తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మొలకెత్తిన బంగాళదుంపలు తింటున్నారా..? అయితే జాగ్రత్త! - Health Issues Of Eating Sprouted Potatoes

బంగాళదుంపలతో చేసే వివిధ రకాల వంటకాలు ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ముఖ్యంగా పిల్లలు వీటితో చేసే స్నాక్స్​ను ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్​ జరిగినా వండే వంటల్లో మాత్రం ఆలుగడ్డతో చేసే వంటకం కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అంతలా తింటారు వీటిని అందరూ. అయితే మొలకలు వచ్చిన బంగాళదుంపలను తినొచ్చా? తింటే ఏమవుతుంది? హానికరమా? అనేది ఓ సారి తెలుసుకుందాం.

Health Issues Of Eating Sprouted Potatoes
మొలకెత్తిన బంగాళదుంపలతో కలిగే ఆరోగ్య సమస్యలు

By

Published : Mar 3, 2023, 5:38 PM IST

Updated : Mar 3, 2023, 7:35 PM IST

మాములుగా మొలకెత్తిన పెసర్లు, శనగలు, బొబ్బర్లు, బఠానీ వంటి చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, మొలకెత్తిన బంగాళదుంపలు తింటే మాత్రం మన ఆరోగ్యానికే పెను ముప్పు తెచ్చి పెడతాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఎక్కువరోజులు బంగాళదుంపలను నిల్వ ఉంచడం వల్ల వాటిపై మొలకలు వచ్చేస్తాయి. బంగాళదుంపలపై వచ్చే మొలకలు విషపూరితమైనవిగా చెబుతున్నారు నిపుణులు. ఒక్కోసారి ఫుడ్​ పాయిజనింగ్​కు దారితీస్తుందని.. అందువల్ల మనిషి ప్రాణానికే ముప్పని హెచ్చరిస్తున్నారు. కాగా.. బంగాళదుంపలపై ఏర్పడే మొలకల్లో గ్లైకోఅల్కలాయిడ్స్ అనే విషపూరితమైన రసాయన పదార్థాలు ఉంటాయి. అందుకే మొలకెత్తిన బంగాళదుంపలను ఎక్కువ మోతాదులో తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు మొలకెత్తిన బంగాళదుంపలు తినకూడదంటే?

ఏంటీ గ్లైకోఅల్కలాయిడ్స్..?
గ్లైకోఅల్కలాయిడ్స్ అనేది అనేక రసాయనాల సమూహం. ఇవి సోలనేసి కుటుంబానికి చెందినది. వివిధ రకాల మొక్కల జాతుల్లో కూడా ఇవి సహజంగా ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా వీటిని బంగాళదుంపలు, టమాటొలు, వంకాయలు, మిరియాలు వంటి ఇతర సాగు పంటల్లో కూడా గమనించవచ్చు. బంగాళదుంపలు లేదా ఆలుగడ్డలు సహజంగా సోలనైన్, చాకోనైన్ అనే రెండు గ్లైకోఅల్కలాయిడ్స్ పదార్థాలను కలిగి ఉంటాయి. ప్రధానంగా ఇవి మొలకెత్తిన దుంపల్లో అధికంగా వృద్ధి చెందుతాయి. అంతేగాక పాడైన బంగాళదుంపలు, ఆకుపచ్చ రంగులోకి మారిన బంగాళదుంపలు చేదుగా ఉంటాయి. వీటిలో హానికారపు టాక్సిన్​లు ఉంటాయి. ముఖ్యంగా మొలకెత్తిన బంగాళదుంపల్లో మాత్రం అధిక స్థాయిలో ఈ రసాయన పదార్థం ఉంటుంది.

గ్లైకోఅల్కలాయిడ్స్ తింటే ఏమౌతుంది..?
బంగాళదుంపలు మొలకెత్తినప్పుడు వాటిలో గ్లైకోఅల్కలాయిడ్స్ అమాంతం పెరగడం ప్రారంభమవుతాయి. తద్వారా వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి తిన్న కొద్ది గంటలు లేదా ఒక్కరోజులోనే పలు అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. మొలకెత్తిన బంగాళాదుంపలలో గ్లైకోఅల్కలాయిడ్స్ అనే రసాయన పదార్థాలు అధిక స్థాయిలో ఉంటాయి. కనుక ఇవి ఎక్కువ మోతాదులో తింటే శరీరంలో విషంగా మారి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.

తింటే ఇవి సమస్యలు..
ఎక్కువ మోతాదులో మొలకెత్తిన బంగాళాదుంపలు తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటంటే.. వాంతులు, విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పి రావడం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా లో-బీపీ, పల్స్​ రేట్​ వేగంగా కొట్టుకోవడం, జ్వరం, తలనొప్పి, మతిమరుపులతో పాటు కడుపులో నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది..
గ్లైకోఅల్కలాయిడ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవటం వలన ప్రమాదం పొంచి ఉన్నట్లుగానే.. వీటిల్లో మనకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించే యాంటీబయాటిక్ లక్షణాలూ కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించడంతో పాటు కొలెస్ట్రాల్​ లెవెల్స్​ తగ్గేందుకు సహాయపడతాయి. కాకపోతే వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే ఈ లాభాలను పొందొచ్చు.

మొలకలు రాకుండా ఏం చేయాలి..?
బంగాళదుంపలను చల్లని, పొడితో పాటు చీకటి ప్రదేశంలో నిల్వ చేయడం ద్వారా అవి మొలకెత్తే సందర్భాలను నివారించవచ్చు. అలాగే వీటిని ఉల్లిపాయలు స్టోర్​ చేసే చోట అసలు ఉంచకూడదు. ఇలా రెండు కలిపి నిల్వ ఉంచడం వల్ల దుంపలపై మొలకలు సులువుగా వచ్చే ఆస్కారం ఉంటుంది. మరీ ముఖ్యంగా బంగాళదుంపులను ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఇంట్లో నిల్వ ఉంచుకోకుండా ఉండటం మేలు. అవసరమైనప్పుడు మాత్రమే ఆ సమయానికి కావాల్సినన్ని ఆలుగడ్డలను తెచ్చుకోవడం మంచిది.

వీరికీ ముప్పే..
మొలకెత్తిన బంగాళ దుంపలను తింటే సాధారణ మనుషులకే కాకుండా.. గర్భిణీలపై ప్రమాదమేనని అంటున్నారు నిపుణులు. మొలకెత్తిన ఆలుగడ్డలను గర్భంతో ఉన్న సమయంలో మహిళలు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకు ముఖ్యంగా గర్భణీలు మొలకెత్తిన బంగాళదుంపలకు దూరంగా ఉండడం ఉత్తమమని అంటున్నారు.

బంగాళ దుంపలపై వచ్చే మొలకలు, మచ్చలును తొలగించడం, వాటి తొక్క తీయడం, వేయించడం, ఉడకబెట్టడం వంటి పద్ధతులు మొలకెత్తిన బంగాళాదుంపలలో ఉండే గ్లైకోఅల్కలాయిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు. అయితే ఇవి తినటం మన ఆరోగ్యం సురక్షితమా.. కాదా అనే విషయానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. అప్పటి వరకు, మొలకెత్తిన లేదా ఆకుపచ్చ రంగులో ఉండే బంగాళాదుంపలను వీలైనంతవరకు తినకుండా ఉండటమే శ్రేయస్కరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Last Updated : Mar 3, 2023, 7:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details