ఊబకాయం పెద్ద సమస్య. దీంతో మధుమేహం ముప్పు పెరుగుతుంది. మధుమేహం మరింత తీవ్రమవుతుంది కూడా. రోజురోజుకీ వీటి బారినపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య గణన ప్రకారం.. తెలంగాణలో 41.7% మంది మగవారు, 40.2% మంది మహిళలు అధిక బరువు లేదా ఊబకాయం గలవారే. ఆంధ్రప్రదేశ్‌లోనైతే 44.4% మంది మగవారు, 37.7% మంది మహిళలు వీటితో సతమతమవుతున్నారు. అంతేకాదు.. పెద్దవారిలో సుమారు 20% మంది మధుమేహంతోనూ బాధపడుతున్నారు. ఊబకాయానికీ మధుమేహానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుండటం.. ఇవి రెండూ గలవారికి గుండెజబ్బులు, కాలేయానికి, క్లోమానికి కొవ్వు పట్టటం, అవయవాల చుట్టూ కొవ్వు పేరుకోవటం, కీళ్లు అరగటం, స్తంభన లోపం వంటి సమస్యల ముప్పు పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవటం తక్షణ ప్రాధాన్యంగా మారిపోయింది. కనీసం 10% బరువు తగ్గినా సమస్యలను చాలావరకు తగ్గించుకోవచ్చు. ఇందుకు నిన్న మొన్నటి వరకు జీవనశైలి మార్పులు తప్ప మరో మార్గం కనిపించేది కాదు. వీటితో ఫలితం కనిపించకపోతే ఇక అంతే అనుకునేవారు. బరువును తగ్గించే బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావటంతో కొత్త ఆశలు చిగురించాయి. అయితే శస్త్రచికిత్సలు చాలామందికి అనువైనవి కాకపోవటం, వీటిని చేయించుకోవటానికి భయపడటం పెద్ద అవరోధంగా మారింది. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికి ఎండోస్కోపిక్ పద్ధతిలో చేసే చికిత్సలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటి ఉద్దేశం- పొట్ట మీద ఎలాంటి కోత పెట్టకుండానే లోపల్నుంచే జీర్ణాశయ పరిమాణాన్ని తగ్గించటం, పేగుల పనితీరును మార్చటం.
రెండు పద్ధతులు..
బేరియాట్రిక్ ఎండోస్కోపీ పద్ధతులను జీర్ణాశయానికే పరిమతమయ్యేవి, పేగుల పనితీరును మార్చేవి.. ఇలా రెండు రకాలుగా విభజించుకోవచ్చు. జీర్ణాశయానికి చేసే చికిత్సలు బరువు తగ్గటానికి.. చిన్నపేగుల్లో చేసే చికిత్సలు మధుమేహం అదుపులోకి రావటానికి తోడ్పడతాయి.
1. జీర్ణాశయ చికిత్సలు
తిండి తగ్గితే బరువు తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలిసినా తిండి తగ్గించుకోలేకపోతే? జిహ్వా చాపల్యాన్ని ఆపుకోలేకపోతే? ఇలాంటివారి కోసం పురుడు పోసుకున్నవే జీర్ణాశయ పరిమాణాన్ని తగ్గించే చికిత్సలు.
