Stress Management Tips : ఒకప్పటితో పోలిస్తే ఒత్తిడి అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొత్త ఒత్తిడి ఉండటం సహజమే. అయితే ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఒకే సమయంలో రకరకాల బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఎక్కువ సమయం విశ్రాంతి లేకుండా పనిచేసే వారికి ఒత్తిడి మరింత అధికంగా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాస్త శ్రద్ధపెడితే ఒత్తిడి నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వ్యాయామం తప్పనిసరి
ఒత్తిడిని తగ్గించే అంశాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వ్యాయామం. ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వారం మొత్తంలో రెండున్నర గంటల పాటు బ్రిస్క్ వాకింగ్ లాంటివి చేయొచ్చు. ఇది వద్దనకుంటే.. వారంలో 75 నిమిషాల పాటు శరీరానికి మరింత శ్రమనిచ్చే స్విమ్మింగ్, జాగింగ్ లాంటివి చేసినా మంచి ఫలితం ఉంటుంది. మీకు నచ్చిన లేదా అనుకూలంగా ఉన్న వ్యాయామం చేయాలి. ఒత్తిడికి గురైనప్పుడు మన కండరాల్లో టెన్షన్ ఉంటుంది. అప్పుడు వేడినీటితో స్నానం చేస్తే మేలు కలుగుతుంది. దీర్ఘ శ్వాస తీసుకుంటూ చేసే ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలతో కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఈ వ్యాయామాల్లో ముఖ్యంగా నిదానంగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ.. ఇలా ఐదు నుంచి పది నిమిషాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నిద్రపోయే ముందు అవి చేయొద్దు
'ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త నిద్ర. ఈ రోజుల్లో చాలా మంది 2 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఆ సమయం కూడా పూర్తిగా నిద్రపోరు. మధ్యలోనే లేస్తుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిఒక్కరు రోజుకు కనీసం 6 గంటల పాటు నిద్రపోవాలి. కుదిరితే 8 గంటల పాటు నిద్రపోవాలి. నిద్ర వల్ల మెదడుతో పాటు శరీరంలోని కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. నిద్రకు ఉపక్రమించే గంట లేదా రెండు గంటల ముందు కాఫీ లాంటివి అస్సలు తాగకూడదు. ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం కూడా చాలా ఉపకరిస్తుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవి రిలీజ్ అయినప్పుడు ఒత్తిడి దానంతట అదే తగ్గుతుంది' అని ప్రముఖ వైద్యులు డాక్టర్ కె.ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు.