తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Vaccine Efficacy: కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు నిద్ర ఓ దివ్యౌషధం! - నిద్రలేకపోతే అనేక అనర్థాలు

శరీరానికి తగినంత నిద్ర ఇవ్వడంతో అనేక ఫలితాలు ఉన్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో టీకా అత్యుత్తమ ఫలితాలిచ్చి.. యాంటీబాడీలు బాగా వృద్ధి చెందడంలో నిద్ర కీలక భూమిక పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనేక అధ్యయనాల్లో ఇదే తేలిందని.. నిద్ర ఓ దివ్యౌషధమని అంటున్నారు. నిద్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలపై.. స్లీప్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్ జి.రమాదేవి విశ్లేషణ

కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు నిద్ర ఓ దివ్యౌషధం!
కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు నిద్ర ఓ దివ్యౌషధం!

By

Published : Jun 20, 2021, 8:03 AM IST

కంటి నిండా నిద్రపోయే వారిలో కరోనా వ్యాక్సిన్‌ మంచి ఫలితాన్నిస్తుందా..? నిద్రకు, రోగనిరోధక శక్తికి సంబంధం ఉందా..? అంటే అవుననే చెబుతున్నారు ఆ రంగానికి చెందిన నిపుణులు. ఫ్లూ, హైపటైటిస్‌ వంటి వైరస్‌ ఇన్‌ఫెక్షన్లకు సంబంధించిన వ్యాక్సిన్లు తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు, తీసుకున్న తర్వాతా హాయిగా నిద్రపోయిన వారిలో టీకా ప్రభావశీలత, యాంటీబాడీల వృద్ధి ఎక్కువగా ఉందని వివిధ అధ్యయనాల్లో తేలింది.

‘నిద్ర దివ్యౌషధం. మీ మెదడుకు, శరీరానికి సాంత్వన చేకూర్చి రోగ నిరోధకశక్తిని పెంచే ఇమ్యూన్‌ థెరపీ. అది ఉచితం కూడా. పైగా నిద్రతో వచ్చే ఇతర దుష్ప్రభావాలు లేవు. అంతటి గొప్ప ఔషధాన్ని వాడటంలో పిసినారితనం ఎందుకు..? హాయిగా నిద్రపోండి. ఆరోగ్యంగా ఉండండి’ అని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వ్యాక్సిన్‌కూ, రోగనిరోధక శక్తికీ, నిద్రకూ ఏంటి సంబంధం..? రోజుకు ఎన్ని గంటల నిద్ర అవసరం..? తగినంత సమయం నిద్రపోకపోతే వచ్చే నష్టాలేంటి..? కరోనా సమయంలో నిద్రకున్న ప్రాధాన్యమేంటి..? హాయిగా నిద్రపోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి అంశాలపై ఏపీలోని తిరుపతిలోని అమరా ఆసుపత్రి ఎండీ, కన్సల్టెంట్‌ స్లీప్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌. గౌరినేని రమాదేవి విశ్లేషణ ఇది.

నిద్రలేకపోతే అనేక అనర్థాలు..

మనిషి ఆరోగ్యానికి పోషకాహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత, మంచి నిద్ర ముఖ్యం. రోజులో ఎన్ని గంటలు నిద్ర అవసరమన్నది మనిషి వయసునుబట్టి ఉంటుంది. పెద్దవారికి రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఎండోక్రైన్‌ హార్మోన్‌ సక్రమంగా విడుదల కాదు. పిల్లల్లో గ్రోత్‌హార్మోన్‌ తగ్గుతుంది. ఇది నాడీ, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వృద్ధాప్యం త్వరగా మీద పడుతుంది. వైరస్‌లు, ఇతర ఇన్‌ఫెక్షన్లు త్వరగా దాడి చేస్తాయి. మనిషికి అత్యంత కీలకమైన, అవసరమైన ప్రక్రియ నిద్ర. మంచి నిద్రతో మెదడుకు, శరీరానికి పునరుత్తేజం కలుగుతుంది.

నిర్లక్ష్యం చెయ్యొద్దు..

