ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి భోజనం చేయకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక ఒత్తిడి లాంటి వాటి వల్ల రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. అలాంటి వాటిల్లో మధుమేహం కూడా ఒకటి. దీని వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు భోజనం తర్వాత నడవడం చక్కటి మార్గమని ఇటీవల ఓ పరిశోధన తెలియజేసింది. ఆ పరిశోధనల ఫలితాలేంటి? భోజనం తర్వాత నడక ఏయే సమస్యలను దూరం చేస్తుందో తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది తిన్న తర్వాత భుక్తాయాసం పేరుతో కాసేపు నడుం వాలుస్తారు. కొంతమంది విశ్రాంతి తీసుకుంటే ఇంకొంతమంది ఓ కునుకు వేస్తారు. ఇలాంటి వాటి వల్ల టైప్–2 మధుమేహం, గుండెపోటు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి చెక్ పెట్టాలంటే తిన్న తర్వాత కాసేపు నడవాలని సూచిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం.. తిన్న తర్వాత కాసేపు నడిస్తే టైప్–2 మధుమేహంతో పాటు గుండెపోటు సమస్యలను తగ్గించవచ్చట. భోజనం తర్వాత కనీసం 2 నుంచి 5 నిమిషాల పాటు నడిచినా, శరీరంలోని రక్తంలో ఉండే చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించొచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారం తిన్న వెంటనే కనీసం రెండు నుంచి ఐదు నిమిషాల పాటు నడవాలని ప్రముఖ వైద్యులు శ్రావణి రెడ్డి కరుమూరు అన్నారు. కుదిరితే 10 నిమిషాల పాటు నడవొచ్చన్నారు. 'తిన్న తర్వాత గంట నుంచి గంటన్నర లోపు మనం భుజించిన ఆహారంలో నుంచి గ్లూకోజ్ విడుదలవుతుంది. అంతస్థాయిలో విడుదలయ్యే గ్లూకోజ్‌ను తగ్గించాలంటే నడవడం అలవాటు చేసుకోవాలి' అని డా.శ్రావణి రెడ్డి అంటున్నారు. 'కాస్త నడవడం వల్ల కండరాలు కదులుతాయి. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ అవసరం పడుతుంది. తద్వారా ఇన్సులిన్ విడుదల అవుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ గ్లూకోజ్‌ను తీసుకెళ్లి కండరానికి సరఫరా చేస్తుంది. దీని వల్ల అధికంగా ఉండే గ్లూకోజ్‌ను తగ్గించొచ్చు. అలాగే మధుమేమం, గుండె సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు' అని ఆమె వివరించారు.