బుడగ అమర్చటం (ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్) జీర్ణాశయంలో బెలూన్‌ను ప్రవేశపెట్టి, తిండిని తగ్గించేలా చేయటం దీని ప్రత్యేకత. బెలూన్లలో ఓర్బెరా, ఓబలాన్, ట్రాన్స్‌పైలోరిక్ వంటి రకాలున్నాయి. బెలూన్‌ను ఎక్కడ ఉంచాలి? ఎప్పుడు తీయాలి? అనే దాన్ని బట్టి ఎవరికేది ఉపయోగపడుతుందన్నది నిర్ణయిస్తారు. అవసరమైతే రెండు, మూడు బెలూన్లు ప్రవేశపెట్టొచ్చు. ఓర్బెరా బెలూన్‌ను లోపలికి పంపించాక, దాన్ని చేరుకొని సెలైన్ ద్రావణంతో నింపుతారు. ఓబలాన్ బెలూన్ మాత్రలా ఉంటుంది. దీనికి ఒకవైపున సన్నటి గొట్టం ఉంటుంది. ముందు గొట్టాన్ని పట్టుకొని మాత్రను మింగిస్తారు. అల్ట్రాసౌండ్ పరీక్షలో చూస్తూ జీర్ణాశయంలో అవసరమైన చోట కుదురుకునేలా చేస్తారు. ఇది స్థిరపడ్డాక గొట్టం ద్వారా బెలూన్‌లోకి గాలిని నింపుతారు. అవసరమైతే ప్రతి నాలుగు వారాలకు ఒకటి చొప్పున ఇలాంటి బెలూన్లను మూడు వరకు అమరుస్తారు. ట్రాన్స్‌పైలోరిక్ బెలూన్ అయితే కొద్దిగా మత్తుమందు ఇచ్చి అమర్చాల్సి ఉంటుంది. ఇందులో పెద్ద బెలూన్‌కు మరో చిన్న బెలూన్ అనుసంధానంగా ఉంటుంది. ఎండోస్కోప్ ద్వారా దీన్ని లోపలికి పంపించి, సెలైన్ ద్రావణంతో నింపుతారు. పెద్ద బెలూన్ జీర్ణాశయంలోనే ఉంటుంది. చిన్న బెలూన్ అక్కడే ఉండొచ్చు లేదూ చిన్నపేగులోకి జారిపోవచ్చు. ఈ ప్రక్రియ 15-30 నిమిషాల్లోనే పూర్తవుతుంది. కొద్ది గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. పద్ధతి ఏదైనా బెలూన్ చేసే పని ఒక్కటే. జీర్ణాశయం పరిమాణాన్ని తగ్గించటం. దీంతో కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. తిండి తక్కువగా తినటం వల్ల బరువు తగ్గుతుంది. గ్లూకోజూ అదుపులోకి వస్తుంది.
- శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) 30-40 గలవారికి, జీవనశైలి మార్పులను కచ్చితంగా పాటించటానికి అంగీకరించినవారికి బెలూన్ చికిత్స చేస్తారు. ఇంతకుముందు జీర్ణాశయ, అన్నవాహిక సర్జరీలేవీ చేయించుకొని ఉండకూడదు కూడా. సాధారణంగా బెలూన్‌ను ఏడాది దాటాక తీస్తారు.
లోపల్నుంచి కుట్టటం (స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ)
జీర్ణాశయాన్ని కత్తిరించకుండా లోపల్నుంచే కుట్లు వేసి, సైజు తగ్గించటం దీనిలోని కీలకాంశం. ముందుగా స్వల్పంగా మత్తుమందు ఇచ్చి, నోటి ద్వారా ఎండోస్కోపీని జీర్ణాశయంలోకి పంపిస్తారు. తర్వాత ఒంపు తిరిగి ఉండే జీర్ణాశయం వైపున లోపల్నుంచే అధునాతన పరికరంతో కుట్లు వేస్తారు. దీంతో జీర్ణాశయం గొట్టం మాదిరిగా, అరటిపండు ఆకారంలోకి మారుతుంది. జీర్ణాశయం సైజు సుమారు 70-80% వరకు తగ్గిపోతుంది. అందువల్ల కొంచెం తినగానే కడుపు నిండుతుంది. జీర్ణాశయం కేలరీలు గ్రహించుకోవటమూ తగ్గుతుంది. ఆహారం ఎక్కువసేపు అక్కడే ఉండటం వల్ల చాలాసేపు ఆకలి వేయకుండానూ ఉంటుంది. ఇవన్నీ బరువు, గ్లూకోజు తగ్గటానికి తోడ్పడతాయి.
