Silent Walking Benefits :గుంపుగా వెళ్లడమో ఒంటరిగా ఉంటే ఫోన్‌లో పాటలు వింటూనో లేదంటే యూట్యూబ్ వీడియోలు చూస్తూనో చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. ఇలాంటి అలవాటు వల్ల వాకింగ్‌తో జరిగే ప్రయోజనానికి బదులు నష్టమే ఎక్కువంటున్నారు నిపుణులు. ఇద్దరు ముగ్గురితో కలిసి నడిస్తే జరిగే పిచ్చాపాటి వల్ల నవ్వులు, పరిహాసాలు ఎలా ఉన్నా లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
Silent Walking Trend : పదిమందిలో మాట్లాడితే ఏవో రాజకీయాలు, ఇంట్లో సమస్యలు, పాత గొడవలు గుర్తుకు వచ్చి అనసవర ఉద్రేకాలకు లోనుకావాల్సివస్తుందని పరిశోధనల్లో తేలిందట. అదేవిధంగా ఉదయాన్నే గాడ్జెట్లను పట్టుకుని తిరగడం వల్ల మనసు, శరీరం తేలిక కావాల్సిందిపోయి బరువెక్కుతున్నట్లు పరిశోధకుల అధ్యయనంలో తేలిందంటున్నారు.
సైలెంట్ వాకింగ్‌తో చెక్
వాకింగ్‌లో మిగతా డిస్టబెన్స్‌ను అధిగమించేందుకు ఇప్పుడు కొత్తగా సైలెంట్ వాకింగ్ అనే ట్రెండ్ మొదలైంది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచీలతో సహా ఇతర వస్తువులను పక్కన పెట్టి సింగిల్‌గా ఎవరితో మాట్లాడకుండా మౌనంగా నడవటమే ఈ సైలెంట్ వాకింగ్ ట్రెండ్. మౌనంగా మనతో మనం ఉంటూ నడవడం ద్వారా ధ్యానం చేసినట్లు అవుతోందని అంటున్నారు.
ఆలోచనలకు పదునుపెట్టే సమయం
సైలెంట్ వాకింగ్ వల్ల ఏకాగ్రత పెరురుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. మన ఆలోచనలకు ఆ ఆలోచనలను పదును పెట్టుకోటానికి, లక్ష్యంపై దృష్టి నిలపడానికి సైలెంట్ వాకింగ్ ఉపయోగపడుతుందట. ఎల్లప్పుడూ ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్‌ఫోన్లలో గడిపేస్తే ఇక కొత్త ఆలోచనలు ఎలా వస్తాయంటున్నారు కొంతమంది సైలెంట్ వాకర్స్. నడకలో అంతరాయం లేకుండా ఉండాలంటే గుంపుగా వెళ్లడం, గాడ్జెట్లను తీసుకెళ్లడం మానేయాలంటున్నారు. 'సైలెంట్ వాకింగ్' రెండు పనులను చేస్తుంది. అందులో మొదటిది మన ఆలోచనలను మనం వినేలా చేయడం. రెండోది ప్రకృతిని ఆస్వాదించడం. సైలెంట్ వాకింగ్ వల్ల తమ ఆరోగ్య స్థితిలోనూ కొంత మార్పు కనిపించినట్లు ఇటీవల ఈ విధానంలోకి మారిన వాకర్లు చెబుతున్నారు.