గురక సమస్య చిన్నదేమీ కాదని.. బాధితుల గుండె ఆరోగ్యానికి ఇది ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనినే అబ్‌స్ట్రెక్టివ్ స్లీప్ అప్నీయా (ఓఎస్‌వో)గా వ్యవహరిస్తారు. తీవ్రత ఎక్కువగా ఉంటే చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. గురక.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు. గురకను అదుపు చేసుకోకపోతే కాలక్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు.
అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే గురక మాత్రమే కాదు. శ్వాస కాసేపు ఆగుతుంది కూడా. నిద్రపోయినప్పుడు శరీరం మీద మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. గాఢంగా నిద్రపోతున్నకొద్దీ కండరాలు వదులవుతాయి. విశ్రాంతి స్థితిలోకి చేరుకుంటాయి. ఈ క్రమంలో శ్వాసమార్గం చుట్టుపక్కల కండరాలు కూడా వదులవుతాయి. చాలా మందికి ఇదేమీ ఇబ్బంది కలిగించదు. కానీ కొందరికి గాఢనిద్రలో కండరాలు చాలా వదులవుతాయి. ఇవి శ్వాస మార్గానికి అడ్డుపడతాయి. దీంతో శ్వాస ఆగుతుంది. ఇదే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా.
గురక తగ్గించుకునేందుకు 'సీపీఏపీ' చికిత్స ఉంది. అంటే కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్ అన్నమాట. నిద్రించేటప్పుడు ముక్కు, నోరు కవరయ్యేలా ఒక మాస్క్ ధరించాలి. దీనికి అనుసంధానంగా ఒక మిషన్ ఉంటుంది. ఇది గురక బాధితుల శ్వాసనాళాలు తెరుచుకునేలా సాయపడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం తేలికవుతుంది.
చికిత్సలో భాగంగా డాక్టర్లు మొదట చేసే పని- నిద్రలో ఉండే వ్యక్తి గుండె, ఊపిరితిత్తుల పనితీరుని ల్యాబ్‌లో పరీక్షిస్తారు. దీని ఆధారంగా వైద్యులు స్లీప్ అప్నియా పరీక్షలు చేస్తారు. ఈ పరీక్ష.. శ్వాసనాళాల పనితీరును తెలియజేస్తుంది.
అలాగే గురక స్థాయిలో పురుషులు, మహిళల మధ్య తేడాలుంటాయి. మెనోపాజ్ తర్వాత మహిళల్లో గురక వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ గురక శబ్దం మగవారి కంటే మహిళలది తక్కువే. అలాగే ఊబకాయం కూడా గురక రావడానికి ఒక కారణం. అధిక బరువుతో బాధపడుతున్నవారు వెయిట్‌లాస్ కావడం వల్ల గురక నుంచి కొంతమేర బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు. బరువు తగ్గితే నాలుకపై ఉన్న కొవ్వు తగ్గుతుంది. దవడ కండరం, శ్వాసమార్గ పక్కభాగంలో సైతం ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.
చికిత్సలతో సరి
ముక్కు నుంచే కదా అందరూ శ్వాస తీసుకుంటారు. ముక్కు లోపలి భాగంలో గాయమైనా, వాచిపోయినా, ఎలర్జీ వచ్చినా ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. ఇది గమనించి.. గురక సమస్య ఉన్నవారు తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చికిత్సలో భాగంగా.. రాత్రంతా నిద్ర స్థితిని పరిశీలిస్తారు. స్లీప్ స్టడీ అన్నమాట. ఊపిరి పీల్చుకోవడానికి వైద్యులు గమనిస్తారు. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా- స్కాన్, రక్తపరీక్షలు చేస్తారు.
గురక పెడుతున్నారా?.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనర్థాలు