Symptoms Of Heart Attack :ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాల్లో.. గుండె జబ్బుల వాటా గణనీయంగా ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు కారణం.. గంటల తరబడి ఒకేచోట కూర్చొని పనిచేయడం.. శారీరక శ్రమ లేకపోవడం.. మారిన జీవన శైలి.. వంటివి ప్రధాన కారణాలుగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుండెను పదిలంగా చూసుకోవాలంటున్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు.. ఆహారపు అలవాట్లు, జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నారు. గుండెలో ఏమైనా సమస్యలు ఉన్నట్లైతే మన శరీరం నుంచి కొన్ని సంకేతాలు అందుతాయి. వాటిని పరిశీలించి అప్రమత్తం కావడం మంచిది. గుండె నొప్పి లేదా గుండెపోటు వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ? ఇటువంటప్పుడు ఏం చేయాలి ? ఆ సమయంలో ఎటువంటి జాగ్రత్తలను తీసుకుంటే ప్రాణాలను కాపాడవచ్చు? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
గుండెపోటు లక్షణాలు :
- గుండె నొప్పి అనేది ఛాతి ఎడమవైపు భాగంలో వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే.. ఒక బలమైన వస్తువును గుండెపై ఉంచినట్లు అనిపిస్తుంది.
- ఇంట్లో ఏసీ, ఫ్యాన్ ఆన్‌లో ఉన్నా కూడా విపరీతమైన చెమటలు పట్టడం. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- వికారం లేదా వాంతులు వచ్చినట్టుగా అనిపిస్తుంది.
- విశ్రాంతి తీసుకుంటున్నా కూడా.. తీవ్రమైన అలసటగా ఉండడం
- మూర్ఛపోయినట్లు లేదా స్పృహ తప్పినట్లు అనిపిస్తుంది.
- గుండె పరుగెత్తుతున్నట్టు కొట్టుకుంటుంది లేదంటే.. అలా అనిపిస్తుంది.
- ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
అంబులెన్స్‌కి కాల్ చేయండి :
ఇలాంటి లక్షణాలు కనిపించినా.. చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ.. అలా చేయొద్దని అంటున్నారు నిపుణులు. పైన చెప్పిన లక్షణాలలో ఏవైనా కనిపిస్తే.. అది గుండెపోటుగా భావించాలని చెబుతున్నారు. అవకాశం ఉంటే.. తోడుగా ఆసుపత్రికి వెళ్లాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే.. అంబులెన్స్‌కి కాల్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాన్సర్‌ను తరిమికొట్టే - అద్భుతమైన ఫుడ్! - మీ డైట్లో భాగం చేసుకోవాల్సిందే!