కరోనా అనగానే ముందుగా దగ్గు, ఆయాసం వంటి శ్వాసకోశ లక్షణాలే గుర్తుకొస్తాయి. ఇవే కాదు, చాలామందిలో విరేచనాలు, ఆకలి తగ్గటం వంటి జీర్ణకోశ సమస్యలూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్టు చైనా నివేదిక ఒకటి పేర్కొంటోంది. అందువల్ల శ్వాస లక్షణాలు కనిపించేంత వరకూ వేచి చూడకుండా ఎవరిలోనైనా విరేచనాల వంటివి ఉంటే కొవిడ్-19ను అనుమానించటం తప్పనిసరని, దీంతో జబ్బు ముదరక ముందే పట్టుకోవచ్చని వివరిస్తోంది.
కరోనా ఇన్‌ఫెక్షన్ బాధితులు ఆసుపత్రిలో చేరాక సగటున 8.1 రోజులకు లక్షణాలు బయటపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. జీర్ణకోశ లక్షణాలు మాత్రం ఇంకాస్త ఆలస్యంగా.. 9 రోజుల తర్వాత కనిపిస్తుండటం గమనార్హం. ఇది చికిత్స ఆలస్యం కావటానికీ దారితీస్తోంది. 'దగ్గు, ఆయాసం వంటివేవీ లేవు కదా, కరోనా ఇన్‌ఫెక్షన్ కాదేమో' అనే భావనతో త్వరగా డాక్టర్లను సంప్రదించటం లేదని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణకోశ లక్షణాలు గలవారిలో ఆకలి మందగించటం (84% మందిలో), విరేచనాలు (29%), వాంతులు (0.8%), కడుపునొప్పి (0.4%) వంటి సమస్యలెన్నో బయలుదేరుతున్నాయి. కరోనా తీవ్రమవుతున్నకొద్దీ ఇవీ ఎక్కువవుతూ వస్తున్నాయి.