తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అధిక చెమట నుంచి విముక్తి ఇలా..! - Sweat relief tips for summer

కాలమేదైనా.. ఏ సీజన్‌లో ఉండే సమస్యలు ఆ సీజన్‌లో ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఎండాకాలంలో తలెత్తే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు పైనుంచి భానుడి భగభగలు, మరోవైపు నుంచి వడగాలులు. వీటి ప్రభావంతో అడుగు బయట పెట్టాలంటేనే వెన్నులోంచి వణుకు పుడుతుంది. దీనికి తోడు చెమట చికాకు. అయితే కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఫ్యాన్లు, కూలర్ల గాలికి కూర్చున్నా కొంతమందికి చెమట చికాకు వదలదు. అయితే ఎలాగూ ఎండాకాలమే కదా.. చెమట అలాగే పడుతుందిలే అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అది క్రమంగా మనల్ని డీహైడ్రేషన్‌కి గురిచేసే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఇలా ఎక్కువ చెమట పట్టడాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆ సమస్యను వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో చెమట ఎక్కువగా పట్టడానికి గల కారణాలు, సహజసిద్ధమైన పరిష్కార మార్గాలు తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి...

Sweat relief tips
చెమట నుంచి విముక్తి సలహాలు

By

Published : May 4, 2021, 11:33 AM IST

చెమట ఎక్కువగా పట్టడానికి పలు కారణాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, అధిక బరువు, మధుమేహం, ఆందోళన, కోపం, శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు, మెనోపాజ్.. ఇలా వివిధ కారణాల వల్ల చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. అయితే చెమట వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోవడం మాట వాస్తవమే అయినప్పటికీ ఇది మరీ అధికంగా ఉంటే మాత్రం ఈ సహజసిద్ధమైన చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.

రోజుకు మూడుసార్లు..

అధిక చెమట నుంచి బయటపడటానికి యాపిల్ సైడర్ వెనిగర్, వెనిగర్.. ఈ రెండు పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం రెండు టీస్పూన్ల వెనిగర్‌ని, ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌తో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. పరగడుపున, పగలు, రాత్రి భోజనానికి అరగంట ముందు తాగాలి. ఇలా తరచూ చేయడం వల్ల త్వరలోనే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ మిశ్రమంతో..

కొంతమందికి చంకల్లో ఎక్కువగా చెమట పడుతుంటుంది. అలాంటి వారు ఈ చిన్న చిట్కా ప్రయత్నించడం మంచిది. కొద్దిగా కార్న్‌స్టార్చ్‌లో కాస్త బేకింగ్ సోడా, సరిపడినంత ఎసెన్షియల్ ఆయిల్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చంకల్లో అప్త్లె చేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే కొద్ది రోజుల్లో అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందచ్చు.

జ్యూసులు తాగుతున్నారా..?

ఎండాకాలంలో తియ్యతియ్యగా తయారుచేసే ఏ పండ్ల రసమైనా లొట్టలేసుకుంటూ మరీ తాగేస్తుంటాం. కానీ ఏదైనా ఔషధ గుణాలున్న రసం తాగమంటే మాత్రం మొహం తిప్పేసుకుంటాం. అయితే అధిక చెమట సమస్యతో బాధపడేవారికి ఇలాంటి ఔషధ గుణాలున్న జ్యూసులు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా గోధుమగడ్డితో తయారుచేసే రసం, టొమాటో రసం.. వంటివాటిలో సి, బి6, బి12 విటమిన్లు, ఫోలికామ్లం, ఇతర ఖనిజాలు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇవన్నీ శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో విడుదలయ్యే చెమటను తగ్గిస్తాయి. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తపడచ్చు.

నీటి మోతాదు తగ్గకుండా..

వేసవిలో చెమట అధికంగా వస్తుంది.. నీళ్లు తక్కువగా తాగాలి అనుకునే వారూ లేకపోలేదు. కానీ అది కరక్ట్ కాదు. ఓవైపు చెమట పడుతున్నా.. మరోవైపు శరీర బరువుకు తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి. దీంతో పాటు పాలకూర, క్యాలీఫ్లవర్, పుచ్చకాయ, ద్రాక్ష.. వంటి కూరగాయలు, పండ్లు తీసుకోవడం తప్పనిసరి. ఇవన్నీ శరీరం నుంచి విడుదలయ్యే చెమటను తగ్గించడంతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేస్తాయి.

వేడి తగ్గడానికి ఇలా..

* పచ్చిమిర్చి, మసాలాలు.. వంటి కొన్ని ఘాటైన పదార్థాలు కూడా శరీరంలో అధిక వేడి పుట్టించి ఎక్కువ చెమట విడుదలయ్యేలా చేస్తాయి. కాబట్టి ఈ కాలంలో వాటిని తీసుకోవడం వీలైనంతగా తగ్గించడం మంచిది.

* కెఫీన్ నాడీ వ్యవస్థను ప్రేరేపించి మన శరీరంలో అడ్రినలిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి కాఫీని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం ఉత్తమం.

* ఒత్తిడి, ఆందోళనలు వంటివి తగ్గించుకోవడం ముఖ్యం. అలాగే ఈ కాలంలో శరీరానికి గాలి తగిలేలా వదులుగా ఉండే దుస్తులు, అది కూడా కాటన్ దుస్తుల్ని ధరిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ చిట్కాలన్నీ పాటించినా అధిక చెమట సమస్య తగ్గట్లేదనుకుంటే ఓసారి డాక్టరును సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.

ఇదీ చదవండి:కదులుతున్న బస్సు కిందపడి కొవిడ్​ బాధితుడు బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details