- బేరియాట్రిక్ సర్జరీ సరిపడనివారు, సర్జరీ ఇష్టం లేనివారు దీన్ని చేయించుకోవచ్చు. 18 ఏళ్లు పైబడి, బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉండేవారికే దీన్ని చేస్తారు. బెలూన్‌తో పోలిస్తే ఇది దీర్ఘకాలం.. 4-5 ఏళ్ల వరకు బరువు అదుపులో ఉండేలా చేస్తుంది. కుట్లు జీవితాంతం ఉన్నా ఏమీ కాదు. దుష్ప్రభావాలేవీ ఉండవు. జీర్ణాశయం స్వభావం, పనితీరు ఏమీ మారదు. పోషకాల లేమి తలెత్తదు.
2. చిన్నపేగు చికిత్సలు
ఇవి ప్రధానంగా మధుమేహం కోసం ఉద్దేశించినవి. మనం తిన్న ఆహారం జీర్ణమై, అందులోని పోషకాలు ఒంట బట్టటానికి చిన్నపేగు కీలకం. గ్లూకోజు స్థాయులను తగ్గించే జీఎల్‌పీ-1 వంటి హార్మోన్లు ఇందులోనే ఉత్పత్తి అవుతుంటాయి. నిజానికి చిన్నపేగు మొత్తం ఒకటే అయినా పోషకాలను గ్రహించుకోవటంలో ఒకో భాగం ఒకోలా ఉపయోగపడుతుంది. దీన్ని డియోడినం (తొలిభాగం), జెజునం (మధ్యభాగం), ఇలియం (చివరిభాగం) అని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు. ఇవి జీవక్రియల్లో వేర్వేరు పనులను నిర్వర్తిసుంటాయి. అందుకే మధుమేహ నియంత్రణలో ఇప్పుడు చిన్నపేగు మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మున్ముందు మధుమేహ చికిత్సలో ఇలాంటి శస్త్రచికిత్స పద్ధతులే ప్రధానం కానున్నాయి.
పేగులో గొట్టం (డియోడినల్-జెజునల్ బైపాస్ లైనర్)
దీన్ని డియోడినల్ స్లీవ్ అనీ అంటారు. తిన్న ఆహారాన్ని చిన్నపేగు తొలిభాగం, మధ్యభాగం మొదట్లో జీర్ణం కాకుండా చేయటం దీని ఉద్దేశం. ఎండోస్కోప్ ద్వారా మృదువైన, పలుచటి పొరతో కూడిన గొట్టంలాంటి పరికరాన్ని (ఎండోబ్యారియర్) చిన్నపేగు మొదట్లో అమర్చటం ఇందులోని కీలకాంశం. పరికరం సుమారు 60 సెంటీమీటర్ల పొడవుంటుంది. కిరీటంలా ఉండే దీని తలభాగాన్ని జీర్ణాశయం అడుగున బిగించి, కింది భాగాన్ని చిన్నపేగులో జెజునం మధ్యలోకి జారవిడుస్తారు. తర్వాత రంగు ద్రవాన్ని లోపలికి పంపించి పరికరం సరిగా కుదురుకుందో లేదో చూస్తారు. ఎండోబ్యారియర్ మూలంగా జీర్ణాశయంలో ముద్దగా మారిన ఆహారం డియోడినం, జెజునం తొలిభాగంలో జీర్ణం కాకుండానే కిందికి వెళ్లిపోతుంది. ఫలితంగా పేగులు పోషకాలు గ్రహించుకోవటం తగ్గుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించే జీఎల్‌పీ-1 హార్మోన్ స్థాయులు పెరగటానికీ ఇది తోడ్పడుతుంది. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గేలా చేస్తుంది. జీఎల్‌పీ-1 హార్మోన్ మెదడు మీదా ప్రభావం చూపుతుంది. కడుపు నిండిన భావన కలిగించి, బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది.
