Sitting Too Much Side Effects :ఆధునిక జీవితంలో శారీరక శ్రమ బాగా తగ్గింది. ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీ, మెషినరీ అందుబాటులోకి వచ్చిన తరువాత.. శారీరక శ్రమకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. అందుకే చాలా మంది ఒకే చోట, చాలా సమయంపాటు కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఎక్కువ సేపు స్థిరంగా కూర్చున్న వారిలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డిమెన్షియా (మతిమరుపు, చిత్తచాంచల్యం) వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ ఉంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యాయామం ఒక్కటే సరిపోదు!
Side Effects Of Prolonged Sitting : చాలా మందికి రోజులో కనీసం ఒక గంటపాటైనా వ్యాయామం చేసే అలవాటు ఉంటుంది. ఇది మంచిదే. కానీ వారంలో 7 గంటల పాటు వ్యాయామం చేసి.. కదలకుండా 7 గంటలపాటు పనిచేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజూ వ్యాయామం చేస్తూ ఉన్నప్పటికీ.. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వాళ్లలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలిందని వారు వెల్లిడిస్తున్నారు. అలాగని పూర్తిగా వ్యాయామం మానేస్తే జబ్బుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నేటి కాలంలో చాలా వరకు రోజులో 6 నుంచి 8 గంటలు కూర్చొని ఉండటం మామూలు అయిపోయింది. వాస్తవానికి మనం చేసే పనులను అనుసరించి శరీరంలోని క్యాలరీలు ఖర్చవుతూ ఉంటాయి. కానీ మెదడుకు మాత్రమే పనిచెప్పి, గంటల కొద్దీ కూర్చొని పనిచేయడం వల్ల క్యాలరీలు ఖర్చవడం బాగా తగ్గిపోతుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
‘ఎక్కువ సేపు కూర్చోవడం, అటూ ఇటూ తిరగకపోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. కూర్చోవడానికి అలవాటు పడిపోయిన వారు లేచి 5 నిమిషాలు నడవడానికి కూడా ఇష్టపడరు. దీని వల్ల తినే ఆహారం అధికంగా ఉండి.. ఖర్చు చేసే క్యాలరీల సంఖ్య తగ్గిపోతుంది. దీని వల్ల ఆ క్యాలరీలన్నీ పొట్ట భాగంలో, తొడ భాగంలో పేరుకుపోతాయి. ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, బర్న్ చేసే క్యాలరీలు తక్కువగా ఉండటం, వ్యాయామం లేకపోవడం వల్ల డయాబెటిస్, ఊబకాయం త్వరగా వచ్చే అవకాశం ఉంది’
- డాక్టర్ కె. ప్రవీణ్ కుమార్, జనరల్ ఫిజీషియన్
మధుమేహం వచ్చే ప్రమాదం!
ఎక్కువ సేపు ఒకేచోట అలాగే కూర్చోవడం వల్ల వచ్చే మరో ఆరోగ్య సమస్య మధుమేహం. దానికి కారణం మీరు తక్కువ క్యాలరీలను ఖర్చు చేయడమేనా? అంటే కచ్చితంగా చెప్పలేం. అయితే ఇలా ఎక్కువ సేపు కదలకుండా ఉండే వ్యక్తుల శరీరం.. ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. వాస్తవానికి ఇన్సులిన్ అనేది రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించే హార్మోన్. ఇది కనుక సరైన మోతాదులో ఉత్పత్తి కాకపోతే.. మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది.