కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. గుడ్ల వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. చైనాకు చెందిన పరిశోధకు తాజాగా చేసిన అధ్యయనంలోనూ ఇదే తేలింది. వారానికి 3 నుంచి 6 గుడ్లు తీసుకుంటే గుండెకు చాలా మంచిదని వెల్లడించింది. దీనివల్ల మరణాల ప్రమాదం తగ్గుతుందని స్పష్టం చేసింది.
వారానికి 3-6 గుడ్లు
చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫువాయ్ ఆస్పత్రికి చెందిన జియా... తన సహచరులతో కలిసి నిర్వహించిన ఈ అధ్యయనంలో... వారానికి 3 నుంచి 6 గుడ్లు తినే వారిలో గుండె సంబంధిత సమస్యలు(సీవీడీ) తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారానికి ఒక గుడ్డు మాత్రమే తీసుకోవడం వల్ల 22 శాతం సీవీడీ ముప్పు ఏర్పడుతుందని.. ఇది మరణాలపై 29 శాతం వరకూ ప్రభావం చూపుతుందని తెలిపారు. వారానికి 10 కంటే ఎక్కువ గుడ్లు తీసుకుంటే 39 శాతం సీవీడీ ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు. 10 గుడ్లు తీసుకోవడం వల్ల మరణాలపై 13 శాతం ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.