‘రాబందులా... మృత కళేబరాల్ని పీక్కుతినే ఆ పక్షులు ఉంటే ఏమిటీ, లేకపోతే ఏమిటీ...’ అని ఎవరైనా అడగడం ఆలస్యం... ‘పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచే సహజ క్లెన్సర్లే రాబందులు. జీవావరణం బాగుండాలంటే ప్రతి ప్రాణీ ఉండాల్సిందే, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యతా మనదే’ అంటూ పాఠాలు చేప్పేస్తారు సైన్సు మాస్టారైన ప్రేమ్ సాగర్. అందుకోసం.. చేస్తున్న ఉద్యోగాన్నీ వదిలి రాబందుల రక్షణే లక్ష్యంగా పెట్టుకున్నాడాయన. ‘సొసైటీ ఫర్ ఎకో- ఎన్ డేంజర్డ్ స్పీషీస్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్’ అన్న స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వాటికి ఆవాసాన్ని కల్పిస్తూ ఆహారాన్ని అందిస్తూ ఆ సంతతిని పెంచేందుకు గత ఇరవయ్యేళ్లుగా కృషి చేస్తున్నాడు. అందులో భాగంగానే కొంకణ్ ప్రాంతంలో ఉన్న రాబందుల సంఖ్యను 22 నుంచి 347కి పెంచగలిగాడు.
అలా ఎలా..?
రాయ్‌గఢ్‌లోని మహాడ్‌కు చెందిన ప్రేమ్‌సాగర్‌కి చిన్నప్పటి నుంచీ పక్షి ప్రపంచం అంటే ఎంతో ఇష్టం. వాటిమీద డాక్యుమెంటరీలు తీస్తూ అవి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఉద్యోగం చేస్తూ అనేక రాష్ట్రాలు తిరిగాడు. ఒక దశలో ఉద్యోగానికి స్వస్తి పలికి, విదేశాల్లో వాటిమీద పరిశోధన చేసి, స్వస్థలానికి తిరిగొచ్చి, కొంకణ్ ప్రాంతంలో పర్యటనలూ పక్షుల గురించిన వర్కుషాపులూ నిర్వహించసాగాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో రాబందులు అంతరించిపోతున్నాయన్న వార్తాకథనం ఆయన్ని కదిలించింది. కారణాన్ని అన్వేషించగా తెలిసిందేమిటంతే- అడవుల్ని నరికి, తోటలు వేయడంతో అవి ఆవాసం కోల్పోయాయి. పల్లెలు శుభ్రంగా ఉంచే క్రమంలో జంతుకళేబరాల్నీ దహనమో ఖననమో చేయడంతో వాటికి ఆహారమూ కరవైంది. పైగా ఏడాదికి ఒక్క గుడ్డునే పెట్టి పిల్లను చేస్తాయవి. ఆ ఒక్క పిల్లా ఆకలితో చనిపోవడంతో సంతతి తగ్గిపోతూ వచ్చింది. అక్కడనే కాదు, దేశవ్యాప్తంగా వాటి సంఖ్య తగ్గిపోవడానికి కారణం జంతు కళేబరాల్లోని డైక్లోఫెనాక్ అన్న కారణంతో దాన్నీ నిషేధించారు. అయినప్పటికీ రాబందులు అంతరించిపోవడానికి నివాసం, ఆహార కొరతే ప్రధాన కారణమని గుర్తించిన ప్రేమ్‌సాగర్, ఆ దిశగా వాటి సంరక్షణను చేపట్టాడు. అందులో భాగంగా రాబందులు ఉన్న ప్రాంతాల్ని గుర్తించి, స్థానికులతో మాట్లాడి, ఆ చుట్టుపక్కల దట్టంగా అలుముకున్న అడవుల్ని కొట్టొద్దని కోరడమే కాదు, వాళ్లతో కలిసి యాభై వేల చెట్లనీ పెంచాడు. పాల్‌ఘర్, నానెమచి, సెంగావ్... వంటిచోట్ల గ్రామ దేవతలు కొలువైన అటవీ ప్రదేశాల్నీ రాబందుల నివాసంగా మలిచాడు. అటవీశాఖ అధికారులతో మాట్లాడి కర్‌గావ్, ఖామ్‌గావ్, కామ్‌శేత్... వంటి ప్రాంతాల్లోనూ వాటిని పరిరక్షించడంతో రాబందులతోపాటు హార్న్‌బిల్, గుడ్లగూబలకీ కూడా పచ్చని లోగిలి దొరికింది.