తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఆత్మాభిమానానికి... 'ఆకృతి'నిస్తోంది!

వైద్య ప్రమాణాలు పెరిగిన ఈ రోజుల్లోనూ ‘క్యాన్సర్‌’ నిర్ధారణ కాగానే... జీవితం ముగిసిపోయినట్లుగా ఆందోళన చెందుతారు చాలామంది. మహిళలూ, వారిలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ బాధితుల్లో ఈ భయం ఇంకా ఎక్కువ ఉండటాన్ని గమనించింది ఆకృతి గుప్తా. అందుకే అలాంటివారిలో క్యాన్సర్‌ భయాన్ని పోగొడుతూ, చికిత్స తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా వారికోసం కృత్రిమ ఉత్పత్తుల్నీ తీసుకొచ్చింది ఆకృతి.

special story on  Akriti Gupta
ఆత్మాభిమానానికి... 'ఆకృతి'నిస్తోంది!

By

Published : Jun 23, 2020, 11:24 AM IST

మహిళల సమస్యలు వారికంటే ఇంకెవరికి బాగా అర్థమవుతాయి... హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఆకృతి గుప్తాని చూస్తే ఈ మాటలు కచ్చితంగా నిజమనిపిస్తాయి. ఈమె తండ్రి అరుణ్‌ క్యాన్సర్‌ని జయించాడు. కానీ చికిత్స సమయంలో ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది. క్యాన్సర్‌ బాధితుల్లో అసలు సమస్యకంటే కూడా మానసిక వేదన ఎక్కువగా ఉండడాన్ని గమనించారు ఆకృతి తల్లిదండ్రులు. క్యాన్సర్‌ బాధితులకు అండగా ఉండేందుకు ఒక సేవా సంస్థని ప్రారంభించారు. ఓ పక్క దిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ, మరోపక్క ఎన్జీఓ పనుల్లో చురుగ్గా పాల్గొనేది ఆకృతి. అక్కడ పనిచేస్తున్నపుడే ఆమె వందలమంది రొమ్ము క్యాన్సర్‌ బాధిత మహిళల్ని కలిసింది. వారంతా చికిత్స తర్వాత తమ శరీరంలో వచ్చిన మార్పు విషయంలో ఆందోళన పడటాన్ని గమనించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వైద్యులూ, మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ సెషన్లని ఏర్పాటు చేయించేది. డిగ్రీ తర్వాత ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌)లో ‘సోషల్‌ ఆంట్రప్రెన్యూర్‌షిప్‌’ విభాగంలో పీజీ చేసేందుకు చేరింది. తన చదువులో భాగంగా సామాజిక వ్యాపారాన్ని ప్రారంభించాల్సి వచ్చినపుడు రొమ్ము క్యాన్సర్‌ బాధితులూ, విజేతలకు ఉపయోగపడే ఉత్పత్తుల్ని తేవాలనుకుంది.

తక్కువ ధరకే...

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా ఒక వైపు రొమ్ముని తొలిగించాక వచ్చే మార్పువల్ల శరీరం బ్యాలెన్స్‌ తప్పుతుంది. ఆ సమస్యని పరిష్కరించడానికి కృత్రిమ రొమ్ము(ఎక్సట్రనల్‌ బ్రెస్ట్‌ ప్రోస్థిసస్‌)నీ, మాస్టక్టమీ(సర్జరీ తర్వాత అవసరమయ్యే)బ్రాసరీల్నీ రూపొందించాలనుకుంది ఆకృతి. ఈ విషయంలో ఆమెకు తల్లి కవిత తోడ్పాటునందించారు. వైద్యులూ, డిజైనర్లని సంప్రదించాక 2019లో ‘కెన్‌ఫెమ్‌’ సంస్థని ప్రారంభించి ఈ ఉత్పత్తుల్ని తెచ్చింది ఆకృతి. ‘మార్కెట్‌లో ఇప్పటికే ఇలాంటివి ఉన్నప్పటికీ వాటిని సిలికాన్‌తో తయారుచేయడంవల్ల ధరలు చాలా ఎక్కువ. పేద, మధ్య తరగతి వర్గాలకు అస్సలు అందుబాటులో ఉండవు. వాటిని కాటన్‌తో తయారుచేయడం వల్ల మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తుల ధరలతో పోల్చితే 20 శాతానికే అందించగలగుతున్నారు. హరియాణాలోని గ్రామీణ మహిళలతో వీటిని తయారుచేయిస్తున్నారు. కాటన్‌తో చేయడంవల్ల ఈ బ్రాలు వినియోగానికి అనుకూలంగా ఉండటమే కాదు, అలర్జీలూ రావు’ అని చెబుతారు ఆకృతి. ఈ ఉత్పత్తుల్ని canfem.com పోర్టల్‌తోపాటు వివిధ ఎన్జీఓల ద్వారానూ అందిస్తున్నారు.

ఉత్తమ అంకురం...

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా తొమ్మిదివేల మంది ఈ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసినట్లు చెబుతారు ఆకృతి. తమ ఉత్పత్తులతో వేలమంది మహిళలు తిరిగి గౌరవప్రదమైన, నాణ్యమైన జీవితాన్ని గడుపుతుంటే తనకు ఎంతో సంతృప్తిగా ఉంటోందని చెప్పే ఆకృతి... అదే తాను ఓవైపు చదువునీ, మరోవైపు వ్యాపారాన్నీ కొనసాగించేలా చేసిందంటారు. అంకుర సంస్థల విభాగంలో విద్యార్థులకు నిర్వహించే అంతర్జాతీయ పోటీ... ‘గ్లోబల్‌ స్టూడెంట్‌ ఆంట్రప్రెన్యూర్‌ అవార్డ్స్‌-2020’లో భారత్‌ నుంచి ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచస్థాయి పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. క్యాన్సర్‌ బాధితులకు ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించవచ్చంటున్న ఆకృతి... కెన్‌ఫెమ్‌ద్వారా స్వీయ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పరీక్షలు చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తోంది. క్యాన్సర్‌ లక్షణాలతో ఉండే నమూనా రొమ్ముని రూపొందించి అవగాహన కల్పిస్తోంది. తరచూ క్యాన్సర్‌ బాధితులకు విజేతలతో ధైర్యవచనాలు చెప్పిస్తోంది. కరోనా సమయంలోనూ క్యాన్సర్‌ నిపుణుల చేత వెబినార్లనీ ఏర్పాటుచేసింది. భవిష్యత్తులో తమ సంస్థ నుంచి క్యాన్సర్‌ బాధితులకు మరిన్ని రకాల సేవలు అందిస్తామంటోంది ఆకృతి.

ఇదీ చూడండి:వెచ్చటి నీళ్లు తాగితే... కరోనా పోతుందా?

ABOUT THE AUTHOR

...view details