తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Sleeping Disorder : పగలు కళ్లు తెరవలేను.. రాత్రి నిద్రపోలేను - రాత్రిపూట నిద్రలేమి

సమస్య: నాకు నాలుగు నెలల క్రితం కొవిడ్‌ వచ్చి, తగ్గింది. నెల తర్వాత నిద్ర సమస్య మొదలైంది. రాత్రిపూట నిద్ర పట్టదు(Sleeping Disorder). పగటి పూట చాలా మత్తుగా, నిద్ర వచ్చినట్టుగా ఉంటుంది. ఇటీవల ఒక వారం నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా చాలా మత్తుగా ఉండి, నిద్ర వస్తోంది. చాలాకాలంగా బెంజోడయాజెపీన్‌ మందు వాడుతున్నాను. నెగెటివ్‌ ఆలోచనలు వస్తున్నాయని డాక్టర్‌ ఈ మందు రాశారు. ఇటీవల డాక్టర్‌ను కలిస్తే బెంజోడయాజెపీన్‌ మోతాదు పెంచారు. మత్తు ఇంకా ఎక్కువైంది. మానివేశాను. మధుమేహం లేదు. బీపీకి మందులు వాడుతున్నాను. నియంత్రణలోనే ఉంది. కీళ్లనొప్పులు ఉన్నాయి. నడవలేను. వీటికి మందులేవీ వేసుకోవటం లేదు. బీపీ మాత్రతో వస్తోందేమో చూసుకోండని సలహా ఇచ్చారు. కొవిడ్‌ తర్వాత అన్ని పరీక్షలు చేయించుకున్నాను. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలియజేయండి. - జి.నాగేశ్వరరావు, హరిపురం, రాజమండ్రి

Sleeping Disorder
Sleeping Disorder

By

Published : Oct 26, 2021, 12:03 PM IST

సలహా :మీరు చెప్పిన సమస్యలు కొవిడ్‌ వచ్చినవారిలో చాలామందికి కనిపిస్తున్నాయి. ఆకలి లేకపోవటం, నీరసం, నిస్సత్తువ, పని మీద ధ్యాస లేకపోవటం, నిద్రలేమి, నిద్రమత్తు వంటివి తలెత్తుతున్నాయి. ఇవన్నీ పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌లో(Post covid syndrome) భాగమే. వీటి గురించి చింతించాల్సిన పనిలేదు. మూడు నుంచి ఆరు నెలల లోపల తగ్గిపోతాయి. ప్రత్యేకమైన మందులేవీ అక్కర్లేదు. జింక్‌తో కూడిన బీ కాంప్లెక్స్‌ మాత్రలను రోజుకు ఒకటి వేసుకోండి. నిద్రలేమి(Sleeping Disorder)కి మెలటోనిన్‌ అని కొత్త మందు వచ్చింది. ఇది నిద్ర పట్టటానికి బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట బాగా నిద్రపోతే పగలు మత్తు ఉండదు. మీరు బెంజోడయాజెపీన్‌ వేసుకుంటే పగటిపూట నిద్ర మత్తు(drowsiness) వస్తోందని అంటున్నారు. దీనికి బదులు మెలటోనిన్‌ 3 ఎంజీ మాత్రను రాత్రిపూట వేసుకొని చూడండి. అవసరమైతే దీన్ని 6 ఎంజీ వరకు పెంచుకోవచ్చు. వీటిని వారం, పది రోజులు వాడి చూడండి. తప్పకుండా కమ్మటి నిద్ర పడుతుంది. పెద్దవారిలో మిథైల్‌సైనకోబలమిన్‌ (బి12) లోపం ఎక్కువ. ఇది కొద్దిగా రక్తహీనతకు దారితీస్తుంది. దీంతో ఆయాసం, మగత, నాడుల నొప్పుల వంటివి రావొచ్చు. మీరు మిథైల్‌సైనకోబలమిన్‌ 500 మిగ్రా మోతాదులో వారానికి రెండు చొప్పున నాలుగు ఇంజెక్షన్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

అలాగే ప్రిగెబాలిన్‌ 25 ఎంజీ మాత్ర కూడా వేసుకోవచ్చు. ఇది నాడుల నొప్పులు, కీళ్లనొప్పులు తగ్గిస్తుంది. దీంతో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. కొందరికి పొద్దున లేచాక బద్ధకంగా అనిపించొచ్చు గానీ టీ, కాఫీ వంటివి తాగితే పోతుంది. మరో ముఖ్య విషయం- ఒంటరితనం బాధించకుండా చూసుకోవటం. ఒంటరితనంతో ఉత్సాహం చచ్చిపోతుంది. చిన్న బాధలైనా పెద్దగా కనిపిస్తుంటాయి. మీరు మనవలు, మనవరాళ్లతో కలిసి కబుర్లు చెప్పుకోండి. వారితో ఆడుకోండి. మీ వయసు వారితో కలిసి కాలక్షేపం చేయటానికి, ముచ్చట్లు పెట్టుకోవటానికి ప్రయత్నించండి. పెద్ద వయసులో మోకాళ్ల నొప్పులు సహజం. మీరు వీటికి మందులు వాడటం లేదని రాశారు. మంచి విషయం. నొప్పిని తగ్గించే మలామును పైకి పూసుకోండి. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ 650 ఎంజీ మాత్రలను ఉదయం, రాత్రి ఒకటి చొప్పున వేసుకోండి. వీటిని ఏదైనా తిన్న తర్వాతే వేసుకోవాలని గుర్తుంచుకోండి. వీలైతే ఇంట్లో గానీ పెరడులో గానీ కాసేపు నడవండి. పది, పదిహేను నిమిషాలు నడిస్తే చాలు. తప్పకుండా కుదుట పడతారు. మీరు బీపీకి ఎలాంటి మాత్రలు వాడుతున్నారో రాయలేదు. సాధారణంగా బీపీ మాత్రలతో నిద్రమత్తు వచ్చే అవకాశం లేదు. బాధలు మరీ ఎక్కువైతే డాక్టర్‌ను సంప్రదించండి.

ABOUT THE AUTHOR

...view details