Running tips for beginners to lose weight :
ఏమీ తినకుండానే పరిగెత్తుతున్నారా?
'ఏదైనా తిన్నా, తాగినా ఆ తర్వాత ఏ పనీ చేయడానికి శరీరం సహకరించదు.. ఇక రన్నింగ్ అయితే అసలే చేయలేం..' అనేది చాలామంది అభిప్రాయం. అందుకే ఏమీ తినకుండానే రన్నింగ్ చేస్తుంటారు. కానీ ఇది ముమ్మాటికీ పొరపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పరగడుపున పరిగెత్తడం వల్ల శరీరంలోని కొవ్వుల్ని కరిగించడానికి తగిన ఇంధనం మనం మన శరీరానికి అందించనట్లే లెక్క. దాంతో కొవ్వులు కరగకపోగా.. మనం మరింత నీరసించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కార్బోహైడ్రేట్లు అధికంగా లభించే పండ్లు (అరటి, యాపిల్, మామిడి), నట్స్, పాలు-పాల పదార్థాలు, పప్పులు, బ్రెడ్, కాయధాన్యాలు.. వంటివి గంట ముందే తీసుకొని ఆపై రన్నింగ్ చేయమంటున్నారు నిపుణులు. అలాగే పరిగెత్తడం పూర్తయ్యాక కూడా శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లుండే ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవడం తప్పనిసరి. ఇక పరిగెత్తడానికి గంట ముందు, తర్వాత నీళ్లు తాగడమూ ముఖ్యమేనని గుర్తు పెట్టుకోండి.
భుజాలు కదిలించాలి!
కొంతమంది పరిగెత్తేటప్పుడు చేతుల్ని కదిలించకుండా స్థిరంగా ఉంచుతుంటారు.. మరికొంతమందేమో కేవలం మోచేతుల్ని మాత్రమే ముందుకు వెనక్కి అంటూ పరుగు తీస్తుంటారు. నిజానికి ఈ రెండూ సరికాదంటున్నారు నిపుణులు. పరిగెత్తే క్రమంలో భుజాలకు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలట! అంతేకాదు.. వాటిని మరీ పైకి లేపి కాకుండా.. పొట్టకు సమాంతరంగా ఉంచి భుజాలు కదిలేలా ముందుకు, వెనక్కి అంటూ పరిగెత్తుతుంటే త్వరగా అలసిపోకుండా, గాయాల పాలుకాకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. ఇలా దీనివల్ల పరుగు వేగం కూడా అదుపులో ఉంటుందట! ఇక దీంతో పాటు పరిగెత్తే క్రమంలో పెద్ద పెద్ద అడుగులు వేయకుండా చూసుకోవడం వల్ల కూడా మన శరీరంలోని శక్తిని కాపాడుకుంటూ ముందుకు సాగచ్చు.. అలాగే శరీరం అదుపు తప్పి ప్రమాదాలు జరగకుండా కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు.