సాధారణంగా చాలా పండ్లలో గింజలు ఉండడం మనకు తెలిసిందే. అయితే కొన్ని పండ్లలో వీటిని కప్పి ఉంచే ఒక చిన్న రాయి లాంటి దృఢమైన నిర్మాణం ఉండి.. దాని చుట్టూ పండు గుజ్జు ఉంటుంది. ఇలాంటి పండ్లనే ‘స్టోన్ ఫ్రూట్స్’ అంటారు. మామిడి, పీచ్, ఆప్రికాట్స్, ప్లమ్స్, చెర్రీస్, రాస్బెర్రీ.. వంటి పండ్లు ఇందుకు ఉదాహరణలు. అయితే వీటిలో ఎక్కువ శాతం ఆయా కాలాల్లో మాత్రమే లభ్యమవుతాయని.. తద్వారా అవి సహజంగా పరిపక్వం చెంది అమోఘమైన రుచిని అందిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంపొందించే ఔషధ గుణాలు కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
రోగనిరోధక శక్తికి..!
కాలం మారే కొద్దీ వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముట్టడం సహజమే! అయితే వీటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే స్టోన్ ఫ్రూట్స్ అందుకు చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. విటమిన్ ‘సి’, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉండే ఈ పండ్లు ఫ్రీరాడికల్స్ నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. అలాగే తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.