స్నానానికి ముందు వద్దు..
చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే వాటిలో మృత కణాలు కూడా ఒకటి. వీటి వల్ల చర్మం డల్‌గా కనిపిస్తుంది. ఇవి చర్మానికి పోషకాలు అందకుండా చేసి, చెమట గ్రంథుల్ని మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా మొటిమలు, మచ్చలు.. వంటివి ఏర్పడతాయి. అందుకే సౌందర్య సంరక్షణలో భాగంగా వీటిని తొలగించుకోవడం అవసరం. అయితే చాలామంది స్నానానికి ముందే వీటిని తొలగించుకుంటుంటారు. కానీ దీనివల్ల చర్మంపై దురద రావడం, మేను పొడిబారిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాతే మృత కణాలను తొలగించుకోవాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం స్నానం చేయడానికి ముందే ఏదైనా ఎసెన్షియల్ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసుకోవాలి. ఆపై స్నానం చేసి.. మీ చర్మతత్వానికి సరిపోయే స్క్రబ్ సహాయంతో మృత కణాలను తొలగించుకోవాలి. ఫలితంగా చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా వాటిని సులభంగా వదిలించుకోవచ్చు.
తేమనందించడం ముఖ్యం..
అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం సహజమే. ఇందుకోసం వివిధ రకాల క్రీములు వాడడం, పదే పదే వ్యాక్సింగ్ ట్రీట్‌మెంట్లు చేయించుకోవడం.. వంటివి చేస్తుంటారు చాలామంది. అయితే వీటివల్ల చర్మం ఇరిటేట్ అయి ఎరుపెక్కడం, దురద రావడం.. ఇలా పలు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ముందు, తర్వాత ఆ ప్రదేశంలో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం తప్పనిసరి. ఇందుకోసం చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లను ఎంపిక చేసుకోవాలి. వీటిలోని గ్లిజరిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు ఎదురవకుండా చేస్తుంది. అలాగే వ్యాక్సింగ్ చేయించుకునే వారు పదే పదే కాకుండా.. వ్యాక్సింగ్‌కి, వ్యాక్సింగ్‌కి మధ్య కనీసం పదిహేను రోజులైనా గ్యాప్ తీసుకోవడం తప్పనిసరి. ఇలా షేవ్ చేసుకున్న వెంటనే పూల్స్, బీచ్‌లలోని నీటిలో ఈతకొట్టడం కూడా సరికాదు. దీనివల్ల ఆ నీటిలోని క్లోరిన్, ఉప్పు, సూర్యరశ్మి.. తదితర అంశాల వల్ల చర్మంపై ట్యాన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 24 గంటల సమయమైనా గ్యాప్ తీసుకోవాలి.