ సమయంలో చాలామంది వేవిళ్లతో ఇబ్బంది పడుతుంటారు. దీంతో పళ్లు సరిగా తోముకోకపోవచ్చు. తరచూ వాంతులు కావటం వల్ల జీర్ణరసాల తాకిడితో పళ్ల మీది గట్టి ఎనామిల్‌ పొర వదులై, క్షీణించే ప్రమాదముంది.

  • వాంతి అయిన వెంటనే బ్రష్‌ చేసుకోవద్దు. కప్పు నీటిలో చెంచాడు వంట సోడా కలిపి పుక్కిలిస్తే ఆమ్లం ప్రభావం తగ్గుతుంది.
    దంత క్షీణత

పిప్పి పళ్లు: గర్భిణుల ఆహార అలవాటు సైతం దంతాలకు చిక్కు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా చిరుతిళ్లు, తీపి పదార్థాలు ఎక్కువ చేటు చేస్తాయి. ఇవి పంటికి అంటుకుపోయి బ్యాక్టీరియా పెరగటానికి అవకాశం కల్పిస్తాయి. క్రమంగా పళ్లు పుచ్చిపోవటానికి దారితీస్తుంటాయి. ఫలితంగా పంటి నొప్పి వేధిస్తుంది. దీంతో ఆహారం తినటమే తగ్గుతుంది. ఫలితంగా బిడ్డ ఎదుగుదలా దెబ్బతినొచ్చు. పిప్పి పళ్లకు కారణమయ్యే బ్యాక్టీరియా గర్భధారణ సమయంలో, కాన్పు తర్వాత బిడ్డకూ సంక్రమించే అవకాశముంది. ఇది మున్ముందు పిల్లలకు ఇబ్బందులు కలిగించొచ్చు.

  • చిరుతిళ్లు, తీపి పదార్థాలు తగ్గించాలి. ఏదైనా తిన్న తర్వాత నోటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.
    పిప్పి పళ్లు

చిగుళ్లపై కంతులు: దీన్నే పయోజెనిక్‌ గ్రాన్యులోమా అంటారు. దీనికి కారణం బ్యాక్టీరియాతో కూడిన గార ఎక్కువగా పట్టటం. ఇందులో చిగుళ్ల మీద.. ముఖ్యంగా పళ్ల మధ్యలో బుడగ మాదిరిగా ఉబ్బు వస్తుంది. ఎర్రగా ఉండే వీటి నుంచి తేలికగా రక్తస్రావమవుతుంది.

  • చిగుళ్ల కంతులు కాన్పు తర్వాత వాటంతటవే తగ్గిపోతాయి. అరుదుగా కొందరికి తొలగించాల్సి ఉంటుంది.
    చిగుళ్లపై కంతులు

చిగుళ్ల జబ్బు: చిగుళ్ల ఉబ్బును నిర్లక్ష్యం చేస్తే చిగుళ్ల జబ్బుకు (పెరియోడాంటైటిస్‌) దారితీస్తుంది. ఇది తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. దంతాన్ని పట్టి ఉంచే ఎముక సమస్యలనూ తెచ్చిపెట్టొచ్చు. అప్పటికీ పట్టించుకోకపోతే పళ్లు ఊడిపోవచ్చు. కొన్నిసార్లు పళ్లు తొలగించాల్సి రావొచ్చు. చిగుళ్ల జబ్బుతో రక్తంలోకీ బ్యాక్టీరియా చేరుకునే ప్రమాదముంది. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

చిగుళ్ల జబ్బు
  • దంతాలను సరిగా శుభ్రం చేసుకోవటం ప్రధానం. చిగుళ్ల ఉబ్బును నిర్లక్ష్యం చేయరాదు.

