మనలో చాలామందికి ఆనందం కోసం టీవీ చూడటం లేదంటే ఫోన్ చూడటం అలవాటుగా ఉంటుంది. అయితే ఈ అలవాటు శ్రుతిమించి వ్యసనంగా మారితే ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీవీ, ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ స్క్రీన్లను ఎక్కువ సేపు చూస్తే కంటి సమస్యలు మాత్రమే తలెత్తుతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ అనేక మానసిక, శారీరక సమస్యలకు ఇది కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
టైం పాస్ కోసం టీవీ, ఫోన్ చూసే పరిస్థితి నుంచి ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు చూడటానికే మనం కేటాయించే పరిస్థితికి వచ్చేశాం. గతంలో టీవీ లేదంటే ఫోన్ని చూడటానికి ఒక టైం అంటూ పెట్టుకునే మనం.. ఇప్పుడు ఎలాంటి నియంత్రణ లేకుండా స్క్రీన్లను చూస్తున్నాం. టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్లు వాడే వారిలో స్క్రీన్లు చూసే సమయం చాలా ఎక్కువగా ఉంటోంది. వర్క్ ఫ్రం హోం చేసే వారికి స్క్రీన్ చూడాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడగా.. ల్యాప్ టాప్ లేదంటే కంప్యూటర్ల ముందు వాళ్లు గంటల కొద్దీ గడపాల్సి వస్తుంది. ఇక టీవీలో వివిధ కార్యక్రమాలను, ఫోన్లలో ఫొటోలు, వీడియోలను చూసే వారు తాము ఎంతసేపు చూస్తున్నామనే విషయాన్ని మర్చిపోతుంటారు. దీని కారణంగా స్క్రీన్ టైం ఎంత అనే అంచనా ఎవరికీ ఉండటం లేదు.
స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటే కేవలం కళ్లు మాత్రమే కాదు, అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయని, దీర్ఘకాలంలో అవి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ల ముందు గంటల కొద్దీ గడిపే వారికి ఏదైనా తినాలనే కోరిక ఉంటుందట. దీంతో వీరు చిరుతిళ్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. లేదంటే మామూలు ఆహారం తింటే స్క్రీన్లు చూస్తూ ఎక్కువ మోతాదులో లాగించేస్తారట. ఇలా శారీరక శ్రమ లేకపోగా ఎక్కువ క్యాలరీలను శరీరానికి అందించడం వల్ల కొవ్వు పెరిగి అధిక బరువుకు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు.