అనగనగా ఒకబ్బాయి. శరత్ వివేక్ సాగర్ అన్నది అతని పేరు. వాళ్లది బిహార్. తండ్రి స్టేట్‌బ్యాంకు ఉద్యోగే కానీ ఎక్కువగా మారుమూల పల్లెటూళ్లలో పని చేయాల్సి వచ్చింది. అక్కడ మంచి పాఠశాలలేవీ లేకపోవడంతో వాళ్లనాన్న శరత్‌ని ఇంట్లోనే ఉంచి చదివించాడు. అలా పన్నెండేళ్ల దాకా అతను బడిముఖమే చూడలేదు. వాళ్ల నాన్నకి బిహార్ రాజధాని పాట్నాకి బదిలీ అయ్యాకే ఓ బడిలో చేరాడు. అదీ నేరుగా ఎనిమిదో తరగతిలో. అప్పటి నుంచీ చదువులో అద్భుతాలే చేశాడు శరత్. వాళ్ల నాన్న ఇంటర్నెట్ ద్వారా చూసి ఎన్నో దేశీ విదేశీ పోటీలకి శరత్‌ని పంపిస్తుండేవాడు. అలా నాసా, గూగుల్, కొలంబియా వర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలు నిర్వహించే సైన్స్, మ్యాథ్స్ పోటీలకి వెళ్లి విజయాలు అందుకున్నాడు. పదిహేనేళ్లకే ఐరాస విద్యార్థి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు.
తండ్రి తనకి కల్పించిన ఇన్ని పోటీల అవకాశాలనీ, ఇంతటి ఎక్స్‌పోజర్‌నీ తన తోటి విద్యార్థులకీ పరిచయం చేయానుకున్నాడు. అలా 2005లో పదహారేళ్లకే ఓ సంస్థని ప్రారంభించాడు. అదే ‘డెక్స్‌టెరిటీ గ్లోబల్’. దాని ద్వారా సాటి విద్యార్థులకి లక్షల రూపాయల బహుమతులు వచ్చే పోటీల విషయాలే కాదు... కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ సంగతులూ చేరవేయడం మొదలుపెట్టాడు. తానూ అమెరికాలోని టక్స్ యూనివర్సిటీలో ‘ఇంటర్నేషనల్ అఫైర్స్’పైన డిగ్రీ చేశాడు. ఆ తర్వాత ఇండియా వచ్చి ‘డెక్స్‌టెరిటీ గ్లోబల్’ సంస్థని విస్తరించడం మొదలుపెట్టాడు. బిహార్‌లోని మారుమూల పల్లెటూళ్లలో ఉన్న నిరుపేద విద్యార్థుల్ని ఎంపిక చేసి పారిశ్రామిక, నాయకత్వ లక్షణాలలో శిక్షణ ఇస్తుండేవాడు. ఇందుకోసం దేశంలోని ఐఐటీ, ఐఐఎం నిపుణుల్నీ రప్పించాడు. నాసా, హార్వర్డ్ ప్రొఫెసర్ల చేత లెక్చర్లూ ఇప్పించేవాడు. ఓ సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఇదంతా దాదాపు ఉచితంగానే చేస్తుండేవాడు. సామాజిక సేవతో కూడిన ఈ వ్యాపార విధానాన్ని అమెరికాలోని మిషిగన్ వర్సిటీ, ఐఐటీ-నాగపుర్ తమ సిలబస్‌లలో చేర్చాయి. ఫోర్బ్స్ తన ‘30 అండర్ 30’ జాబితాలోనూ స్థానమిచ్చింది. బరాక్ ఒబామా 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్వేతసౌధానికి ఆహ్వానించి ముచ్చటించిన వందమంది యువనేతల్లో శరత్ ఏకైక భారతీయుడు! ఆ తర్వాత శరత్ తన ‘డెక్స్‌టెరిటీ గ్లోబల్’ సేవల్ని దేశం మొత్తానికీ విస్తరించాడు. ఇప్పటిదాకా ఆ సంస్థ ద్వారా 22 లక్షల మంది విద్యార్థులు రకరకాల నైపుణ్యాలు పెంచుకున్నారు. వీటితో పాటూ విద్యార్థులకి స్కాలర్‌షిప్‌లు ఇప్పించడానికి ‘డెక్స్‌టెరిటీ టు కాలేజ్’ (www.dexteritytocollege.com) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు.
ఆరు నుంచి డిగ్రీ దాకా...