మంచీ చెడూ: మన శరీరానికి కొలెస్ట్రాల్ అత్యవసరం. మితిమీరితేనే.. ముఖ్యంగా చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) ఎక్కువైతేనే ప్రమాదం. దీంతో గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. అదే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) రక్తంలోంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించటానికి తోడ్పడుతుంది.
బరువు అదుపు: శరీర బరువు పెరుగుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయిలూ పెరిగే ప్రమాదముంది. అధిక రక్తపోటు, మధుమేహం ముప్పులూ ఎక్కువ అవుతాయి. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీసి పూడికలు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవటం.. ముఖ్యంగా బొజ్జ తగ్గించుకోవటం ఎంతైనా అవసరం. దీంతో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
చేపల మేలు: చేపల్లో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్లనే కొవ్వు, మొత్తం కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడతాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటాన్ని నివారిస్తాయి. కాబట్టి కొవ్వుతో కూడిన సాల్మన్, టూనా, సార్డైన్ వంటి చేపలను తరచూ తినటం మంచిది. వీటిని కూరగానో, ఉడికించో తినాలి గానీ నూనెలో వేయించటం సరికాదు.
పొట్టుతీయని ధాన్యాల తోడు: రోజూ ఉదయం అల్పాహారంగా దంపుడు బియ్యం, సజ్జలు, జొన్నలు, ఓట్స్ వంటి పొట్టుతీయని ధాన్యాలతో చేసిన పదార్థాలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. మధ్యాహ్నం తక్కువ తినేలా చేస్తాయి.
గింజపప్పుల ఆసరా:చిరుతిండి మీదికి మనసు లాగుతోందా? అయితే గుప్పెడు బాదం పప్పు, కాజు, పిస్తా, అక్రోట్ల వంటివి తిని చూడండి. వీటిల్లో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే కొవ్వులు దండిగా ఉంటాయి. కాకపోతే వీటిని మితంగానే తీసుకోవాలి. రోజుకు 30 గ్రాముల గింజపప్పులు తినేవారికి గుండెజబ్బుల ముప్పు తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
అసంతృప్త కొవ్వుల అండ: ఆహారంలో కొవ్వు పదార్థాలు తగుపాళ్లలో ఉండేలా చూసుకోవటం తప్పనిసరి. పొద్దు తిరుగుడు, తవుడు, వేరుశనగ, ఆలివ్ నూనెల వంటి అసంతృప్త కొవ్వులు (గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టనివి) మేలు చేస్తాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటానికి, మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి తోడ్పడతాయి. అదే మాంసం, వెన్న తీయని పాలు, వెన్న, పామాయిల్ వంటి సంతృప్త కొవ్వులైతే చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి.
వ్యాయామ బలం: రోజుకు అరగంట వ్యాయామం చేసినా కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని బట్టి ఇంకాస్త ఎక్కువసేపు చేసినా మేలే. కాస్త వేగంగా నడవటం వంటి గుండెకు పని చెప్పే వ్యాయామాలు గుండె జబ్బు, పక్షవాతం ముప్పు తగ్గేలా చేస్తాయి. బరువూ తగ్గుతుంది.
విశ్రాంతి మంత్ర: అదేపనిగా ఒత్తిడికి గురైతే రక్తపోటు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ మోతాదులూ ఎక్కువ కావొచ్చు. కాబట్టి విశ్రాంతికి తగు ప్రాధాన్యం ఇవ్వాలి. నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకోవటం.. ధ్యానం, నలుగురితో నవ్వుతూ గడపటం వంటివన్నీ విశ్రాంతినిచ్చేవే.
కొలెస్ట్రాల్ ఎక్కువుందని డాక్టర్ చెప్పారా..? అయితే ఇవి పాటించాల్సిందే!
కొలెస్ట్రాల్ ఎక్కువుందని డాక్టర్ చెప్పారా? అయితే ఆహార, విహారాల్లో మార్పులు చేసుకోవాల్సిందే. కొలెస్ట్రాల్ తగ్గటానికి మందులు వేసుకుంటున్నా కూడా వీటిని పాటించాల్సిందే.
కొలెస్ట్రాల్ తగ్గించే చిట్కాలు