తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

'కళ్లు' కలకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..? - కంటి సమస్యలు

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అలాంటి కళ్లను కాపాడుకోవటం ఎంతో ముఖ్యం. కళ్లు మనలోని ఎన్నో హావభావాలను వ్యక్తపరుస్తాయి. ముఖ్యంగా వయసు మీద పడుతుంటే.. ఆ ప్రభావం కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

Sukhibhava special story on eyes , treatment for several eye diseases
'కళ్లు' కలకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..?

By

Published : Feb 16, 2021, 2:42 PM IST

కళ్లు మాట్లాడతాయి! ఒక్క చూపుతోనే ప్రేమను ఒలకబోస్తాయి. ఆనందాన్ని వర్షిస్తాయి. అనురాగాన్ని కురిపిస్తాయి. నిశ్శబ్దంగానే కోపాన్నీ ప్రదర్శిస్తాయి. కానీ కొన్నిసార్లు కళ్లు మాట్లాడకపోతేనే బాగుంటుంది. ముఖ్యంగా మీద పడే వయసు గురించి. నల్లని వలయాలు, ఉబ్బు సంచులు, సన్నటి ముడతల వంటి వృద్ధాప్య ఛాయలు ముందుగా స్పష్టమయ్యేది కంటి చుట్టే మరి. ఇవి ఆకర్షణను, అందాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టే వీటిని నివారించుకోవటం, తగ్గించుకోవటంపై అందరికీ అంత శ్రద్ధ.

మనిషిని చూడగానే ముందుగా ఆకట్టుకునేది ముఖమే. అందులోనూ కళ్లు మరీ ముఖ్యం. ఇవి మనసుకే కాదు, అందానికీ వాకిళ్లే. మన ముఖాన్ని అడ్డంగా మూడు భాగాలుగా.. పై, మధ్య, కింది ముఖాలుగా విభజించుకోవచ్చు. కనుబొమలు, కళ్లు, కళ్ల కింది భాగం ఉండేది మధ్య ముఖంలోనే. మిగతా భాగాలతో పోలిస్తే ఇక్కడి చర్మం చాలా పలుచగా.. 0.5 మి.మీ. మందంతోనే ఉంటుంది. అతి సున్నితం కూడా. కాస్త వదులుగానూ ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా, ముందుగా ఇక్కడే కనిపించటానికి కారణం ఇవే. కళ్లు స్థిరంగా ఉంటాయి కాబట్టి పెద్దగా తేడాలేవీ కనిపించవు గానీ కనురెప్పలు చాలా మారిపోతాయి. వీటిని చూసే కొందరు ఎదుటివాళ్ల వయసును అంచనా వేస్తుంటారు. ముఖంలో చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచే కండర పోచలు (కొలాజెన్‌), కండరాలు, కొవ్వు కణజాలం కూడా ప్రత్యేకమైనవే. మనం ప్రతి నాలుగైదు సెకన్లకు ఒకసారైనా రెప్పలను ఆడిస్తుంటాం. ఇలా చర్మం తరచూ కదులుతూ ఉండటం వల్ల రెప్పలకు ఇరువైపులా సన్నటి గీతల్లాంటి ముడతలు ఏర్పడే ముప్పూ పెరుగుతూ వస్తుంటుంది. తైల గ్రంథులు, కొలాజెన్‌ అంత ఎక్కువగా లేకపోవటం వల్ల చర్మం పొడిబారే, జారిపోయే ముప్పూ ఎక్కువే.

సాధారణంగా వయసు మీద పడుతున్నకొద్దీ ముఖంలో చర్మం కింద కొవ్వు తగ్గుతూ వస్తుంది. కంటి చుట్టు పక్కలైతే ఇంకాస్త ఎక్కువగానూ తగ్గుతుంది. కింది రెప్ప దగ్గర ఇంకా త్వరగా తగ్గుతుంది. మరోవైపు చుబుకం ఎముక కూడా తగ్గుతూ వస్తుంటుంది. దీంతో కంటి కింద గుంతలు ఏర్పడి, కళ్లు లోతుకుపోయినట్టుగా కనిపిస్తాయి. అక్కడ నీడ పడి, నల్లటి ఛాయ మాదిరిగానూ కనిపిస్తుంది. కొన్నిసార్లు చర్మం రంగే నల్లగా అవ్వచ్చు. కొందరికి లోపలి పొరల్నుంచి కొవ్వు బయటకు వచ్చి కను రెప్పల చుట్టూ పోగుపడొచ్చు. ఫలితంగా కళ్ల కింద ఉబ్బు సంచులు ఏర్పడొచ్చు. ఇలాంటివన్నీ అందాన్ని దెబ్బతీసేవే. వీటికి పరిసరాల ప్రభావం, నిద్రలేమి, ఇతరత్రా జబ్బుల వంటివీ దోహదం చేస్తుంటాయి. కొందరికి వంశపారంపర్యంగానూ రావొచ్చు. జన్యుపరంగా వచ్చే వాటిని మనమేమీ చేయలేకపోవచ్చు గానీ ఇతరత్రా అంశాలను అదుపులో ఉంచుకోవచ్చు. ఒకప్పుడు ఇలాంటి సమస్యలను వయసుతో పాటు వచ్చే మార్పులుగానే భావించేవారు. అందం, ఆకర్షణలకు ప్రాధాన్యం ఎక్కువవుతున్నకొద్దీ ఇప్పుడు శ్రద్ధ బాగా పెరిగింది. మంచి చికిత్సలూ వచ్చాయి.

