రిలాక్స్, సంతోషం కోసం మనం పాటలు వింటుంటాం. అయితే కొన్ని పాటలు మన మైండ్‌లో నాటుకుపోతాయి. ఆ పాటను వినడం ఆపేసినా కానీ మన మెదడులో మాత్రం ఆ పాటనే తిరుగుతూ ఉంటుంది. మనం ఆఫీసులో పని చేస్తున్నా అదే గుర్తుకు వస్తుంటుంది. అసలు ఒక పాట ఇలా ఎలా మన మెదడులోకి వెళ్తుంది. దీని నుంచి మన మెదడును ఎలా బయటకు తీసుకురావాలో ఓ సారి చూద్దాం.
ఖాళీ సమయాల్లో, ప్రయాణాల్లో సరదాగా పాటలు వింటుంటాం. అలా మీరు కూడా పాటలు వింటుంటే.. ఏదైనా పాపులర్ సాంగ్ లేదంటే మీకు బాగా ఇష్టమైన పాట వచ్చిందంటే.. దాని తాలుకా ప్రభావం మీ మనసుపై పడుతుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
తెలుగులో బాగా పాపులర్ అయిన 'బుట్ట బొమ్మ' పాట మీకు బాగా ఇష్టం అనుకుందాం. ఈ పాటను విన్న తర్వాత చాలాసేపటి వరకు మీ మెదడులో ఇదే పాట తిరుగుతూ ఉంటుంది. మీరు ఆఫీసుకు వెళ్లినా, తిరిగి ఇంటికి వచ్చినా మీ మదిలో ఇదే పాట పదే పదే తిరుగుతూ ఉంటుంది. అసలు మన మెదడులో ఆ పాట ఇంత బలంగా నాటుకుపోవడానికి, పదేపదే గుర్తుకు రావడానికి కారణాలు ఏంటో యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి కాలేజ్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ జేమ్స్ కెల్లారిస్ అధ్యయనం చేశారు. మనం పాట వినడం, ఆ పాట మన మదిలో నాటుకుపోవడం అనేది సైంటిఫిక్ విషయం. మనం పాట విన్నప్పుడు అది మన మెదడులోని ఆడిటరి కార్టెక్స్ అనే భాగాన్ని ప్రేరేపిస్తుంది.
'బుట్టబొమ్మ' సాంగ్‌ను కొద్దిగా విన్నా మన మెదడు మాత్రం మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసుకుంటుంది. మన మెదడు ఇలా సగం విన్న పాటను పూర్తి చేయడానికి ఆడిటరి కార్టెక్స్ అనే భాగం ఆటోమెటిక్‌గా పనిచేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇలా జరగడానికి కారణం మన మెదడులోని ఆడిటరి కార్టెక్స్ పాటకు కనెక్ట్ అవడం. అది పాటకు కనెక్ట్ అవడం వల్ల పాట కొంత భాగం విన్నా మిగిలిన భాగాన్ని పూర్తి చేసుకుంటుంది. ఆ పాటను మనం పదేపదే రాగాలు తీయడం, మరవకపోవడం లాంటి అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఆ పాటను గుర్తుచేసుకోకూడదని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోయే వాళ్లకు ఇది అన్ని విషయాలను గుర్తుపెట్టుకునే శక్తిని ఇస్తుందని పరిశోధనలో తేలింది.