Laxatives for Constipation Side Effects :ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్య మలబద్ధకం. మారిన జీవనశైలి, సరైన ఫుడ్ తీసుకోకపోవడం, రోజూ బాడీకి కావాల్సినంత వాటర్ తాగకపోవడం లాంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య మొదలవుతుంది. కారణాలేవైనా మలబద్ధకం చాపకింద నీరులా విస్తరిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వారానికి మూడు సార్లు కంటే తక్కువ సార్లు మలవిసర్జన చేయడం మలబద్ధకానికి(Constipation) సంకేతం. అంటే ఈ సమయంలో పేగు కదలికలు సక్రమంగా ఉండవు. దాంతో కడుపులో అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది.
అయితే చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడడానికి తరచుగా లాక్సిటివ్స్(భేది మందులు) వాడుతుంటారు. అయితే ఇవి ఈ సమస్యను తగ్గించి జీర్ణవ్యవస్థను సజావుగా సాగేలా చేయవచ్చు. కానీ వీటిని తరచుగా వాడితే తర్వాతి కాలంలో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ మందులు వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? మందులు వాడకుండా సహజంగా తగ్గించుకోవాలంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
లాక్సిటివ్స్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలివే..
అతిసారం : మలబద్ధకం నివారణ కోసం లాక్సిటివ్స్ అధికంగా ఉపయోగించడం అతిసారానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా డీహైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఈ లాక్సిటివ్స్ పేగుల ద్వారా మలం కదలికను వేగవంతం చేసి శరీరం నుంచి అధిక శాతం నీటిని కోల్పోయేలా చేస్తాయి. అయితే డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత సకాలంలో పరిష్కరించకపోతే ప్రాణాంతకం కావచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మెలనోసిస్ కోలి అభివృద్ధి చెందే ప్రమాదం : కొన్ని మలబద్ధకం నివారణ మందుల దుర్వినియోగం మెలనోసిస్ కోలికి కారణమవుతుంది. అంటే పెద్దపేగు లైనింగ్ నల్లబడటం లేదా పిగ్మెంటేషన్ ద్వారా పెద్దపేగులో ఏర్పడే ఒక పరిస్థితి. మెలనోసిస్ కోలి ప్రమాదకరం కానప్పటికీ, లాక్సిటివ్స్ వాడకాన్ని నిలిపివేస్తే మలబద్ధకం మాత్రమే పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
పోషక లోపాలు : చాలా కాలం పాటు లాక్సిటివ్‌లను ఉపయోగించడం వల్ల బాడీలో పోషకాల లోపం సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే ఈ మందులు పేగును మృదువుగా చేయడం వల్ల.. ఆహారం నుంచి పోషకాలను గ్రహించడానికి శరీరం తీసుకునే సమయం తగ్గుతుంది. అలాగే కొన్ని అధ్యయనాల ప్రకారం.. చాలా లాక్సిటివ్స్లో ఉండే మెగ్నీషియం తీవ్రమైన ఐరన్ లోపానికి కారణమవుతుందని తెలుస్తోంది.
తీవ్రమైన పొత్తికడుపు నొప్పి :మలబద్ధకం నుంచి ఉపశమనం కోసం తరచుగా లాక్సిటివ్స్లను యూజ్ చేస్తే మీరు తీవ్రమైన పొత్తి కడుపునొప్పి, తిమ్మిర్ల సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కడుపు కండరాలు సక్రమంగా సంకోచించినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన అసౌకర్యంతో పాటు ఇబ్బందిని కలిగిస్తుంది.