మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. కానీ, ఉద్యోగం.. పనులు.. మానసిక ఇబ్బందుల వల్ల కొంతమందికి నిద్ర సరిగా ఉండదు. ఈ మధ్య యువత రాత్రుళ్లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసుకుంటూ నిద్ర పాడుచేసుకుంటున్నారు. ఇలా నిద్రలేమితో జీవితాన్ని కొనసాగిస్తే కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా ఒట్టి అనే మ్యాట్రసెస్ సంస్థ.. మెడిసిన్ డైరెక్ట్ అనే సంస్థతో కలిసి ఓ పరిశోధన నిర్వహించింది. నిద్రలేమితో ఉంటే శరీరంలో ఎన్ని రోజులకు ఎలాంటి మార్పులు కనిపిస్తాయో వెల్లడిస్తూ ఓ నివేదిక రూపొందించింది. అందులో ఏముందంటే..
24 గంటల తర్వాత..
24 గంటలకు మించి నిద్రలేమితో ఉన్నవారికి కాస్త మగతగా అనిపిస్తుందట. దీనివల్ల మెదడు పనితీరు మందగించడం, ఏకాగ్రత దెబ్బతినడం జరుగుతుందట. చిన్న విషయానికి కూడా చిరాకు పడుతుంటారు. మానసిక స్థితి స్థిరంగా ఉండదు. కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. శరీరంలో నాడీవ్యవస్థలో సమతుల్యం దెబ్బతింటుంది. కండరాల నొప్పి మొదలవుతుంది. అప్పుడప్పుడు పని ఒత్తిళ్లతో రాత్రుళ్లు నిద్రపోని వారికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయట.
మూడు రోజులు
మూడురోజులకు మించి నిద్రలేమితో ఉంటే.. మెదడు తీవ్ర ఒత్తిడికి లోనై భ్రాంతులకు గురవుతుంది. దిగాలుగా ఉండటం, మతి స్థిమితంగా లేకపోవడం, జ్ఞానేంద్రియాలపై నియంత్రణ కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. చర్మం పాలిపోవడం, చూపు మందగిస్తూ.. కళ్ల నొప్పులు వస్తాయి. కండరాలు సంకోచించినట్లుగా అనిపిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.