రాత్రిపూట మెలకువగా ఉన్నప్పుడు మూత్రం రావటం సహజమే. ఇదేమీ ఇబ్బంది పెట్టదు. కానీ మంచి నిద్రలో ఉన్నప్పుడు రావటమే సమస్య. ఏదో ఒక రోజంటే ఏమో అనుకోవచ్చు. రోజూ నిద్రలోంచి లేవాల్సి రావటమే ఇబ్బంది కలిగిస్తుంది. మంచి నిద్రలో ఉన్నప్పుడు తరచూ రోజుకు రెండు, అంతకన్నా ఎక్కువసార్లు మూత్రం పోయటానికి లేస్తున్నట్టయితే నాక్చూరియాగా పరిగణిస్తారు. దీన్ని ఒకరకంగా వయసుతో ముడిపడిన సమస్య అనుకోవచ్చు. వయసు పెరుగుతున్నకొద్దీ ఎక్కువవుతుంటుంది. వృద్ధుల్లో తరచూ చూస్తుంటాం.
ఆడవారిలో కన్నా మగవారిలో ఎక్కువ. డెబ్బై ఏళ్లు పైబడిన మగవారిలో సుమారు 70-90% మంది దీంతో సతమతమయ్యేవారే! వృద్ధుల్లో ఎక్కువగా కనిపించినప్పటికీ చిన్నవయసులో రాకూడదనేమీ లేదు. 20-40 ఏళ్లవారిలో దాదాపు 20-44% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా.
కారణాలు రకరకాలు:
నిజానికి రాత్రిపూట నిద్రలో మూత్రం రావటం జబ్బేమీ కాదు. లక్షణం మాత్రమే. దీనికి రకరకాల అంశాలు కారణమవుతుండొచ్చు.
మూత్రం ఉత్పత్తి పెరగటం (పాలీయూరియా)
మూత్రం అధికంగా తయారైతే ఎక్కువసార్లు విసర్జన అవుతుంది. మరి మూత్రం ఉత్పత్తి ఎందుకు పెరుగుతుంది? దీనికి ప్రధాన కారణం ఎక్కువ నీరు, ద్రవాలు తాగటం. మనలో చాలామంది ఎక్కవ నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటారు. రోజుకు ఐదారు లీటర్ల నీళ్లు తాగేవారూ ఉన్నారు. మన శరీరానికి నీరు అత్యవసరమే గానీ ఎక్కువెక్కువ తాగాల్సిన అవసరమేమీ లేదు. కొందరు రాత్రి పడుకునే ముందూ రెండు, మూడు గ్లాసుల నీరు తాగుతుంటారు. పాలు, మజ్జిగ వంటివీ తీసుకుంటుంటారు. రాత్రి పూట చల్లగా ఉంటుంది. విశ్రాంతిగా పడుకుంటాం. అంతగా చెమట పట్టదు. కాబట్టి అవసరానికి మించి ఎక్కువ నీరు, ద్రవాలు తాగితే అది మూత్రంగా మారుతుంది. రోజుకు 2.5 లీటర్ల కన్నా ఎక్కువ మూత్రం తయారైతే రాత్రిపూట లేవాల్సిన అవసరమూ పెరుగుతుంది.
- మూత్రం ఎక్కువగా ఉత్పత్తి కావటానికి మరో ముఖ్య కారణం మధుమేహం నియంత్రణలో లేకపోవటం. రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగినప్పుడు దీన్ని బయటకు పంపటానికి కిడ్నీలు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. దీంతో మూత్రం ఎక్కువగా తయారవుతుంది. మధుమేహంతో మూత్రాశయం పనితీరూ దెబ్బతింటుంది. ఇదీ మూత్రం ఎక్కువ వచ్చేలా చేయొచ్చు.
- డయాబిటిస్ ఇన్‌సెపిడిస్ అనే సమస్యతోనూ మూత్రం ఉత్పత్తి పెరగొచ్చు. పేరులో డయాబిటిస్ ఉన్నప్పటికీ ఇది మధుమేహం కాదు. దీనికి మూలం యాంటీడైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్). దీన్ని ఆర్జినైన్ వ్యాసోప్రెసిన్ (ఏవీపీ) అనీ అంటారు. ఇది మెదడులోని హైపోథలమస్‌లో తయారై, పీయూషగ్రంథి ద్వారా విడుదలవుతుంది. ఇది కిడ్నీల్లో నెఫ్రాన్లలోని గొట్టాలు నీటిని సంగ్రహించుకునేలా చేస్తూ మూత్రం ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇలా ఒంట్లో ద్రవాల మోతాదులను నియంత్రిస్తుంది. డయాబిటిస్ ఇన్‌సెపిడిస్‌లో ఈ హార్మోన్ తగినంత తయారుకాదు. దీంతో మూత్రం పలుచగా మారి, పెద్దమొత్తంలో బయటకు వచ్చేస్తుంది. ఒంట్లోంచి ఎక్కువ నీరు బయటకు వెళ్లిపోతున్నప్పుడు శరీరం దాన్ని భర్తీ చేసుకోవటానికీ ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో దాహం వేస్తుంది. అందువల్ల మరింత ఎక్కువ నీరు తాగుతుంటారు. ఇలా ఇదో చక్రంలా కొనసాగుతూ వస్తుంటుంది.