చిగుళ్ల ఉబ్బు (జింజివైటిస్‌):గర్భిణుల్లో సుమారు 60-75% మంది ఎదుర్కొనే సమస్య. దీనికి ప్రధాన కారణం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల మోతాదులు పెరగటం. బిడ్డ ఎదుగులకు తోడ్పడే ఈ హార్మోన్లు శరీరంలో చాలా మార్పులను తెచ్చిపెడతాయి. వీటిల్లో ఒకటి చిగుళ్లు ఉబ్బటం. ఇందులో చిగుళ్లు వాచి, ఎర్రగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. నొప్పి, మంట పుడతాయి. చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటుంది. మామూలుగా పైపైన బ్రష్‌ చేసుకున్నా రక్తం రావొచ్చు. గర్భిణుల్లో చిగుళ్లు ఎందుకు ఉబ్బుతాయనేది కచ్చితంగా తెలియదు. శరీరం బ్యాక్టీరియాతో పోరాడే శక్తి సన్నగిల్లటం, చిగుళ్ల కణజాలానికి రక్త ప్రసరణ పెరగటం కారణం కావొచ్చు.

చిగుళ్ల ఉబ్బు
  • రోజుకు రెండు సార్లు మెత్తటి బ్రష్‌తో పళ్లు తోముకోవాలి. ఫ్లోరైడ్‌ టూత్‌పేస్ట్‌ వాడుకోవటం మంచిది. అలాగే దంతాల మధ్య దారంతో (ఫ్లాసింగ్‌) శుభ్రం చేసుకోవాలి. గ్లాసులో గోరు వెచ్చటి నీరు తీసుకొని, అందులో చెంచాడు ఉప్పు కలిపి రోజూ పుక్కిలించాలి. సమస్య తీవ్రమైతే యాంటీబయాటిక్‌ మందులు అవసర పడతాయి. మౌత్‌వాష్‌తోనూ శుభ్రం చేసుకోవాల్సి రావొచ్చు.

చికిత్స జాగ్రత్తగా :గర్భధారణ సమయం చాలా సున్నితమైంది. వీరికి అందరిలా, అన్ని చికిత్సలూ చేయటం కుదరదు. ఇన్‌ఫెక్షన్, పంటి నొప్పి వంటివి వేధిస్తున్నా వెంటనే చికిత్స చేయటం సాధ్యం కాదు. అందుకే వీలైనంతవరకు చికిత్స వాయిదా వేయటానికే చూస్తారు. తొలి త్రైమాసికంలో బిడ్డ ఎదుగుదల కీలక దశలో ఉంటుంది. మూడో త్రైమాసికంలో మరింత జాగ్రత్తగా ఉండటం అత్యవసరం. కాబట్టి చికిత్స విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చికిత్స తప్పనిసరైతే రెండో త్రైమాసికంలో చేయటమే ఉత్తమం. యాంటీబయాటిక్‌ మందుల విషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి. వీరికి ఆమాగ్జిసిలిన్‌ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని చికిత్సకు ఒకరోజు ముందే ఆరంభించాల్సి ఉంటుంది. నొప్పి తగ్గించే మందులతో ఉమ్మనీరు తగ్గే ప్రమాదముంది. అయితే పారాసిటమాల్‌తో పెద్దగా ఇబ్బందులుండవు. అవసరమైతే నొప్పి తగ్గటానికి వీటిని వాడుకోవచ్చు.

సమతులాహారం మీద శ్రద్ధ:సాధారణంగా బిడ్డ పుట్టిన 6 నెలల తర్వాత పళ్లు మొలుస్తుంటాయి. అయితే ఇవి ఏర్పడటం తల్లి కడుపులో ఉండగానే.. 3-6 నెలల మధ్యలోనే మొదలవుతుంది. గర్భధారణ సమయంలో తల్లి దంతాల నుంచి క్యాల్షియం తగ్గిపోతుందని చాలామంది భావిస్తుంటారు. ఇది నిజం కాదు. తల్లి తినే ఆహారం నుంచే బిడ్డకు అవసరమైన క్యాల్షియం లభిస్తుంది. ఒకవేళ ఆహారం ద్వారా తగినంత క్యాల్షియం తీసుకోకపోతే తల్లి ఎముకల నుంచి తీసుకోవటం ఆరంభిస్తుంది. కాబట్టి క్యాల్షియం దండిగా ఉండే పాలు, పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతే క్యాల్షియం మాత్రలూ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రొటీన్, ఫాస్ఫరస్, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ డి వంటి పోషకాలన్నీ అందించే సమతులాహారం తినాలి.

ఇదీ చదవండి:కిడ్నీ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మృదువైన చర్మ సోయగానికి ఇంటి చిట్కాలు..

ABOUT THE AUTHOR

...view details