- మధుమేహం నియంత్రణలో లేని ఊబకాయులకు, బేరియాట్రిక్ సర్జరీ సరిపడనివారికి, భారీ ఊబకాయులకు, ఇతరత్రా శస్త్రచికిత్సల కోసం గ్లూకోజు మోతాదులు తగ్గించుకోవాలని అనుకునేవారికిది బాగా ఉపయోగపడుతుంది. ఇది గంటలోనే పూర్తయ్యే చికిత్స. అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. గొట్టాన్ని ఆరు నెలల తర్వాత తొలగించొచ్చు. కావాలంటే ఏడాది వరకు కొనసాగించొచ్చు. అవసరమైతే మార్చి, కొత్తది వేసుకోవచ్చు. దీంతో రక్తంలో మూడు నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ 1.5-2% వరకు తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు కూడా 10-12% వరకు తగ్గటం విశేషం.
జిగురుపొరను సరిదిద్దటం (డియోడినల్ మ్యూకోజల్ రీసర్ఫేసింగ్)
మధుమేహంతో బాధపడేవారిలో చిన్నపేగు తొలిభాగంలోని జిగురుపొర (మ్యూకస్) మందంగా తయారవుతుంది. దీంతో గ్లూకోజు మోతాదులను నియంత్రించే హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దెబ్బతిన్న పొరను తొలగించి, పునరుత్తేజితం చేస్తే గ్లూకోజు స్థాయులూ నియంత్రణలోకి వస్తాయి కదా. డియోడినల్ మ్యూకోజల్ రీసర్ఫేసింగ్ (డీఎంఆర్) చేసే పని ఇదే. ఇందులో ముందుగా నోటి ద్వారా డియోడినంలోకి ఎండోస్కోప్‌ను పంపిస్తారు. అనంతరం జిగురుపొరలోకి సెలైన్ ద్రావణాన్ని ఎక్కించి, ఇతర పొరలు వేరయ్యేలా చేస్తారు. ఎండోస్కోప్ ద్వారా మరో ప్రత్యేక గొట్టాన్ని పంపిస్తారు. దీని చివర ఉండే వేడి బెలూన్ సాయంతో మందంగా మారిన జిగురుపొరను కాల్చేస్తారు. కొంత కాలానికి అక్కడ కొత్త జిగురుపొర పుట్టుకొస్తుంది.
- మందులతో గ్లూకోజు నియంత్రణలో రానివారికిది సురక్షితమైన, సమర్థమైన చికిత్స అనుకోవచ్చు. దీంతో హెచ్‌బీఏ1సీ 1.5-2% వరకు తగ్గుతుంది. ఒక మాదిరి మధుమేహం గలవారికి మందుల అవసరం తప్పుతున్నట్టు, మధుమేహం మరీ ఎక్కువగా గలవారు మందుల మోతాదులు తగ్గించుకుంటున్నట్టు న్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని చేయించుకున్నాక అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. కాకపోతే ఇది తాత్కాలిక ప్రక్రియ. అవసరమైతే ఆర్నెళ్లకోసారి చేయాల్సి ఉంటుంది. మనదేశంలో దీన్ని ప్రయోగాత్మకంగానే చేస్తున్నారు.
జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి
- బరువు, మధుమేహ చికిత్సలు చేయించుకున్నాక తొలి వారంలో ద్రవాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
- 2-3 వారాల వరకు ద్రవాలతో పాటు మెత్తటి పదార్థాలు తినొచ్చు.
- 4వ వారం నుంచి రోజువారీ ఆహారం తీసుకోవచ్చు గానీ కేలరీలు తక్కువగా లభించేలా చూసుకోవాలి.
- ఆ తర్వాత కూడా ఆహార, వ్యాయామ నియమాలు కచ్చితంగా పాటించాలి.