జీవన వేగం పెరగడం, ఒత్తిళ్ల వల్ల ప్రస్తుతం చాలా మంది కంటినిండా నిద్రకు దూరమవుతున్నారు. టీవీ, కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ వంటి ఉపకరణాలు మనిషిని నిద్రకు దూరం చేస్తున్నాయి. కరోనా సమయంలో మానసిక ఒత్తిళ్లు పెరిగాయి. కుటుంబీకులు ఎవరైనా కరోనా బారినపడితే వారి ఆరోగ్యంపై ఆందోళన, ఆర్థిక సమస్యలు నిద్రకు దూరం చేస్తున్నాయి. చాలా మంది అర్ధరాత్రి దాటేంత వరకు టీవీ, కంప్యూటర్‌, ఫోన్లతోనే కాలం గడపడం, రాత్రి ఆలస్యంగా భుజించడం, ఆ వెంటనే పడుకోవడం వంటి చాలా కారణాలు నిద్రలేమికి కారణమవుతున్నాయి. అది దీర్ఘకాలంలో నష్టపరుస్తుంది.

కొవిడ్‌ వచ్చి తగ్గినవారిలో..

కొవిడ్‌ బారిన పడినవారు, వ్యాధి నయమైనవారు కూడా నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు పూర్తిగా మంచంపై ఉంటారు. ఆ సమయంలో సైటోకైన్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో పగలు, రాత్రి ఎక్కువసేపు నిద్రపోతారు. వారికి ఆక్సిజన్‌ ఎక్కువగా అందడానికి బోర్లా పడుకోమని చెబుతుంటాం. ఆ క్రమంలోనూ ఎక్కువసేపు నిద్రిస్తారు. వ్యాధి కొంత తగ్గుముఖం పట్టేసరికి నిద్ర సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొందరు పగలు నిద్రపోవడం వల్ల రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు.

ఆసుపత్రి వాతావరణం, చుట్టూ రోగులను చూసి ఆ భయంతో కొందరికి నిద్రరాదు. గాలి సరిగ్గా లేకపోవడం, వేడి వాతావరణం వల్ల కొందరు నిద్రకు దూరమవుతున్నారు. కొవిడ్‌ చికిత్సలో భాగంగా వాడే మందులు, స్టెరాయిడ్స్‌ ప్రభావం వల్ల కొందరిలో కండరాల బలహీనత, ఒత్తిడి కొంతకాలం కొనసాగుతోంది. వారు ఆహార నియమాలను పాటించడం, పగలంతా మంచంపై ఉండకుండా చిన్నచిన్న పనుల్లో నిమగ్నమవడం, శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా సాధారణ స్థితికి రావొచ్చు. కొందరికి కౌన్సెలింగ్‌ అవసరమవుతుంది.

యాంటీబాడీల ఉత్పత్తికి మంచి నిద్ర అవసరం..

సరిపడా నిద్రించే వారిలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు బాగుంటుంది. తెల్లరక్త కణాలు తగినన్ని యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. బి సెల్స్‌, టి సెల్స్‌ సమర్థంగా పని చేస్తాయి. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమవడంతో దానికీ, నిద్రకూ ఉన్న సంబంధంపై నిర్దిష్టమైన అధ్యయనాలు ఇంకా చేపట్టలేదు. కానీ గత అనుభవాలను, ఇతర వైరస్‌ వ్యాక్సిన్లపై అధ్యయనాలను చూస్తే వ్యాక్సిన్ల ప్రభావశీలతపై నిద్ర కచ్చితంగా ప్రభావం చూపుతున్నట్టు తేలింది.

ఫ్లూ, హెపటైటిస్‌, హెచ్‌1ఎన్‌1 వంటి వైరస్‌ వ్యాక్సిన్లు తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు, తర్వాత.. రోజుకు 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిద్రపోయిన వారిలో ప్రభావశీలత బాగున్నట్టు తేలింది. 6 గంటల కంటే తక్కువసేపు నిద్రించిన వారిలో యాంటీబాడీల ప్రతిస్పందన తక్కువ ఉంది. మధ్యాహ్నం కంటే ఉదయంపూట వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో మంచి ఫలితాలు వచ్చాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి మంచి నిద్రతోపాటు మానసిక ప్రశాంతత ముఖ్యం. టీకా తీసుకున్నాక యాంటీబాడీలు ఉత్పత్తవుతాయో లేదోనన్న ఆలోచనలోనే ఉంటే అసలు నిద్రే పట్టదు. వ్యాక్సిన్‌ తీసుకునే ముందు, ఆ తర్వాత ఎలాంటి ఆందోళన వద్దు.

