తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎండు ద్రాక్షతో రక్తహీనత మాయం.. ఎప్పుడు? ఎలా? తినాలో తెలుసా? - ఎండు ద్రాక్షతో రక్తహీనత

దేశంలోని ఆరేళ్ల లోపు పిల్లల్లో 67 శాతం మంది, మహిళల్లో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు అంచనా. ఐరన్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఈ లోపం తగ్గటానికి ఎండు ద్రాక్ష బాగా పనిచేస్తుంది.

soaked raisins for anemia
Benefits of Eating Raisins

By

Published : Feb 15, 2023, 8:02 AM IST

రక్తహీనత సర్వ సాధారణ సమస్య. పిల్లల్లో, మహిళల్లో మరింత ఎక్కువ. మనదేశంలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో 67% మంది, మహిళల్లో 57% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. దీనికి ప్రధాన కారణం ఎర్ర రక్తకణాలు తగినంతగా ఉత్పత్తి కాకపోవటం. ఉత్పత్తి అయినా కొందరిలో త్వరగా క్షీణిస్తుంటాయి. రక్తం కోల్పోవటమూ దీనికి కారణమవుతుంది. చాలామందిలో ఐరన్‌ లోపంతోనే రక్తహీనత తలెత్తుతుంటుంది. ఇది లోపిస్తే ఎర్ర రక్తకణాలు తగినంత ఉత్పత్తి కావు. దీంతో అలసట, ఆయాసం వంటి లక్షణాలు వేధిస్తాయి. ఐరన్‌ లోపం తగ్గటానికి ఎండు ద్రాక్ష బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. రాత్రిపూట 10-15 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున వీటిని తిని నీళ్లు తాగటం మంచిది. ఇది ఐరన్‌ లోపాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తహీనతా తగ్గుతుంది.

మరిన్ని ప్రయోజనాలు

  • ఎండుద్రాక్ష అందం ఇనుమడించటానికీ తోడ్పడుతుంది. దీనిలో ఐరన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి చర్మం నిగనిగలాడేలా చేస్తాయి.
  • నల్ల ఎండుద్రాక్షలో పొటాషియం దండిగా ఉంటుంది. అలాగే క్యాల్షియం కూడా బాగానే ఉంటుంది. ఇవి ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెళుసు బారకుండా కాపాడతాయి.
  • నల్ల ఎండుద్రాక్షలో ఐరన్‌తో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది. శరీరం ఖనిజాలను త్వరగా గ్రహించుకోవటానికి విటమిన్‌ సి తోడ్పడుతుంది. ఫలితంగా వెంట్రుకలూ ఆరోగ్యంగా ఉంటాయి.
  • ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తంలో సోడియం మోతాదులు తగ్గటంలో సాయం చేస్తుంది. కాబట్టి తరచూ కాసినిన ఎండుద్రాక్షలను తింటుంటే రక్తపోటు తగ్గుముఖం పడుతుంది.
  • రోజూ కొన్ని ఎండుద్రాక్ష పళ్లను తినటం గుండె ఆరోగ్యానికీ మేలే. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి మరి. కొలెస్ట్రాల్‌ తగ్గితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటమూ తగ్గుతుంది. దీంతో గుండెకు రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
  • నల్ల ఎండుద్రాక్షలో ఐదు వృక్ష రసాయనాలు.. ఓలియానోలిక్‌ యాసిడ్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి పళ్లు పుచ్చిపోకుండా కాపాడుతున్నట్టు అమెరికాలో నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి.
  • వీటిల్లో పీచూ ఎక్కువగానే ఉంటుంది. ఇది మల విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది.
  • ఎండుద్రాక్ష మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గటానికీ తోడ్పడుతుంది. శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఛాతీ మంట, అజీర్ణం తగ్గటానికీ దోహదం చేస్తుంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details