Sperm Loss Myths in Telugu :ఒక్క వీర్యం బొట్టు.. వంద రక్తపు బొట్లతో సమానం, మనం తినే వాటిల్లో అతి సారవంతమైన పదార్థం వీర్యంగా మారుతుందని, కండరాల్ని పిండితే అందులో నుంచి వచ్చే రసమని, అది ఉంటే బలంగా ఉంటారని, కోల్పోతే బలహీనంగా మారతారని ఇలా చాలా రకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అనేక మందికి వీర్యం గురించి సరైన అవగాహన లేదు. పైన చెప్పిన వాటిల్లో నిజమెంత, ఇతర అపోహలేమైనా ఉన్నాయా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వీర్యంలో రెండు రకాలుంటాయి. ఒకటి వీర్యకణాలు, రెండోది ద్రవం. వీటిల్లో వీర్య కణాలు వృషణాల నుంచి తయారవుతాయి. ట్యూబులార్ గ్లాండ్స్ లో ద్రవం తయారవుతుంది. ముందుగా వృషణాల నుంచి ఉత్పత్తయిన శుక్రకణాలు ఆ గ్రంథుల్లో చేరతాయి. ఈ ఉత్పత్తి ప్రక్రియ నిరంతరం జరిగి వీర్యకణాలు శుక్రకోశాల్లో చేరతాయి. కొద్ది రోజుల పాటు అవి అక్కడే ఉంటాయి. సెక్స్ అనంతరం లేదా ఇతర మార్గాల్లో వీర్యం పోయినప్పుడు మళ్లీ కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి.
"శుక్రకోశాల కిందే ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది. వీర్యం బయటికి వచ్చే సమయంలో ఆ గ్రంథి నిమ్మకాయను పిసికినట్లుగా అవుతుంది. దీంతో అది మూత్రంలోకి వచ్చి బయటికి వెళుతుంది. ఆ సమయంలో 2 1/2 నుంచి 5 సీసీఎల్ పరిమాణం గల ద్రవం బయటికి పోతుంది. వీర్యం అనేది నిరంతరం ఉత్పత్తయ్యే పదార్థం కాబట్టి.. దాన్ని ఎంత కోల్పోయినా బలహీనంగా మారరు. ఒక బొట్టు వీర్యం వంద రక్తపు చుక్కలకు సమానం అని అంటుంటారు. అది నిజం కాదు."
- డాక్టర్ సమరం, ప్రముఖ వైద్యులు