World Brain Day : శరీరంలో ఏ భాగం పనిచేయాలన్నా.. మెదడే కీలకం. మెదడు సహకరించకపోతే.. ఏమీ చేయలేని పరిస్థితి. అంతటి కీలకమైన అవయవ ఆరోగ్యం ప్రస్తుతం ప్రమాదంలో పడుతోంది. మారుతున్న జీవనశైలే ఇందుకు కారణం. కొందరు దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కారణంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. భాగ్యనగరంలోనూ ఈ తరహా బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిమ్స్‌కు నిత్యం న్యూరో సంబంధిత సమస్యలతో 70-100 మంది వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. యువతనూ ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. శుక్రవారం వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
World Brain Day : మెదడు మాట వింటున్నారా? - బ్రెయిన్ స్ట్రోక్‌కు గల కారణాలు
World Brain Day : శరీరంలో గుండె తర్వాత అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. ఏ భాగం పనిచేయాలన్నా.. మెదడే కీలకం. ఇది కనుక మొరాయిస్తే.. ఇక మనిషి ఏం చేయలేని పరిస్థితి. అందుకే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెబుతుంటారు డాక్టర్లు. కానీ ప్రస్తుతం మెదడు ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా దానికి గల కారణాలను.. మెదడు ఆరోగ్యానికి పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. అపోలో న్యూరో సైన్స్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ కుమార్.
మెదడు ఆరోగ్యానికి పాటించాల్సిన జాగ్రత్తలను అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్‌కుమార్ ఇలా వివరించారు..
- నిద్రలేచే సమయంలో తలనొప్పి, చూపు మందగింపు, శరీరం ఒకవైపు కుంగినట్లు అన్పించినా, వాంతుల్లాంటివి తరచూ వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- రోజూ 7-8 గంటలపాటు గాఢ నిద్రపోవాలి.
- చేపలు, బ్లూబెర్రీస్, వంటల్లో పసుపు వాడాలి. గుమ్మడికాయ, నారింజ, వాల్‌నట్, బ్రోకలి, గుడ్లు, విటమిన్ బి12 ఉండే ఆహారం తినాలి.
- వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. జాగింగ్, వేగంగా నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ ఏదైనా చేయొచ్ఛు రోజూ 30 నిమిషాలకు తక్కువ కాకుండా చేయడం మేలు.
అవగాహన తక్కువే..మెదడుకు సంబంధించిన సమస్యలు.. చికిత్స విధానాలపై బోహ్రింగర్ ఇంగెల్హీమ్ సంస్థ తరఫున మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇప్సోస్ ‘ద స్టేట్ ఆఫ్ స్ట్రోక్ - ఏ సర్వే ఆన్ అవేర్‌నెస్ ఎబౌట్ స్ట్రోక్ ఇన్ అర్బన్ ఇండియా’ సర్వే చేసింది. హైదరాబాద్, మరో 11 ప్రధాన నగరాల్లోనూ చేసిన అధ్యయన నివేదికను ‘వరల్డ్ బ్రెయిన్ డే’ సందర్భంగా విడుదల చేసింది.
- 4742 మందితో మాట్లాడారు.
- చికిత్సావకాశాల గురించి తెలుసని చెప్పింది - 10 శాతం
- హైదరాబాద్‌లో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై తెలియనివారు - 81శాతం
- బ్రెయిన్ స్ట్రోక్ పదం విన్నామని చెప్పింది - 78 శాతం
- మాట్లాడటంలో ఇబ్బంది(స్పీచ్ డిఫికల్టీ), ముఖం వంకరపోవడం(ఫేసియల్ డ్రూపింగ్), చేతులు, కాళ్లలో నిస్సత్తువ వంటి లక్షణాలుంటాయని చెప్పింది - 19 శాతం
- అస్పష్టంగా మాట్లాడటమూ (స్లర్డ్ స్పీచ్) బ్రెయిన్ స్ట్రోక్ లక్షణంగా గుర్తించింది - 25 శాతం
- అధిక రక్తపోటు కారణమవుతోందని చెప్పింది - 26 శాతం.