రాత్రిపూటే ఎక్కువ మూత్రం ఉత్పత్తి కావటం:
కొందరికి పగటిపూట కన్నా రాత్రుల్లోనే మూత్రం ఎక్కువగా తయారవ్వచ్చు (నాక్చర్నల్ పాలీయూరియా). దీనికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. వీటిల్లో ఒకటి వయసు మీద పడుతున్నకొద్దీ వ్యాసోప్రెసిన్ ఉత్పత్తి తగ్గటం. ఇది కొన్నిసార్లు ప్రత్యేకించి రాత్రిపూటే తగ్గొచ్చు. దీంతో మూత్రం ఎక్కువగా తయారై, పలుచగా అవుతుంది. మరో ముఖ్య కారణం కాళ్ల వాపులు.
గుండె వైఫల్యం, కాలేయ జబ్బులు, ప్రొటీన్ మోతాదులు తగ్గటం వంటి సమస్యలు గలవారిలో కాళ్లు ఉబ్బుతుంటాయి. ఎక్కువసేపు నిలబడి పనులు చేసేవారి లోనూ దీన్ని చూస్తుంటాం. ఇలాంటివారికి పగలు పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ ప్రభావంతో కాళ్లలోని నీరు వెనక్కి మళ్లుతుంది. దీంతో రక్తం పరిమాణం పెరుగుతుంది. దీంతో కిడ్నీలు ఎక్కువగా రక్తాన్ని వడపోయాల్సి వస్తుంది. మూత్రం ఉత్పత్తీ పెరుగుతుంది.
నిద్ర సమస్యలు:
కొందరికి నిద్ర సమస్యలు.. ముఖ్యంగా నిద్రలో కాసేపు శ్వాస ఆగటం (అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా) కూడా రాత్రిమూత్రానికి దారితీయొచ్చు. వీరు శ్వాస ఆగినప్పుడు బలంగా ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు కడుపులో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో గుండె కండర కణాల నుంచి ఏట్రియల్ నాట్రియూరెటిక్ పెప్టైడ్ విడుదలవుతుంది. ఇది ఒంట్లోంచి నీటిని బయటకు పంపేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది.
మూత్రాశయ సామర్థ్యం తగ్గటం:
మన మూత్రాశయం 400-600 మిలీ మూత్రాన్ని పట్టి ఉంచగలదు. కొందరిలో ఈ సామర్థ్యం తగ్గొచ్చు. ఒకప్పుడు 400 మి.లీ. వరకు మూత్రాన్ని పట్టి ఉంచే మూత్రాశయం 200 మిలీకే నిండినట్టు అనిపించొచ్చు. దీంతో ముందుగానే మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు, మూత్రాశయ కణితులు, క్షయ, ఇంటర్‌స్టిషియల్ సిస్టైటిస్, మూత్రాశయంలో రాళ్ల వంటి జబ్బులు దీనికి దారితీస్తుంటాయి.
ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బటం:
మగవారిలో వృద్ధాప్యంలో రాత్రిపూట మూత్రానికి లేవటానికి అతి పెద్ద కారణం ఇదే. ప్రోస్టేట్ గ్రంథి మూత్రనాళానికి చుట్టూరా కరచుకొని ఉంటుంది. ఇది ఉబ్బినప్పుడు మూత్రనాళ మార్గం సంకోచిస్తుంది. మూత్రాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలోంచి లేచి, మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.
ఆడవారిలో ముట్లుడిగిన తర్వాత మూత్ర సమస్యలు మొదలవుతుంటాయి. కొందరికి మూత్రమార్గం సన్నబడి, మూత్రాశయం పూర్తిగా ఖాళీకాకపోవచ్చు. దీంతో మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి, విసర్జనకు వెళ్లాలని అనిపించొచ్చు.
మూత్రాశయం అతిగా స్పందించటం:
మూత్రాశయ కండరం అస్తవ్యస్తంగా, అతిగా స్పందిచటం మరో సమస్య. ఇందులో రాత్రుల్లోనే కాదు, పగటి పూటా తరచూ మూత్రం వస్తుంటుంది. ఇందులో మూత్రం కొద్దిగా నిండగానే మూత్రాశయం సంకోచింటచం ఆరంభిస్తుంది. దీంతో వెళ్లాలని అనిపిస్తుంది. వెంటనే విసర్జన చేయాలని అనిపిస్తుంది. కొన్నిసార్లు బాత్రూమ్‌లోకి వెళ్లేలోపే బట్టల్లోనే పడొచ్చు. దీనికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియదు.
మందులు:
గుండె, కాలేయ వైఫల్యం వంటి సమస్యలు గలవారిలో కాళ్లవాపులు తగ్గటానికి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మాత్రలు సూచిస్తుంటారు. కొందరు వీటిని రాత్రిపూటా వాడుతుంటారు. ఇవీ రాత్రి మూత్రానికి దారితీయొచ్చు.
పరీక్షల సాయం:
మూత్ర పట్టిక: రాత్రిమూత్రం నిర్ధరణలో ఎన్నిసార్లు, ఎంత మూత్రం వస్తుందనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. 24 గంటలు లేదా 48 గంటల వ్యవధిలో పగలు, రాత్రి వేళల్లో ఏ సమయంలో మూత్రానికి వెళ్లారు? ఎంత మూత్రం వచ్చింది? అనేవి కాగితం మీద పట్టికలా నమోదు చేస్తే సమస్య స్పష్టంగా అవగత మవుతుంది. దీంతో మూత్రాశయ సామర్థ్యమూ బయటపడుతుంది. ఒకసారి 300 మిలీ మూత్రం వచ్చి, ఆ తర్వాత 10 మిలీ మాత్రమే పోశారనుకోండి.