మ్యూకార్‌మైకోసిస్. ఎవరినోట విన్నా ఇదే మాట. బ్లాక్ ఫంగస్ అనీ పిలుచుకుంటున్న ఇది చాలా చాలా అరుదైన సమస్య. కానీ కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ఇప్పుడు ఎంతోమంది దీని బారిన పడుతుండటం గమనార్హం. ప్రస్తుతం బయట పడుతున్న మ్యూకార్‌మైకోసిస్‌ను కొవిడ్-19తో ముడిపడిన సమస్యగానే చెప్పుకోవచ్చు. కొవిడ్-19 తొలిదశలోనూ ఇది తలెత్తిన మాట నిజమే గానీ అంత ఎక్కువగా కనిపించలేదు. ప్రస్తుతం రెండో దశలో ఎక్కువ మంది దీని బారినపడుతుండటం, ప్రమాదకరంగా పరిణమిస్తుండటం.. కొందరు ప్రాణాపాయ స్థితిలోకీ వెళ్లిపోతుండటమే ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్-19 తగ్గిన తర్వాతే మ్యూకార్‌మైకోసిస్ ఎక్కువగా బయటపడుతోంది. ప్రధానంగా మధుమేహంతో బాధపడే వారిలో, అదీ కరోనా చికిత్సలో భాగంగా కార్టికో స్టిరాయిడ్లు వాడిన వారిలోనే కనిపిస్తోంది. కరోనా పాజిటివ్‌గా ఉన్నప్పుడూ కొందరు దీని బారినపడుతున్నారు. కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారిలోనూ ఇది బయటపడుతోంది.
ఫంగస్ మూలం..
బ్లాక్ ఫంగస్‌కు మూలం మ్యూకార్‌మైసిటీస్ (జైగోమైసిటీస్) అనే ఫంగస్. ఇది ఇంటా బయటా ఎక్కడి వాతావరణంలోనైనా ఉండొచ్చు. గాలి ద్వారా ముక్కులోకి, గొంతులోకి ప్రవేశించి, వృద్ధి చెందుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతులను ఇదేమీ చేయదు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. మధుమేహులకు సాధారణంగానే రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అందుకే దీర్ఘకాలంగా మధుమేహం నియంత్రణలో లేనివారికి దీని ముప్పు ఎక్కువ. క్యాన్సర్ బాధితులకు, రక్తక్యాన్సర్ గలవారికి, కీమోథెరపీ తీసుకునేవారికి, అవయవ మార్పిడి చేయించుకున్న వారికి, ఇతర రకం ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తగ్గటానికి వాడే ఓరికొనజోల్ మందు తీసుకునేవారికి, రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకునేవారికీ వస్తుంటుంది. మ్యూకార్‌మైకోసిస్ ప్రధానంగా ముక్కు, ముక్కు చుట్టుపక్కల ఉండే గాలిగదుల (పారానేసల్ సైనసస్) మీద దాడి చేస్తుంటుంది. ఇది అక్కడికే పరిమితం కావటం లేదు. కళ్లు, మెదడుకూ విస్తరిస్తోంది. అందుకే దీన్ని ‘రైనో ఆర్బిటో సెరిబ్రల్ మ్యూకార్‌మైకోసిస్’ అనీ అంటున్నారు.
స్టిరాయిడ్ల అతి వాడకంతోనే..
కొవిడ్-19 తీవ్రమైన వారికి కార్టికో స్టిరాయిడ్లు ప్రాణరక్షణ ఔషధాలుగా ఉపయోగపడుతున్న మాట నిజమే. ఇవి వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్) అదుపుచేస్తూ సమస్య తీవ్రత, దుష్పరిణామాలు తగ్గటానికి దోహదం చేస్తాయి. వీటిని అవసరమైన మోతాదులో, అవసరమైన మేరకు వాడుకుంటే రామబాణంలా పనిచేస్తాయి. బయటి నుంచి ఆక్సిజన్ అందిస్తున్న వారికి, వెంటిలేటర్ మీదున్న వారికి రక్తనాళం ద్వారా డెక్సామెథసోన్, మిథైల్ ప్రెడ్నిసోలోన్ వంటి స్టిరాయిడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డాక్టర్ల సలహా తీసుకోకుండా అతిగా, అవనసరంగా, ఇష్టమున్నట్టు తీసుకోవటమే కొంప ముంచుతోంది. ప్రస్తుతం కొవిడ్-19 మందుల జాబితాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చలామణి అవుతున్నాయి. వీటిని చూసి సొంతగా మందులు కొనుక్కొని వాడుకోవటం ఇటీవల ఎక్కువైంది. మిగతా మందులేమో గానీ స్టిరాయిడ్లను మాత్రం ఆచితూచి వాడుకోవాలి. కరోనా తలెత్తాక తొలి 5 రోజుల్లో స్టిరాయిడ్లు మొదలెట్టటం ఏమాత్రం మంచిది కాదు. కావాలంటే 5 రోజుల తర్వాత ఆయాసం వంటివి ఉంటే తీసుకోవచ్చు. అయితే సరైన మోతాదులో, డాక్టర్ల పర్యవేక్షణలోనే వేసుకోవాలి. ఎందుకంటే వీటితో మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణాశయంలో పుండ్లు, నీటికాసులు, క్షయ ఉన్నవారికి ఆయా సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. మధుమేహులకు మరింత అప్రమత్తత అవసరం. స్టిరాయిడ్లతో రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పెరిగిపోతాయి. ప్రస్తుతం మ్యూకార్‌మైకోసిస్‌కు బీజం వేస్తోంది ఇదే. మధుమేహం లేనివారిలోనూ స్టిరాయిడ్లతో కొత్తగా మధుమేహమూ తలెత్తుతోంది.