సన్నటి ముడతలు

సన్నటి ముడతలు

కళ్ల పక్కన సన్నటి ముడతలు చూస్తూనే ఉంటాం. వీటినే క్రౌస్‌ ఫీట్‌ అంటారు. ఇవి సాధారణంగా 30 ఏళ్ల నుంచి మొదలవుతుంటాయి. మనం తరచూ రెప్పలను ఆడిస్తుంటాం. ఇందుకు చర్మం కిందుండే కండరం తోడ్పడుతుంది. వయసు పెరుగుతున్నకొద్దీ ఇది బలహీనపడి, చర్మం వదులవుతుంది. దీంతో చర్మం నొక్కుకుపోయి ముడతలకు దారితీస్తుంది. కొన్ని గీతలు నవ్వినప్పుడు (డైనమిక్‌ రింకిల్స్‌) మాత్రమే కనిపిస్తే.. మరికొన్ని ముఖం మామూలుగా ఉన్నప్పుడూ కనిపించొచ్చు.

చికిత్స

ముడతల తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. తొలిదశలో కెమికల్‌ పీల్స్‌ లేదా లేజర్లు వాడతారు. ముదురు చర్మం గలవారికి పీల్స్‌.. కాస్త తెల్లగా ఉండేవారికి లేజర్లు బాగా ఉపయోగపడతాయి. పీల్స్‌ కొత్త చర్మం పుట్టుకొచ్చేలా ప్రేరేపించి ముడతలు తగ్గిస్తాయి. లేజర్లయితే చర్మం పైపొరను కాల్చేస్తాయి. దీంతో అక్కడ కొత్త చర్మం పుట్టుకొస్తుంది. ముడతలు పోతాయి. లేజర్ల మూలంగా చర్మం కిందుండే సన్నటి కండరపోచలు సంకోచించి చర్మం బిగుతుగానూ అవుతుంది. చర్మానికి నూతనోత్తేజం వస్తుంది. గీతలు పెద్దగా ఉంటే సన్నటి సూదితో ముడతల్లోకి ఫిల్లర్స్‌ ఇవ్వచ్చు. నవ్వినప్పుడు కనిపించే ముడతలను బొటాక్స్‌ ఇంజెక్షన్లు పూర్తిగా మాయం చేస్తాయి. ప్రస్తుతం చర్మం కింద కొవ్వును చేర్చే ఫ్యాట్‌ గ్రాఫ్టింగ్‌ పద్ధతీ అందుబాటులో ఉంది. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది.

నల్లటి వలయాలు

నల్లటి వలయాలు

కళ్ల వద్ద నల్లటి వలయాలు (డార్క్‌ సర్కిల్స్‌) అందం, ఆకర్షణ మీద విపరీత ప్రభావమే చూపుతాయి. అలసిపోయినట్టు, వయసు మీద పడినట్టు, జబ్బులతో బాధపడుతున్నట్టు కనిపించేలా చేస్తాయి. నిద్ర సరిగా పట్టకపోవటం వల్లనే ఇలా నల్లగా అవుతుందని చాలామంది భావిస్తుంటారు గానీ ఇతరత్రా కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎండలోని అతి నీలలోహిత కిరణాల ప్రభావంతో కళ్ల చుట్టూరా ఉండే చర్మం త్వరగా దెబ్బతింటుంది. చర్మం పలుచగా ఉండటం వల్ల సూక్ష్మ రక్తనాళాలు లోపల్నుంచి మరింత స్పష్టంగా కనిపించటం మూలంగానూ నల్లగా అనిపించొచ్చు. కళ్ల కింద గుంతలు ఉంటే అక్కడ నీడ ఏర్పడి, నల్లగా కనిపించొచ్చు. అలర్జీలు, కళ్లను అదేపనిగా రుద్దుకోవటం వంటివీ కారణం కావొచ్చు. కొందరికి వంశపారంపర్యంగానూ నలుపు వలయాలు తలెత్తొచ్చు.

