పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు, తాజాగా కనిపించేందుకు రసాయనాలు వాడుతున్నారు కొందరు వ్యాపారులు. ఆకుకూరలు కూడా పచ్చగా కనిపించడానికి కెమికల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తినే ఆహారం విషపూరితమవుతోంది. ఫలితంగా చాలా మంది తెలియకుండానే అనేక రోగాల బారిన పడుతున్నారు.
కొన్ని కూరగాయలు ఆకుపచ్చ రంగులో కనిపించేందుకు వ్యాపారులు మాలకైట్ రసాయనాన్ని వాడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కూరగాయలు కల్తీ(adulterated vegetables) అయ్యాయా? లేదా? తెలుసుకునేందుకు ఓ వీడియో షేర్ చేసింది ఎఫ్ఎస్ఎస్ఏఐ.
మాలకైట్ గ్రీన్ అంటే?
మాలకైట్(malachite green) రసాయనాన్ని చేపలకు యాంటీ ప్రోటోజోవల్, యాంటీ ఫంగల్ ఔషధంగా ఉపయోగిస్తారు. అక్వాకల్చర్లో పారాసిటైడ్గా, ఆహార, ఆరోగ్య, టెక్ట్స్‌టైల్ రంగాల్లోను ఈ రసాయనాన్ని మెండుగా ఉపయోగిస్తారు. వివిధ రకాలు చేపలు, ఇతర జీవులపై ఫంగల్ దాడులు, ప్రోటోజోవన్ ఇన్ఫెక్షన్లను ఇది నివారిస్తుంది. అయితే.. మిర్చి, బఠానీలు, సహా పలు ఆకుకూరలు పచ్చగా కనిపించేందుకు ఈ రసాయనాన్ని వినియోగిస్తున్నారు కొందరు.