రక్తంలో ఫెరిటిన్ స్థాయిలు పెరగటమూ ముప్పుగా పరిణమిస్తోంది. ఇది ఫంగస్ కణజాలానికి అతుక్కునేలా చేస్తుంది.
కొవిడ్-19 మ్యూకార్‌మైకోసిస్
లక్షణాలు రకరకాలు
మ్యూకార్‌మైకోసిస్‌లో ముక్కు, అంగిలి, కళ్లు, మెదడు వంటివన్నీ ప్రభావితం అవుతుండటం వల్ల రకరకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైంది ఒకవైపున తీవ్రమైన తలనొప్పి వస్తుండటం. దీంతో పాటు ఆయా అవయవాలను బట్టీ లక్షణాలు పొడసూపుతున్నాయి.
ముక్కులోపల నలుపు :
తొలిదశలో ముక్కు దిబ్బడ, ముక్కు కారటం.. శ్లేష్మం గోధుమ, నలుపు రంగులో రావటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మన ముక్కులో మూడు టర్బినేట్లు ఉంటాయి. పీల్చుకునే గాలిలో తేమను నింపేవి ఇవే. మ్యూకార్‌మైకోసిస్‌లో ముక్కు దూలంతో పాటు ఇవీ నల్లగా అవుతాయి.
కంటికి దెబ్బ :
సుమారు 50% మందిలో కంటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి. కంటి వెనకాల నొప్పి, రెప్పలు ఉబ్బటం, కనుగుడ్డు ముందుకు పొడుచుకురావటం, చూపు మసక బారటం, ఒకటికి రెండు కనిపించటం.. కంటి చుట్టూ చర్మం ఎర్రబడటం, తర్వాత నల్లబడటం వంటి లక్షణాలతోనే చాలామందిలో సమస్య బయటపడుతోంది. ఇన్‌ఫెక్షన్ ముక్కు, నోటి నుంచి మెదడు సమీపంలోని గాలి గదుల్లోకీ విస్తరిస్తుండటమే దీనికి కారణం. మన ముక్కు చుట్టూ 8 గాలి గదులుంటాయి. నుదుటి వద్ద (ఫ్రాంటల్), కళ్ల మధ్య (ఎత్మాయిడ్), బుగ్గల వెనకాల (మాగ్జిలరీ), మెదడుకు దగ్గర (స్ఫీనాయిడ్) రెండేసి గాలి గదులుంటాయి. ఇన్‌ఫెక్షన్ ముక్కు, నోటి నుంచి మెదడు వద్ద గాలి గదుల్లోకీ విస్తరించొచ్చు. ఈ గదుల గోడలకు పక్కనే కావర్నస్ సైనస్ అనే భాగముంటుంది. ఇందులో 3, 4, 6 పుర్రె నాడులుంటాయి. కంటి కండరాల కదలికలను నియంత్రించేవి ఇవే. ఇన్‌ఫెక్షన్ మూలంగా ఇవీ దెబ్బతింటున్నాయి. ఫలితంగా కంటి పైరెప్ప జారిపోవటం, కనుగుడ్డు కదలికలు ఆగిపోవటం, కనుపాప విస్తరించి అలాగే ఉండిపోవటం, చూపు పోవటం వంటివి తలెత్తుతున్నాయి. అలాగే దృశ్యనాడి ద్వారా ఇన్‌ఫెక్షన్ మెదడుకు విస్తరించే అవకాశముంది. కంటి లక్షణాలు కొందరికి నెమ్మదిగా మొదలవుతుండగా.. మరికొందరికి చాలా వేగంగా ముదురుతున్నాయి. కొందరికి రెండు, మూడు రోజుల్లోనే ఒక కంటి చూపు పోతుండటం గమనార్హం.
అంగిలి బొగ్గులా :
మన నోరు పైభాగం (అంగిలి) ముక్కు గాలి గదులకు పునాదిగా పని చేస్తుంటుంది. గాలి గదుల ఇన్‌ఫెక్షన్ మూలంగా ఇదీ నల్లగా, బొగ్గులాగా మారిపోతుంది. సుమారు 20% మందిలో ఇది కనిపిస్తోంది.
బుగ్గల నొప్పి :
ముక్కు చుట్టుపక్కల గాలి గదులు ఇన్‌ఫెక్షన్‌కు గురవటం వల్ల బుగ్గలు మొద్దుబారటం, బుగ్గల నొప్పి తలెత్తొచ్చు.
పళ్లు కదలటం :
బుగ్గల వద్ద గాలిగదుల్లో ఫంగస్ ఇన్‌ఫెక్షన్ మొదలైతే దవడ ప్రభావితమై దంతాలు కదిలిపోవచ్చు. ఇది పంటి నొప్పికి దారితీయొచ్చు.
చికిత్స: నిపుణుల బృందంతో..