చికిత్స

జన్యుపరంగా ఏర్పడే నల్లటి వలయాల విషయంలో పెద్దగా చేయటానికేమీ ఉండదు. మిగతా కారణాలతో తలెత్తే వలయాలను తగ్గించుకోవచ్చు. సమస్య మామూలుగా ఉంటే కంటి నిండా నిద్రపోవటం, ఎండ ఎక్కువ తగలకుండా చూసుకోవటం.. ఐస్‌, దోసకాయ ముక్కల వంటివి కాసేపు పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం మేలు చేస్తుంది. మరీ ఇబ్బందిగా ఉంటే చికిత్సలు ఉపయోగపడతాయి. నలుపును పోగొట్టటానికి ముందుగా చర్మాన్ని బిగుతు చేసే, చర్మం పైపొరను తొలగించే మలాములు సూచిస్తారు. వీటితో ఫలితం కనిపించకపోతే లేజర్‌ చికిత్స చేస్తారు.

*కొవ్వు, ఎముక తగ్గటం వల్ల ఏర్పడే గుంతలతో చర్మం నల్లగా కనిపిస్తుంటే కొవ్వును ఎక్కించటం బాగా ఉపయోగపడుతుంది (మైక్రోఫ్యాట్‌ గ్రాఫ్టింగ్‌). ఇందులో ఇతర భాగాల నుంచి తీసిన కొవ్వును చర్మం కింద ప్రవేశపెడతారు.

కళ్ల కింద ఉబ్బు

కళ్ల కింద ఉబ్బు

మన కంటి చుట్టూరా కొంత కొవ్వు కణజాలం ఉంటుంది. దీనికి అంటుకొని పై రెప్పలు, కింది రెప్పల్లోనూ సన్నటి సెప్టమ్‌ ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఇది సాగుతుంది. దీంతో అడుగు నుంచి కొవ్వు పైకి వచ్చి ఉబ్బులాగా కనిపిస్తుంది. పై రెప్ప చర్మం సాగిపోయి, కిందికి వస్తే కన్ను చిన్నగా అయినట్టూ కనిపిస్తుంది. కళ్ల కింద చర్మం లోపల నీరు చేరటం మూలంగానూ ఉబ్బు తలెత్తొచ్చు. ఒకోసారి కండరం గట్టిపడటం మూలంగానూ ఉబ్బు రావొచ్చు. థైరాయిడ్‌ వంటి సమస్యలు గలవారికి చర్మం కింద నీరు చేరి తిత్తిలాగా కనిపిస్తుంది. చాలామంది దీన్ని కొవ్వు పేరుకుపోయిందని పొరపడుతుంటారు.

చికిత్స

ఉబ్బు సంచులను తగ్గించటానికి అధికంగా ఉన్న చర్మం, కండరం, కొవ్వు తొలగించాల్సి ఉంటుంది. ఇందుకు బ్లఫెరోప్లాస్టీ చికిత్స ఉపయోగపడుతుంది. ఇందులో చర్మానికి మత్తుమందు ఇచ్చి రేడియోఫ్రీక్వెన్సీ కాట్రీ లేదా చాకుతో చిన్న కొత్త పెట్టి అధికంగా ఉన్న కొవ్వును తొలగిస్తారు. తిరిగి కుట్లు వేస్తారు. ఇది తేలికైన శస్త్రచికిత్స. ఒకట్రెండు గంటల్లో పూర్తవుతుంది. కింది రెప్పల వద్ద ఉబ్బును రెప్ప లోపల్నుంచి గానీ బయటి నుంచి గానీ సరిచేయొచ్చు. అవసరమైతే లేజర్‌ చేస్తారు. దీంతో చర్మం బిగుతుగా అవుతుంది. పైరెప్పకు చికిత్స చేసేటప్పుడు గీత కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కన్నీటి గ్రంథులు దెబ్బతినకుండానూ చూసుకోవాల్సి ఉంటుంది. కండరం గట్టిపడినవారికి కండరం ఒక్కటే తొలగించాల్సి ఉంటుంది. కొందరికి కనుబొమలు జారిపోవచ్చు. ఇలాంటివారికి రెప్పకు చికిత్స చేసేటప్పుడు కనుబొమ సరిగా ఉందో లేదో కూడా చూసుకోవాలి. కనుబొమ బాగుంటే పై రెప్ప వద్ద బ్లఫెరోప్లాస్టీ చేస్తే సరిపోతుంది.

- డాక్టర్​. వైవీ రావు

ప్లాస్టిక్​, కాస్మెటిక్ సర్జన్

డాక్టర్.వై.వీ రావు క్లినిక్స్

బంజారా హిల్స్​, హైదరాబాద్.

ABOUT THE AUTHOR

...view details