Signs That You Have A High IQ :ఎవరైనా ఒక వ్యక్తికి తెలివితేటలు ఎంత ఉన్నాయి.. అని మనకు తెలియజేసే సాధనం ఐక్యూ. దీన్నే ఇంటెలిజెన్స్ కోషెంట్ (Intelligence Quotient) అంటారు. అంటే ఐక్యూ సంఖ్య ఎంత పెద్దదైతే వారికి అన్ని ఎక్కువ తెలివితేటలు ఉంటాయన్నమాట. ఒక మనిషికి ఉండే ఐక్యూని బట్టి అతని తెలివితేటలను నిర్దారిస్తారు. ఈ టెస్టులో అతను నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాడు, ఆలోచన తీరు ఎలా ఉంది.. అనే విషయాల్ని పరిగణలోకి తీసుకుంటారు. అయితే, మన చుట్టూ ఉన్న చాలా మందిలో ఐక్యూ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆ విషయం వారికి కూడా తెలియడం లేదని నిపుణులు అంటున్నారు. మీకు ఎక్కువ ఐక్యూ ఉందని చెప్పడానికి ముఖ్యంగా నాలుగు లక్షణాలు మీలో కనిపిస్తాయని అంటున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎక్కువ ఐక్యూ ఉందని తెలిపే నాలుగు లక్షణాలు..
Signs You Have A Higher IQ :
1. కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం..:ఐక్యూ ఎక్కువగా ఉండే వ్యక్తులు ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారని నిపుణులు అంటున్నారు. అలాగే కొత్త అంశాలను మిగతా వారికంటే వేగంగా నేర్చుకుంటారని చెప్తున్నారు. వీరు జ్ఞానాన్ని పెంచుకోవడానికి నిరంతరం పుస్తకాలు చదువుతారని, ఇంట్లో చిన్న లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటారని చెబుతున్నారు. ముఖ్యంగా ఐక్యూ ఎక్కువగా ఉన్న చిన్న పిల్లలు వారికి తెలియని విషయాన్ని తెలుసుకునే దాకా వారికి నిద్ర పట్టదని.. అందుకే తల్లిదండ్రుల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారని నిపుణులు అంటున్నారు.
2. మంచి మాట తీరు..:అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు మంచి వక్తగా ఉంటారని అంటున్నారు. వీరు ఏ విషయం అయినా సులభంగా అర్థం చేసుకుని ఇతరులకు స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని చెబుతున్నారు. వారు మాట్లాడే ముందే అన్ని విషయాలను తెలుసుకుని మాట్లాడతారని, తొందరపాటు నిర్ణయాలను తీసుకోరని నిపుణులు చెప్తున్నారు.
3.సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు..:అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు సాధారణంగా సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగి ఉంటారని అంటున్నారు నిపుణులు. వారు.. సమస్యలను అన్ని కోణాల నుంచి పరిశీలించి, సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటారని చెబుతున్నారు. క్లిష్టమైన పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండి నిర్ణయాలను తీసుకుంటారని చెప్తున్నారు.