తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఇటు కరోనా... అటు డయేరియా, మలేరియా.. అప్రమత్తతే ఔషధం! - corona latest news

కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైంది.   సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉండటంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎవరికి వారు ఆరోగ్య రక్షణకు శ్రద్ధచూపాలని వైద్యులు సూచిస్తున్నారు.

special Story on Threat with seasonal diseases
special Story on Threat with seasonal diseases

By

Published : Aug 14, 2020, 6:08 AM IST

వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండడంతో.. మలేరియా, డెంగీ వంటి జ్వరాలే కాకుండా.. కలుషిత నీటితో వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్‌ తదితర వ్యాధులు సోకే అవకాశాలున్నాయి. వీటితో పాటు ఏటా సెప్టెంబరు నుంచి మార్చి వరకూ ఇబ్బందిపెట్టే స్వైన్‌ఫ్లూ ఉండనే ఉంది.గతేడాది డెంగీ ఉక్కిరిబిక్కిరి చేయగా ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 1100 కేసులు నమోదవడం గమనార్హం.

సాధారణంగా ఏడాది మొత్తమ్మీద సెప్టెంబరులో అత్యధిక జ్వరాలు నమోదవుతాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి.గతేడాది డెంగీ కేసులు 13వేలు నమోదు కాగా, మలేరియా 1711, స్వైన్‌ఫ్లూ కేసులు 210 వరకూ నమోదయ్యాయి. ఈ వ్యాధుల్లో అత్యధికం ఆగస్టు తర్వాతనే నమోదైనవి కావడం గమనార్హం. ఈ నెలల్లో వర్షాలు అధికంగా కురవడం, వాతావరణం చల్లబడటం.. వెరసి దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వైరస్‌ వ్యాప్తికీ అనుకూలిస్తుంది. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విషజ్వరాలతో బాధపడేవారి సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుంది. సెప్టెంబరులో మొదలయ్యే ఈ వ్యాధులు కనీసం ఐదునెలల పాటు ప్రజలను ఇబ్బందిపెడతాయి.

ఇంకోవైపు కలుషిత నీటి కారణంగా ఏటా సుమారు 4 లక్షలకు పైగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై డయేరియా ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

2వేలకు పైగా డెంగీ పీడిత గ్రామాలు

రాష్ట్రంలో సుమారు 2000 మలేరియా పీడిత గ్రామాలను నాలుగేళ్ల కిందట గుర్తించి, ముందస్తు కార్యాచరణను అమలు చేయడంతో ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 1000కి తగ్గినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. అయితే ఇదే సమయంలో డెంగీ పీడిత గ్రామాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 2000కి పైగా డెంగీ ప్రభావిత గ్రామాలు, పట్టణాలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా జీహెచ్‌ఎంసీలో అత్యధిక కేసులు నమోదవుతుండగా, ఆ తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ నగర, మహబూబ్‌నగర్‌ జిల్లాలున్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టి ముందస్తు చర్యలపై దృష్టిసారించాల్సిన అవసరముంది.

కరోనాతో పాటు ఇతర వ్యాధులపైనా

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ ప్రస్తుతం కరోనా చికిత్సలపైనే దృష్టిపెట్టాయి. మరికొన్నాళ్లు కూడా ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాలానుగుణంగా విజృంభించే వ్యాధులకూ సరైన సమయంలో చికిత్స అందించలేకపోతే.. నష్టం తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే కాలానుగుణ వ్యాధులకూ అవసరమైన చికిత్సను అందించడానికి ప్రభుత్వం, ఆసుపత్రులు ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది.

తక్షణ కార్యాచరణ ఏమిటి?

  • డెంగీ, మలేరియా, చికున్‌గన్యా తదితర జ్వరాలన్నీ కూడా దోమల ద్వారా వ్యాపించేవే.
  • డెంగీ కారక దోమ కేవలం నిల్వఉన్న మంచినీటిలోనే వృద్ధి చెందుతుంది.
  • (అంటే ఇళ్లలో పగిలిన కప్పులు, పాత టైర్లు, ఎయిర్‌ కూలర్లు, పూలకుండీలు, కొబ్బరి చిప్పలు, నీటి డ్రమ్ములు, నీటి ట్యాంకులు, సంపులు.. ఇలాంటి వాటిలో ఈ దోమ వృద్ధి చెందుతుంది)
  • ఈ దోమ ఎక్కువ దూరం ప్రయాణం చేయలేదు. దోమ జీవిత కాలంలో గరిష్ఠంగా 100 మీటర్లకు మించి పోలేదు.
  • ఇది పగటి పూటే కుడుతుంది. అందుకే ఎక్కువగా ఇళ్లలో ఉండే పిల్లలు, మహిళలు డెంగీ జ్వరం బారిన పడుతుంటారు.
  • మలేరియా దోమ మురుగునీటిలో వృద్ధి చెందుతుంది.
  • కాబట్టి ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
  • నిల్వనీటిపై దోమల సంహారిణి మందును పిచికారీ చేయాలి.
  • సురక్షిత తాగునీటిని తీసుకోవాలి. తాగునీటిపై అవగాహన కల్పించాలి.
  • వేడి, తేమ కలిసి ఉన్న వాతావరణాన్ని కీటకాలు ఎక్కువగా ఇష్టపడతాయి.ఈ వాతావరణంలో దోమలు,ఈగలు, చీమలు ఎక్కువగా ఉంటాయి.చీకటి ప్రదేశాల్లో స్థానం ఏర్పరచుకుంటాయి.
  • వీటి ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లను వ్యాప్తి చేస్తుంటాయి.
  • రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తీసుకోవాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మారుమూల తిమ్మిరిగూడేనికి చెందిన కుడం సింగయ్య వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానిక ఆదివాసీలు గురువారం వాగులు, వంకలు దాటుతూ బురద దారిలో దాదాపు 4 కి.మీ. దూరంలో ఉన్న అంజనాపురం వరకు ఇలా జెట్టీలో చేర్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జ్వరంతో బాధపడుతున్న సింగయ్యకు చికిత్స అందడంతో ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది.

ABOUT THE AUTHOR

...view details