Easy Yoga Asanas : ప్రస్తుతం అందరి జీవితాలు ఉరుకుల పరుగులమయంగా మారాయి. విద్య, కెరీర్ అనే చట్రంలో పడి పొద్దున లేస్తే రాత్రి వరకు అందరూ పరుగులు పెడుతున్నారు. విశ్రాంతి లేని షెడ్యూల్స్‌తో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీని వల్ల రోగాల బారిన పడుతున్నారు. సరైన జీవన శైలిని పాటించకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, హృద్రోగ సమస్యల బారిన పడుతున్నారు. వృద్ధులతో పాటు చిన్న వయసు వారు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి శారీరక, మానసిక సమస్యలను తరిమికొట్టాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి.
ఆరోగ్యకరమైన భోజనం తీసుకుంటూ వ్యాయామాలు కూడా చేస్తూ ఉండటం చాలా అవసరం. యోగా, కసరత్తులు చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే యోగా సాధన చేయడానికి చాలా మంది ఈ రోజుల్లో తీరిక ఉండట్లేదు. బిజీ షెడ్యూల్స్ వల్ల యోగా చేయాలనే కోరిక ఉన్నా చాలా మంది దానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. అదే సమయంలో ఆసనాలు చాలా క్లిష్టంగా ఉంటాయనే ఉద్దేశంతోనూ కొంతమంది యోగా చేయడానికి అనాసక్తి చూపిస్తుంటారు. ఈ అపోహలపై ప్రముఖ యోగా గురువు, బెంగళూరుకు చెందిన మీనూ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ప్రయోజనం చేకూర్చుతుందన్నారు.
Simple Yoga Asanas : యోగాలో కఠినమైన ఆసనాలు ఉన్నప్పటికీ, అనేక సులువైన ఆసనాలు కూడా ఉన్నాయని మీనూ వర్మ చెప్పారు. వీటిని తరచూ సాధన చేస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. "యోగాలో సులువైన ఆసనాలు చాలా ఉన్నాయి. వీటితో పాటు కొన్ని స్ట్రెచింగ్స్ చేయడం వల్ల శరీరంలోని కండరాలు ఉత్తేజితం అవుతాయి. దీని వల్ల మానసికంగా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనాలను రోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ ఆసనాలు చేయడానికి పెద్దగా సమయం కూడా పట్టదు" అని మీనూ వర్మ పేర్కొన్నారు. నిపుణులు చెప్పిన ఆ సులువైన యోగా ఆసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
త్రికోణాసనం:
- ఈ ఆసనం వేయాలంటే ముందు నిటారుగా నిల్చోవాలి.
- రెండు కాళ్ల పాదాల మధ్య మూడు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి.
- మోకాళ్లను నిటారుగా ఉంచాలి. ఆ తర్వాత ముందుకు చూస్తూ రెండు చేతులను భుజాలకు సమానంగా ఎత్తాలి.
- ఇప్పుడు కుడి కాలును కుడి వైపునకు తిప్పాలి. శ్వాసను వదులుతూ చేతులను అదే పొజిషన్లో ఉంచి, కుడి వైపు మెల్లిగా తిరగాలి.
- అనంతరం చేతులను సాధ్యమైనంతగా కిందకు వంచి కుడి కాలి పాదాన్ని కుడి చేతి వేళ్లతో తాకేందుకు ప్రయత్నించాలి.
- ఆ సమయంలో ఎడమ చేతిని సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఎడమ చేతిని గాలిలో ఉంచాలి.
- ఈ భంగిమలో సాధారణ శ్వాస తీసుకుంటూ 10 నుంచి 30 సెకన్ల పాటు ఉండాలి. ఆ తర్వాత మళ్లీ యథాస్థితికి వచ్చి.. ఇదే భంగిమను తిరిగి ఎడమ వైపు చేయాలి.