ఇలా చేసి చూడండి..!

*కరోనా సమయంలో ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటున్నా.. ఇంటినుంచే పనిచేస్తున్నా ఆలస్యంగా పడుకోవడం, ఇష్టమొచ్చినప్పుడు లేవడం మంచిది కాదు. నిర్దిష్ట సమయానికే నిద్రను అలవాటు చేసుకోవాలి.

*పడుకునే సమయానికి 2,3 గంటల ముందే రాత్రి భోజనం చేయాలి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల సరిగా జీర్ణం కాదు. అది జీర్ణమయ్యే క్రమంలో విడుదలయ్యే యాసిడ్స్‌ వల్ల నిద్రాభంగం కలుగుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలకూ దారితీస్తుంది.

*నిద్రపోయే ముందు కాఫీ తాగితే అందులోని కెఫీన్‌ నిద్రాభంగం కలిగిస్తుంది. రోజుకు 3 కప్పులకంటే ఎక్కువ కాఫీ తాగకూడదు. అది కూడా మధ్యాహ్నం మూడింటిలోపే తాగడం మంచిది.

*మధ్యాహ్నం వీలుంటే చిన్నకునుకు తీయడం మంచిదే! కానీ మధ్యాహ్నం 3 దాటాక ఎక్కువసేపు నిద్రిస్తే రాత్రి నిద్ర రాదు.

*పగటిపూట శారీరక శ్రమ ఉండాలి. ప్రత్యేకంగా వ్యాయామం చేయకపోయినా ఇంటి పనులు, తోట పని, కొంత దూరం నడవడం వంటివి చేయాలి. రాత్రి బాగా పొద్దుపోయాక వ్యాయామం మంచిది కాదు. కొందరు ఎనిమిది దాటాక కూడా జిమ్‌కు వెళుతుంటారు. వ్యాయామం వల్ల మెదడు చురుకవుతుంది. నిద్ర ఆలస్యమవుతుంది.

*ధూమపానం, మద్యపానం వల్లా ఇబ్బందే. ఆల్కహాల్‌ తీసుకుంటే నిద్ర పడుతుంది కానీ మధ్యలో మెలకువ వచ్చేస్తుంది.

*టీవీ చూస్తూ పడుకోవడం మంచిది కాదు. కూర్చునే చూడండి. నిద్రవస్తే కట్టేసి పడుకోండి.

*పడుకునే ముందు కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్లు చూడొద్దు. వాటి నుంచి విడుదలయ్యే బ్లూలైట్‌ మెదడుపై ప్రభావం చూపుతుంది.

*పడుకోవడానికి గంట ముందు నుంచే మెదడును ప్రశాంతంగా ఉంచే పనులు చేయాలి. కొందరికి పుస్తకాలు చదివితే నిద్ర వస్తుంది. నాకు పడుకునే ముందు కుట్లు, అల్లికలు ఇష్టం. సమయం ఎందుకు వృథా చేయడం, డబ్బులు పెడితే బయట దొరుకుతాయి కదా..? అని మా వాళ్లు అంటుంటారు. కానీ ఆ పనిలో నాకు సంతోషం ఉంది. మనం చేసే పని వల్ల ఎంత తృప్తి లభిస్తుందన్నది ముఖ్యం. పాటలు వినడం, పాడటం, సుడోకు వంటి మెదడుకు మేత పనుల వల్ల దృష్టంతా దానిపై నిమగ్నమవుతుంది.

*మీ వృత్తిలో భాగంగా రోజూచేసే పనే నిద్రకు ముందు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. నేను వృత్తిరీత్యా వైద్యురాలిని. నిద్రపోయే ముందు వృత్తి సంబంధిత పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. వాటికి భిన్నమైన ఆసక్తులను, అభిరుచులను ఎంచుకోవాలి.

*నిద్ర పట్టకపోయినా మంచంపై పడుకొని దొర్లుతూ తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఒత్తిడి ఎక్కువై నిద్ర పట్టదు. లేచి కాసేపు నచ్చిన పని చేసి మళ్లీ పడుకుంటే మంచిది.

ఇవీ చదవండి:దంతాలపై బ్లాక్​ఫంగస్ దాడి.. అప్రమత్తతే దీనికి రెమెడీ

ABOUT THE AUTHOR

...view details