కాస్త కోపంగా ప్రవర్తిస్తే చాలు. బీపీ పెరిగిందని అంటుంటాం. ఒకింత ఒత్తిడికి లోనైనా అదే మాట వల్లె వేస్తుంటాం. నిజానికి దీర్ఘకాలంలో రక్తపోటు పెరగటానికి ఆందోళన, ఒత్తిడి దోహదం చేస్తాయని కచ్చితంగా చెప్పటానికి లేదు. అయితే వీటి ప్రభావంతో మారిపోయే జీవనశైలి మాత్రం అధిక రక్తపోటుకు దారితీస్తుందని కచ్చితంగా చెప్పొచ్చు. ఒత్తిడి, ఆందోళనలకూ అధిక రక్తపోటు, ఇతర గుండెజబ్బులకూ మధ్య సంబంధం ఉండటం నిజమే కావొచ్చు. కానీ అది మనం ఊహిస్తున్న విధంగా మాత్రం కాదు. ఒత్తిడి, ఆందోళనతో రక్తపోటు పెరిగినా అది అదే పనిగా అధికంగా ఉండకపోవచ్చు. ఇది సరిగా అర్థం కావాలంటే ఒత్తిడి రకాల గురించి తెలుసుకోవాలి. ఒకటి- అప్పటికప్పుడు ముంచుకొచ్చే హఠాత్ (అక్యూట్) ఒత్తిడి. రెండోది- దీర్ఘకాల (క్రానిక్) ఒత్తిడి. ఇవి రెండూ రక్తపోటును పెంచినప్పటికీ దీర్ఘకాలంలో వీటి ప్రభావాలు వేర్వేరుగా ఉంటాయి.
హఠాత్ ఒత్తిడిలో..
ఇది తాత్కాలికమైంది. పని ఒత్తిడి, గొడవల వంటి ఒత్తిడికి దారితీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తలెత్తుతుంది. అకారణంగా భయపడటం, ఆందోళనకు గురికావటం (పానిక్ అటాక్) కూడా దీనికి దారితీయొచ్చు. దీంతో గుండె వేగం పెరగొచ్చు. సింపాథెటిక్ నాడీ వ్యవస్థ వేగం పుంజుకోవచ్చు. ఫలితంగా రక్తపోటూ పెరగొచ్చు. అయితే ఒత్తిడికి కారణమైన అంశాలు సద్దుమణగగానే రక్తపోటూ తగ్గుతుంది. మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఇలా ఆయా పరిస్థితులను బట్టి రోజంతా రక్తపోటులో హెచ్చుతగ్గులు రావటం సాధారణమే. మన శరీరం వీటిని తట్టుకోవటానికి అలవాటు పడి ఉంటుంది కూడా. సమస్యంతా దీర్ఘకాలంగా రక్తపోటు ఎక్కువగా ఉండటమే.
దీర్ఘకాల ఒత్తిడిలో..
రక్తపోటు మీద దీర్ఘకాల ఒత్తిడి ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది పెద్దగా తెలియదనే చెప్పుకోవచ్చు. కానీ ఇది జీవనశైలి మీద బాగానే ప్రభావం చూపిస్తుంది. జబ్బుల ముప్పు పెరగటానికి దారితీస్తుంది. దీర్ఘకాల ఒత్తిడి నిద్రను చాలా అస్తవ్యస్తం చేస్తుంది. నిద్ర సరిగా పట్టకపోవచ్చు. పట్టినా త్వరగా మెలకువ రావొచ్చు. ఉత్సాహం లేకపోవటం వల్ల వ్యాయామం చేయటానికీ విముఖత చూపుతుంటారు. చిరుతిళ్లు, వేపుళ్లు, కొవ్వు పదార్థాల వంటి అనారోగ్యకర ఆహారం ఎక్కువెక్కువగా తినేస్తుంటారు. పొగ, మద్యం, మాదక ద్రవ్యాల అలవాట్ల వంటివి సరేసరి. ఇవన్నీ అధిక రక్తపోటుకు దారితీసేవే. దీంతో గుండెజబ్బులు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యల ముప్పులూ ఎక్కువవుతాయి.
దీర్ఘకాలం ఎప్పుడు..
ఒత్తిడికి కారణమయ్యేవి వారాల కొద్దీ కొనసాగుతూ వస్తుంటే చివరికి దీర్ఘకాల ఒత్తిడి కారకాలుగా పరిణ మిస్తాయి. వారాలు దాటి నెలలుగా, నెలలు దాటి సంవత్సరాలుగా. ఇలా దీర్ఘకాలం వెంటాడుతూనే వస్తుంటాయి. వీటిని మార్చుకోవటం కష్టంగానే తయారవుతుంది. జీవనశైలి మార్పుల ఫలితాలూ అలాగే కొనసాగుతూ వస్తాయి.
తగ్గించుకోవటమెలా?
ఒత్తిడిని ఎలా పరిగణిస్తాం? ఎలా ఎదుర్కొంటాం? అనేవి చాలా కీలకం. ఒకే పరిస్థితిలో ఇద్దరు వేర్వేరుగా ప్రవర్తించటం చూస్తూనే ఉంటాం. కొందరు తేలికగా తీసుకుంటే, కొందరు తీవ్రంగా ప్రతిస్పందిస్తుంటారు. ఇది ఆయా వ్యక్తుల మానసిక స్థితిని బట్టి ఉంటుంది. అధిక రక్తపోటును తగ్గించుకోవటం 70% వరకు జీవనశైలి మీదే ఆధారపడి ఉంటుంది. మందుల ప్రభావం 30 శాతమే. అందువల్ల జీవనశైలిని మార్చుకోవటం మీద దృష్టి సారించటం అన్నింటికన్నా ఉత్తమం.
క్రమం తప్పకుండా వ్యాయామం: ఉత్సాహంగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఉత్తమమైన మార్గం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం. ఇది ఒత్తిడికి కారణమయ్యే పరిస్థితులను ఎదుర్కోవటానికి, వాటి నుంచి తప్పించుకోవటానికి తోడ్పడుతుంది. వ్యాయామం గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు అదుపులో ఉండటానికిది చాలా ముఖ్యం.